శ్రీవారి సేవలో సీజేఐ ఎన్వీ రమణ

12 Jun, 2021 04:16 IST|Sakshi
ధ్వజస్తంభానికి నమస్కరిస్తున్న సుప్రీం కోర్టు చీఫ్‌ జస్టిస్‌ ఎన్వీ రమణ దంపతులు

ఆలయ మర్యాదలతో 

స్వాగతం పలికిన టీటీడీ చైర్మన్, ఈవో, ప్రధానార్చకులు 

తిరుమల/చంద్రగిరి/రేణిగుంట: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని, అనంతరం తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉదయం సతీసమేతంగా తిరుమల ఆలయం వద్దకు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ప్రధానార్చకులు వేణుగోపాల దీక్షితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో సీజేకు పండితులు ఆశీర్వచనం అందించారు. అనంతరం సీజే ఎన్వీ రమణ వేంకటేశ్వర భక్తి చానల్‌తో మాట్లాడుతూ తిరుమల శ్రీవారి ఆశీస్సులతోనే తాను ఈ స్థాయికి చేరుకున్నట్టు చెప్పారు. న్యాయ వ్యవస్థను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లేందుకు కృషిచేస్తానన్నారు.

అనంతరం బేడీ ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అనంతరం సీజే దంపతులు తిరుమల నుంచి తిరుచానూరుకు చేరుకుని శ్రీపద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి స్వాగతం పలికారు. ‘ఏం భాస్కర్‌.. బాగున్నావా? బాగా పనిచేస్తున్నావ్‌.. కరోనా నుంచి ప్రజలను కాపాడేందుకు చేపట్టిన ఆనందయ్య ఆయుర్వేద ఔషధం తయారీ అభినందనీయం. నువ్వు పంపిణీ చేసిన ఔషధం నాకూ అందిందయ్యా.. నువ్వు ఇలాగే ప్రజా క్షేమం కోసం మంచి కార్యక్రమాలు తలపెట్టాలి’ అంటూ ఎమ్మెల్యే డాక్టర్‌ చెవిరెడ్డిని సీజే అభినందించారు. మరోసారి తిరుపతికి వచ్చినప్పుడు తుమ్మలగుంట శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంతో పాటు వేద పాఠశాల, పిరమిడ్‌ ధ్యాన మందిరాన్ని సందర్శిస్తానని చెవిరెడ్డితో చెప్పారు. ఈ మేరకు మరోసారి పర్యటనలో తుమ్మలగుంట కార్యక్రమాన్ని పొందుపరచాలని జిల్లా జడ్జిని ఆదేశించారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి, టీటీడీ పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.  

సీజే ఎన్వీ రమణను కలిసిన పలువురు  
శ్రీవారి దర్శనానికి వచ్చిన సుప్రీంకోర్టు సీజే ఎన్వీ రమణను పలువురు కలిశారు. గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని యుగతులసి ఫౌండేషన్‌ చైర్మన్‌ శివకుమార్‌ వినతిపత్రం ఇచ్చారు. అలాగే శ్రీవారి ఆలయ ప్రధానార్చకులు రమణదీక్షితులు కలిసి సుప్రీంకోర్టు సీజేగా నియమితులైనందుకు శుభాకాంక్షలు చెప్పారు. ఇదిలా ఉండగా సీజే ఎన్వీ రమణ తన స్నేహితుడు, శ్రీవారి ఆలయ ప్రత్యేకాధికారి డాలర్‌ శేషాద్రిని కలిశారు. ఆ తర్వాత ఆయన రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ కె.లలితకుమారి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి రవీంద్రబాబు, గూడూరు ఎమ్మెల్యే వరప్రసాద్, జిల్లా కలెక్టర్‌ హరినారాయణన్‌ తదితరులు ఆయనకు వీడ్కోలు పలికారు.  

హైదరాబాద్‌కు సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ 
సాక్షి, హైదరాబాద్‌: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించాక శుక్రవారం హైదరాబాద్‌కు వచ్చిన జస్టిస్‌ ఎన్వీ రమణకు తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, సీఎం కె.చంద్రశేఖర్‌రావులు ఘన స్వాగతం పలికారు. శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రాయానికి శుక్రవారం వచ్చిన ఆయన నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు. శని, ఆదివారాలు సెలవులు రావడంతో రాజ్‌భవన్‌ అతిథి గృహంలో సీజేఐ బస చేయనున్నారు.  

మరిన్ని వార్తలు