అన్ని పథకాలకు అండగా నిలుస్తాం

24 Oct, 2020 04:13 IST|Sakshi
జి.రాజ్‌కిరణ్‌రాయ్, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు , వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌

ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో బ్యాంకర్ల స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అన్ని పథకాలకు పూర్తి అండగా నిలుస్తామని, ముఖ్యంగా వ్యవసాయ రంగానికి రుణాలు అందించడంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చూపబోమని బ్యాంక్‌ అధికారులు వెల్లడించారు. శుక్రవారం సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన 212వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ విజ్ఞఫ్తికి బ్యాంకర్లు సానుకూలంగా స్పందించారు.

బ్యాంకులు ముందుంటాయి
రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. దేశంలోనే తొలిసారిగా చిరు వ్యాపారులు, హస్తకళల కళాకారులకు ఆర్థిక సహాయం చేస్తున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆ దిశగా సహాయం చేయడానికి బ్యాంకులు కూడా ముందుకు వస్తాయి.    
– జి.రాజ్‌కిరణ్‌రాయ్, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు

వైఎస్సార్‌ జిల్లాలో నూరు శాతం డిజిటలైజేషన్‌
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాలకు పూర్తి అండగా నిలుస్తాము. వైఎస్సార్‌ కడప జిల్లాలో నూటికి నూరు శాతం డిజిటలైజేషన్‌ ప్రక్రియ కొనసాగుతోంది. లక్ష్యానికి అనుగుణంగా దాన్ని పూర్తి చేస్తాం.            
– వి.బ్రహ్మానందరెడ్డి, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌

కోవిడ్‌ సంక్షోభంలోనూ పథకాలు
కోవిడ్‌ సంక్షోభంలో కూడా సీఎం ఏ ఒక్క పథకాన్ని నిర్లక్ష్యం చేయలేదు. ఆర్బీకేల వద్ద బ్యాంక్‌ సేవలు కూడా అందాలి. అదే విధంగా కౌలు రైతుల సమస్యలు కూడా బ్యాంకులు పట్టించుకోవాలి.
   – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి

ఎంఎస్‌ఎంఈలను ఆదుకున్నాం
కోవిడ్‌ సంక్షోభంలోనూ ఎంఎస్‌ఎంఈలకు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను సీఎం విడుదల చేశారు. ఆ నిధుల వల్ల ఎంఎస్‌ఎంఈ రంగం నిలదొక్కుకోగలిగింది. 
– మేకపాటి గౌతమ్‌రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి

బ్యాంకుల భాగస్వామ్యం వల్లే సఫలీకృతం
బ్యాంకుల భాగస్వామ్యం వల్లే అన్ని పథకాలు సఫలీకృతం అవుతున్నాయి. బ్యాంకులు అన్ని విధాలుగా సహకరిస్తున్నాయి. కోవిడ్‌ సమస్య ఉన్నప్పటికీ ఆరోగ్య, విద్యా రంగాలలో ఎక్కడా వెనుకబాటు లేదు. అన్ని పథకాలు అమలు చేస్తున్నాం. పంటల ఈ–క్రాపింగ్‌ కూడా జరుగుతోంది. స్కిల్డ్‌ మ్యాన్‌ పవర్‌ లోటు లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నాం.     
– నీలం సాహ్ని, సీఎస్‌  

మరిన్ని వార్తలు