అప్పుడు జగన్‌ అభినందించారు.. ఆ స్ఫూర్తితోనే..

5 Aug, 2020 10:31 IST|Sakshi

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: సివిల్స్‌ పరీక్షలలో జాతీయ స్థాయిలో రిషికేశ్‌ రెడ్డి 95వ ర్యాంక్‌ సాధించడం పట్ల చాలా సంతోషంగా ఉందని ఆయన తండ్రి సుబ్బారెడ్డి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన సాక్షిటీవీతో మాట్లాడుతూ.. 'చిన్నప్పటి నుంచి రిషి చదువులో ముందుండే వాడు. మొదటి ప్రయత్నంలోనే ఇంటర్వూ వరకు వెళ్లాడు. నాలుగో ప్రయత్నంలో అనుకున్న ర్యాంకు సాధించాడు. పులివెందుల నియోజకవర్గం నుంచి సివిల్స్ సాధించిన రెండో వ్యక్తి మా అబ్బాయి కావడం సంతోషంగా ఉంది. గతంలో ఇండియన్ రైల్వే  ట్రాఫిక్ సర్వీసెష్‌ సాధించినప్పుడు వైఎస్ జగన్ అభినందించారు. ఆ స్ఫూర్తితోనే ఈసారి సివిల్స్‌లో 95వ ర్యాంకు సాధించాడని' సుబ్బారెడ్డి తెలిపారు. 

రిషి సడలని కృషి
వేంపల్లె : కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలి.. పది మందికి సేవ చేసే భాగ్యం దక్కించుకోవాలనే లక్ష్యంతోనే చదివాడు. ఆ ఆశయం సాధించేవరకు విశ్రమించకుండా తల్లిదండ్రుల మాటను తప్పకుండా పాటించి విజయం సాధించారు. ప్రణాళికాబద్ధంగా చదివి సివిల్స్‌ పరీక్షలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్‌ సాధించారు. చిన్న నాటి నుంచి కలెక్టర్‌ కావాలనే కలను నెరవేర్చుకున్నారు. నాలుగుసార్లు పట్టు వదలకుండా సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యి తన కలను నెరవేర్చుకున్నారు వేంపల్లెకు చెందిన సింగారెడ్డి రిషికేశ్‌రెడ్డి.  వేంపల్లెకు చెందిన సింగారెడ్డి సుబ్బారెడ్డి, సుజాత దంపతుల కుమారుడు రిషికేశ్‌రెడ్డి. మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాలలో జాతీయస్థాయిలో 95వ ర్యాంక్‌ సాధించాడు. (సివిల్స్‌ టాపర్‌ ప్రదీప్‌ సింగ్‌)


కుటుంబ సభ్యులతో రిషికేశ్‌రెడ్డి  
ప్రస్తుతం వీరు కడప నగరం హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉంటున్నారు. ఇతడు ఒకటవ తరగతి నుంచి 5వ తరగతి వరకు వేంపల్లెలోని శ్రీచైతన్య ఉన్నత పాఠశాలలో చదివాడు. 6, 7 తరగతులు తిరుపతి విద్యానికేతన్‌ స్కూల్‌లోనూ, 8వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు హైదరాబాద్‌లో చదివాడు. 10వ తరగతిలో 537మార్కులు సాధించాడు. ఇంటర్‌ ఎంపీసీ విభాగంలో 961మార్కులు సాధించారు. ఎంసెట్, జేఈఈ పరీక్ష రాసి ఎంసెట్‌లో 116వ ర్యాంక్, జేఈఈలో జాతీయస్థాయిలో 153వ ర్యాంక్‌ సంపాదించాడు. జేఈఈ ర్యాంక్‌లో రిషికేశ్‌ ఢిల్లీ ఐఐటీలో సీటును దక్కించుకున్నాడు.

సివిల్‌ సర్వీసెస్‌లో విజయం సాధించాలని రిషికేశ్‌రెడ్డి తపన పడేవాడు. ఢిల్లీ ఐఐటీలో ఇంజనీరింగ్‌ కోర్సు చేరాక.. ఎలాగైన ఐఏఎస్‌ కావాలనే తపన అతనిలో మొదలైంది. చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు చెబుతున్న మాటలు నిరంతరం గుర్తు పెట్టుకునేవాడు. ఉన్నత స్థానం చేరాలని కలలుకనేవాడు. ఇంజినీరింగ్‌ చదువుతూనే సివిల్స్‌కు సిద్ధమయ్యాడు. సివిల్స్‌ సాధించాలనే లక్ష్యంతో రోజుకు 8గంటలపాటు ప్రణాళికాబద్ధంగా చదివాడు. మానసిక ఒత్తిడిని తగ్గించుకునేందుకు టీవీల్లో వచ్చే వివిధ ఆటల పోటీలను చూస్తుండేవాడు. 2015లో మొదటిసారి సివిల్స్‌ పరీక్ష రాసి ఇంటర్వ్యూ వరకు వెళ్లాడు. (సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు)

2016లో రెండవసారి పరీక్ష రాయగా ఎంపిక కాలేదు. తర్వాత ఎక్కడ మార్కులు తగ్గాయని.. వాటి లోపాలను విశ్లేషించుకుని అధిగమించే ప్రయత్నం చేశాడు. 2017లో సివిల్స్‌ పరీక్ష రాసి జాతీయస్థాయిలో 374వ ర్యాంక్‌ సాధించారు. ఇండియన్‌  రైల్వే సర్వీస్‌లో ఉద్యోగం పొందారు. ఏడాదిపాటు ట్రైనింగ్‌లో ఉంటూ పట్టువదలని విక్రమార్కుడిలా చదివి నాల్గవసారి సివిల్స్‌ పరీక్షను రాసి జాతీయస్థాయిలో 95వ ర్యాంక్‌ సాధించాడు. జిల్లా ఖ్యాతిని నిలిపి విజేతగా నిలిచాడు. మూడుసార్లు ప్రయత్నించి ర్యాంక్‌ రాలేదని నిరుత్సాహపడి ప్రయత్నాలను ఆపేయకూడదని.. మళ్లీ పట్టుదలతో ప్రయత్నం చేసి విజయం సాధించారు.

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా