‘విజయ్‌’గాథ: ఎలాంటి కోచింగ్‌ లేకుండా 22 ఏళ్లకే సివిల్స్‌ ర్యాంకు

8 Nov, 2021 10:44 IST|Sakshi

ఇరవై రెండేళ్లకే సివిల్స్‌లో ర్యాంకు  

ఎలాంటి కోచింగ్‌ లేకుండా స్వయంకృషితో సాధన

తొలిప్రయత్నంలోనే సాధించిన 

తెనాలి యువకుడు విజయ్‌బాబు

తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంక్‌... ఏ కోచింగ్‌ సెంటరులోనూ శిక్షణ లేకుండా, కేవలం ఇంట్లోనే గడుపుతూ...! అదికూడా కేవలం 22 ఏళ్ల వయసులోనే సాధించటమంటే ఆషామాషీ కాదు. అలాగని అహోరాత్రాలు అతడు పుస్తకాలకే అంటుకుపోయాడా? అంటే అదీ లేదు. సగటున రోజుకు 7–8 గంటల చదువుతో తన కలను నిజం చేసుకున్నాడు. సివిల్స్‌ బీజాన్ని చిన్ననాటే అతడి మనసులో నాటిన తల్లిదండ్రులు సలహాలను మాత్రమే ఇస్తూ, చాయిస్‌ను అతడికే వదిలేశారు. ఈ కృషిలో రెండేళ్లు అతడు సోషల్‌మీడియాకు దూరంగా ఉంటే తల్లిదండ్రులు రెండేళ్లపాటు టీవీ వీక్షణను త్యాగం చేశారు.   

తెనాలి: తెనాలికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు సివిల్స్‌లో తొలిప్రయత్నంలోనే 682వ ర్యాంకు సాధించి, ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యారు. అతని తల్లిదండ్రులు రాజ్యలక్ష్మి, మధుబాబు. రాజ్యలక్ష్మి గ్రాడ్యుయేట్‌ అయితే, జీఎస్టీ సూపరింటెండెంట్‌గా చేస్తున్న మధుబాబు చదువుల దాహం తీరనిది. ఇప్పటికి ఎనిమిది పీజీలు చేశారాయన. జిల్లా కలెక్టరు కావాలని ఆశ పడినా దిగువ మధ్యతరగతి కుటుంబం, ఆర్థిక సమస్యల నడుమ అటుకేసి చూసే అవకాశం లేకపోయింది. 

తాను అందుకోలేకపోయిన సివిల్స్‌ సౌధాన్ని తమ కవల పిల్లలు అజయ్‌బాబు, విజయ్‌బాబు సాధిస్తే చూడాలని తపన పడ్డారు. అలాగని వారిపై ఒత్తిడేమీ తేలేదు. పునాది బాగుండే విద్యాసంస్థల్లో చేర్పించారు. పోటీపరీక్షలకు ప్రోత్సహించారు. నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛనిస్తూ, సలహాలు మాత్రం ఇస్తూ వచ్చారు. ఫలితంగానే విజయ్‌బాబు ఐఆర్‌ఎస్‌ను ఖాయం చేసుకున్నారు.  

తాతయ్య ఉత్తరంతో బీజం.. 
2007లో ప్రైవేటు కాన్వెంటులో నాలుగో తరగతి చదువుతుండగా విజయ్‌బాబు జిల్లాస్థాయి భగవద్గీత పోటీల్లో పాల్గొన్నారు. డిగ్రీ విద్యార్థులతో పోటీపడి బహుమతి సాధించారు. సంతోషపడిన తాతయ్య ప్రభాకరరావు భవిష్యత్తులో కలెక్టరు కావాలంటూ ఆశీర్వదిస్తూ ఉత్తరం రాశారు. అప్పుడే తన మనసులో బలమైన ముద్ర పడిందని, ఇప్పటికీ ఆ ఉత్తరం తన దగ్గరుందని  విజయ్‌బాబు చెప్పారు. 

టెన్త్‌లో 10/10 జీపీఏ సాధించాక విజయ్‌ తెనాలిలోని ప్రైవేటు కాలేజీలో చేరారు. తోటివారంతా ఎంపీసీ గ్రూపు తీసుకుంటుంటే, అతను ఎంఈసీని ఎంచుకున్నారు. ‘సివిల్స్‌ కొట్టాలంటే ఇంజినీరింగ్‌ చేయాలని రూలేం లేదు.. ఆర్ట్స్‌ గ్రూపుతోనే సాధించొచ్చు.’ అన్న తండ్రి సలహాను నూరుశాతం నమ్మారు. రకరకాల ఫౌండేషన్‌ కోర్సుల పేరుతో ఎంపీసీ విద్యార్థులపై ఉండేంత ఒత్తిడి ఆర్ట్స్‌కు ఉండకపోవటం నిజంగా కలిసొచ్చిందని అంటారు విజయ్‌బాబు. ప్రశాంతంగా చదువుకుని 975 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3, 4 ర్యాంకుల్లో నిలిచానని చెప్పారు. 

ఐఏఎస్‌పైనే గురి.. 
ఇంటర్‌ తర్వాత డిగ్రీకి ప్రతిష్టాత్మకమైన న్యూఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీని విజయ్‌ ఎంచుకున్నారు. 400 సీట్ల కోసం 30 వేల మంది పోటీపడితే రాతపరీక్ష, ఇంటర్వ్యూలోనూ నెగ్గి సీటు ఖాయం చేసుకున్నారు. 2019లో బీఏ ఆనర్స్‌ను ఫస్ట్‌ డివిజనులో పాసై జూలైలో తెనాలి వచ్చేశారు. అప్పట్నుంచి సివిల్స్‌కి గురిపెట్టారు. ఇటీవల విడుదలైన ఫలితాల్లో 682 ర్యాంకును పొందారు. 

గతంలో సివిల్స్‌ టాపర్స్‌ ఇంటర్వ్యూలను వినటం, వారి విధానాల్లో తనకు నప్పినవి ఎంచుకుని పాటించటం, ఆన్‌లైన్‌లో టెస్ట్‌ సిరీస్‌తో ప్రాక్టీస్‌ చేయటం, దినపత్రికలు చదవటం, తనలాగే సివిల్స్‌కు తయారవుతున్న మిత్రులతో చర్చిస్తూ, తప్పొప్పులు సరిచేసుకుంటూ రెండేళ్లపాటు పడిన శ్రమకు ఫలితం లభించిందని విజయ్‌బాబు చెప్పారు. 

రోజూ జాగింగ్, మెడిటేషన్‌ విధిగా చేశానని తెలిపారు. తల్లిదండ్రులు టీవీ వీక్షణ త్యాగం చేశారని చెప్పారు. ఐఆర్‌ఎస్‌ పోస్టింగ్‌ తీసుకున్నా  ఐఏఎస్‌ సాధనకు మళ్లీ సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్ష తన సోదరుడు అజయ్‌బాబుతోపాటు రాసినట్టు చెప్పారు. ఇద్దరికీ బెస్టాఫ్‌ లక్‌ చెబుదాం.

మరిన్ని వార్తలు