‘తెలుగు రాష్ట్రాల్లో పర్యటన.. ఎంతో ఆనందాన్నిచ్చింది’

19 Jun, 2021 07:59 IST|Sakshi

మల్లన్న దర్శనానికి ఏటా రెండు, మూడుసార్లు వచ్చేవాడిని

ఏపీ ప్రభుత్వ ఏర్పాట్లు భేష్‌

అధికారులు, ప్రజాప్రతినిధులకు ధన్యవాదాలు

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ

శ్రీశైలం టెంపుల్‌: వారం రోజులుగా తెలుగు గాలిని పీలుస్తూ.. తెలుగు నేలపై తిరుగుతుండడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. శ్రీశైలంలోని శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లను శుక్రవారం ఉదయం ఆయన దర్శించుకున్నారు. శ్రీశైలంలోని అతిథి గృహం వద్దకు చేరుకున్న ఆయనకు దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ వీరపాండియన్, ఎస్పీ ఫక్కీరప్ప తదితరులు పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు.

అనంతరం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మల్లన్నను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అత్యంత స్వల్ప వ్యవధిలో రాష్ట్ర ప్రభుత్వానికి తన కార్యక్రమం చెప్పినప్పటికీ అన్ని ఏర్పాట్లు భేషుగ్గా చేశారని ప్రశంసించారు. రాష్ట్ర మంత్రి, పార్లమెంట్‌ సభ్యులు, ఎమ్మెల్యే, ఇతర అధికారులు స్వయంగా వచ్చి స్వాగతం పలికారని.. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు.

తనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏటా రెండు మూడుసార్లు ఇక్కడకు వచ్చి స్వామి అమ్మవార్లను దర్శించుకునే వాడినని తెలిపారు. కర్నూలు జిల్లాతో తనకు ఎంతో అవినాభావ సంబంధం ఉందని, వృత్తిరీత్యా ఈ ప్రాంతానికి చెందిన ఏరాసు అయ్యపరెడ్డి వద్ద 10ఏళ్లపాటు జూనియర్‌గా పనిచేశానని జస్టిస్‌ ఎన్వీ రమణ గుర్తుచేశారు.


శ్రీశైల వైభవం పుస్తకావిష్కరణ
స్కంద పురాణంలోని శ్రీశైల ఖండం మూలప్రతిని సంస్కృతం నుంచి  తెలుగులో శ్లోక భావార్థాలను రూపొందించడంలో కీలకపాత్రను పోషించిన త్రిష్టి లక్ష్మీసీతారామాంజనేయ శర్మను సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ సత్కరించారు. అలాగే, ఘంటా మఠం జీర్ణోద్ధరణ పనుల్లో లభించిన పురాతన తామ్ర శాసనాల విశేషాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం దేవస్థానం ప్రచురించిన శ్రీశైల వైభవం పుస్తకాన్ని ఆయన  ఆవిష్కరించారు. కాగా, సీజే జస్టిస్‌ ఎన్వీ రమణ వెంట ఏపీ హైకోర్టు రిజిస్ట్రార్‌ న్యాయమూర్తి జస్టిస్‌ డి.వెంకటరమణ, తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్‌ న్యాయమూర్తి జస్టిస్‌ వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. 


చదవండి: ‘యాదాద్రి అద్భుతం.. అద్వితీయం’ సీజేఐ ప్రశంసలు

మరిన్ని వార్తలు