రోజు ఏమార్చి రోజు..!

25 Jun, 2022 12:53 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఇంటింటికీ చెత్త సేకరణ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రభుత్వ ఆశయానికి ఆదిలోనే అడ్డంకులను సృష్టిస్తున్నారు. ప్రతి రోజూ చెత్త సేకరించాల్సిన క్లాప్‌ వాహనాలు కాస్తా ఏమార్చి... రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నాయి. గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ) పరిధిలోని కొన్ని కాలనీలల్లో ప్రతి రోజూ చెత్తను సేకరించడం లేదు. కాలనీ పెద్దగా ఉందన్న కారణంతో పాటు ఎత్తైన కొండవాలు ప్రాంతాలున్నాయన్న కారణాన్ని చూపుతూ చెత్త సేకరణను కాస్తా అటకెక్కిస్తున్నాయి.

అసలే వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో క్లాప్‌ వాహనదారులు కాస్తా మొండికేస్తుండటం చెత్త సమస్యతో పాటు కొత్త రోగాల సమస్యలను కూడా తెచ్చిపెడుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోజూ 30 కిలోమీటర్ల మేర వాహనాలను తిప్పుతున్నామన్న కారణాన్ని చూపుతూ రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ విధంగా కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్తను సేకరిస్తున్నామన్న సమాచారం కాస్తా సదరు కాంట్రాక్టరు జీవీఎంసీ అధికారులకు ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సదరు వ్యవహారంపై జీవీఎంసీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నార న్నది చూడాల్సి ఉంది.    

ఇదీ అసలు ఉద్దేశం 
వాస్తవానికి ప్రతి ఇంటి నుంచి రోజూ చెత్తను సేకరించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం క్లాప్‌ వాహనాలను ప్రారంభించింది. ఇంటింటికీ సదరు క్లాప్‌ వాహనం వెళ్లి... పొడి చెత్త, తడిచెత్తను వేరు చేస్తూ చెత్తను సేకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో 629 వాహనాలు అవసరమని పేర్కొంటూ జీవీఎంసీ ప్రభుత్వానికి ప్రతిపాదనలను సమర్పించింది. ఇప్పటివరకు 625 వాహనాలను ప్రభుత్వం కేటాయించింది. ఈ వాహనాలను ఆయా వార్డులు, సచివాలయాల వారీగా కేటాయించారు. ఏ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చెత్తను సేకరించాలి? ఎక్కడ డంప్‌ చేయాలనే విషయాన్ని కూడా పక్కాగా రూట్‌ మ్యాప్‌ను జీవీఎంసీ అధికారులు నిర్దేశించారు.

ప్రతి రోజూ ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం ద్వారా ఎక్కడికక్కడ చెత్తను పారవేసే అవకాశం ఉండకపోవడం వల్ల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉండదు. అంతేకాకుండా చెత్త పేరుకుపోయి నగరం దుర్గందభరితంగా మారకుండా క్లీన్‌ సిటీగా ఉంటుంది. మరోవైపు ఈ విధంగా సేకరించిన చెత్తను కాపులుప్పాడలోని డంపింగ్‌ యార్డుకు తరలించి... అక్కడ విద్యుత్‌ను కూడా ఉత్పత్తి చేస్తున్నారు. ఇప్పటికే అక్కడి ప్లాంటులో చెత్త నుంచి విద్యుత్‌ తయారవుతోంది.

ఈ విద్యుత్‌ను జీవీఎంసీ కాస్తా తూర్పుప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఈపీడీసీఎల్‌)కు విక్రయించడం ద్వారా యూనిట్‌కు రూ.6కుపైగా మొత్తాన్ని పొందుతోంది. ఒకవైపు ప్రజల ఆరోగ్యం మెరుగుపడటం... నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంతో పాటు విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఆదాయవనరుగా మార్చుకునే ఉద్దేశ్యంతో ఈ ప్రాజెక్టును ప్రభుత్వం ప్రారంభించింది. అయితే, ఇందుకు విరుద్ధంగా కొన్ని కాలనీలల్లో జరుగుతుండటం గమనార్హం.  

పక్కాగా రూట్‌ ఉండాలంటూ...! 
చెత్త సేకరణ కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా చేపట్టేందుకు జీవీఎంసీ ఉన్నతాధికారులు గత నెలలో నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు అనుగుణంగా చెత్త సేకరణ వాహనాలకు పక్కాగా రూట్‌మ్యాప్‌ చేయాలని నిర్ణయించింది. ఏ సమయానికి ఎక్కడెక్కడ ఉండాలనే పక్కా ప్లానింగ్‌ను అమలు చేసేందుకు నిర్ణయించారు. ఉదయం 6 గంటలకు బయలుదేరే చెత్త సేకరణ వాహనం ఎక్కడి నుంచి మొదలై.... ఎక్కడెక్కడకు ఎంత సమయానికి చేరుకోవాలంటూ సమయాన్ని నిర్దేశించి పక్కా రూట్‌మ్యాప్‌ను అమలు చేయాలని ఆదేశించారు. తద్వారా చెత్త సేకరణకు ఏ సమయానికి ఎక్కడున్నాయో...తమ ఇంటికి ఏ సమయానికి వస్తుందన్న సమాచారం కూడా ప్రజలకు తెలియాలనేది ఆలోచన.

ప్రస్తుతం ఒక్కో రోజు ఒక్కో సమయానికి చెత్త సేకరణ వాహనం ఇళ్ల వద్దకు వస్తుండటంతో ప్రజలు కాస్తా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ తాజా నిర్ణయంతో ప్రజలకు కూడా ఇబ్బందులు లేకుండా నిర్దేశించిన సమయానికే ఇంటి వద్దకు వాహనం వస్తుందన్న ధీమా కలిగింది. దీని అమలు బాధ్యతను శానిటరీ సూపర్‌వైజర్లు, ఇన్‌స్పెక్టర్లు చూడాలని స్పష్టం చేశారు. అయితే, ఇది కాస్తా కొన్ని కాలనీల్లో పూర్తి విరుద్ధంగా తయారయ్యింది. రెండు రోజులకు ఒక్కసారి వాహనం వచ్చే పరిస్థితి ఏర్పడింది.  

దూరమవుతుందంటూ..! 
వాస్తవానికి జీవీఎంసీ పరిధిలో చెత్త సేకరణ కోసం 629 వాహనాలు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపారు. ఇందుకు అనుగుణంగా జీవీఎంసీకి ఇప్పటివరకు 625 వాహనాలను కేటాయించారు. అయితే, ఈ వాహనాలకు ఇప్పటికే రూట్‌మ్యాప్‌ను అందించారు. అయినప్పటికీ తమకు కేటాయించిన ప్రాంతంలో పార్కింగ్‌కు అవకాశం లేదంటూ ఎక్కడో దూరంగా పార్కింగ్‌ చేసుకుంటున్నారు. పార్కింగ్‌ ప్రాంతం నుంచి చెత్త సేకరణ కోసం బయలుదేరాల్సిన ప్రాంతానికే కొన్ని సమయాల్లో 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం ఉంటోంది. ఈ దూరాన్ని కూడా ఇప్పుడు వాహనం తిరిగినట్టుగా సదరు కాంట్రాక్టరు లెక్కలు చూపుతున్నారు.

ఫలితంగా ప్రతి రోజూ 50 నుంచి 60 కిలోమీటర్ల మేరకు వాహనం తిరిగినట్టుగా లెక్కలు తేలుతున్నాయి. ఈ మొత్తం దూరానికి కూడా జీవీఎంసీ అదనపు మొత్తం చెల్లించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో రోజూ 30 కిలోమీటర్ల మించి తిరగాల్సిన అవసరం లేకుండా దగ్గరలోనే పార్కింగ్‌కు ఏర్పాటు చేయాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిని ఆసరాగా తీసుకుని క్లాప్‌ వాహనదారులు 30 కిలోమీటర్లు మించి పోతుందంటూ కొన్ని కాలనీలల్లో రెండు రోజులకు ఒక్కసారి చెత్త సేకరణ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ సమాచారమేదీ కనీసం జీవీఎంసీ అధికారులకు సదరు కాంట్రాక్టరు అందించలేదని తెలుస్తోంది. మరోవైపు కొన్ని కాలనీల నుంచి జీవీఎంసీ అధికారులకు ఫిర్యాదులు కూడా అందుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చెత్త సేకరణపై ఇబ్బందులు లేకుండా చేసేందుకు జీవీఎంసీ అధికారులు ఏం చర్యలు తీసుకుంటారన్నది తేలాల్సి ఉంది.  

(చదవండి: అన్న.. చెల్లి.. అదుర్స్‌ .. జాతీయ స్థాయిలో పతకాల పంట)

మరిన్ని వార్తలు