దుర్గమ్మ సన్నిధిలో సీజేఐ దంపతులు

26 Dec, 2021 03:38 IST|Sakshi
అమ్మవారి దర్శనానికి వెళ్తున్న జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

సాక్షి, అమరావతి బ్యూరో: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ సతీసమేతంగా శనివారం ఉదయం దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్ద రాష్ట్ర సమాచార, పౌరసంబంధాల శాఖమంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) వారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ మర్యాదలతో దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్‌ పైలా సోమినాయుడు, కార్యనిర్వహణాధికారి భ్రమరాంబ, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతించారు. అంతరాలయంలో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆశీర్వాద మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థ ప్రసాదాన్ని అందజేశారు. సీజేఐ వెంట ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌చంద్ర శర్మ, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కన్నెగంటి లలిత, ఏపీ, తెలంగాణ హైకోర్టుల రిజిస్ట్రార్లు, విజయవాడ ఎంపీ కేశినేని నాని, దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్, కమిషనర్‌ హరిజవహర్‌లాల్, కలెక్టర్‌ జె. నివాస్, పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా తదితరులు ఉన్నారు. 

మరిన్ని వార్తలు