ఆంధ్రా పుణ్యంతోనే అన్నం తింటున్నాం..

26 Oct, 2021 03:05 IST|Sakshi
తమకు రక్షణ కల్పించాలని విజయనగరం కలెక్టర్‌కు వినతిపత్రమిస్తున్న కొఠియా ప్రజలు

అన్ని పథకాలు అందుకుంటున్నాం

వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజల స్పష్టీకరణ

ఒడిశా అధికారులు, నాయకుల రౌడీయిజం నుంచి రక్షణ కల్పించాలని వినతి

సాక్షి ప్రతినిధి, విజయనగరం: ప్రస్తుత ఆంధ్రా పాలకుల దయవల్ల ఆనందంగా జీవించగలుగుతున్నామని, తమను ఆంధ్రప్రదేశ్‌ వాసులుగానే పరిగణించాలని ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని వివాదాస్పద కొటియా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న అమ్మ ఒడి, వైఎస్సార్‌ రైతుభరోసా, జగనన్న చేయూత, వైఎస్సార్‌ ఆసరా వంటి సంక్షేమ పథకాలు తమను ఎంతగానో ఆదుకుంటున్నాయని వారు స్పష్టం చేశారు.  

వివరాల్లోకి వెళితే.. ఆంధ్రా–ఒడిశా సరిహద్దులో వివాదాస్పదంగా మారిన కొటియా, గంజాయిభద్ర, పనికి, రణసింగి, దిగువశెంబి, ఎగువ శెంబి, సినివలస, కోనదొర తదితర కొటియా గ్రూపు 21 గ్రామాల నుంచి 50 మంది సోమవారం విజయనగరం కలెక్టరేట్‌లో స్పందన కార్యక్రమానికి వచ్చారు. కలెక్టర్‌ ఎ.సూర్యకుమారిని కలిసి తమ గ్రామాల సమస్యలను విన్నవించారు.

తాము ఆంధ్రులమని, తమది ఆంధ్రప్రదేశ్‌ కాబట్టి ఒడిశా అధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి తమకు రక్షణ కల్పించాలని విన్నవించారు. 21 కొటియా గ్రామాలను ఆక్రమించేందుకే ఒడిశా ప్రభుత్వం హుటాహుటిన భవనాల నిర్మాణం చేస్తోందని తెలిపారు. ఇటీవల కాలంలో కోరాపుట్‌ ఎమ్మెల్యే, పోలీసులు తమపై రౌడీయిజం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర, పార్వతీపురం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కూర్మనాథ్‌ను కూడా కొటియా గ్రామాల్లోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని వివరించారు.

పూర్వం నుంచి తాము ఆంధ్రులమేనని, అందుకు సంబంధించిన భూమిశిస్తు తామ్రపత్రాలు తమ వద్ద ఉన్నాయని వెల్లడించారు. దీనిపై కలెక్టర్‌ సానుకూలంగా స్పందించారు. ఏపీ ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా భవిష్యత్‌ కార్యాచరణ ఉంటుందని కొటియా ప్రజలకు హామీ ఇచ్చారు. అనంతరం సమావేశ మందిరంలో కొటియా గ్రామప్రజలను కలెక్టర్‌ సత్కరించారు. వారితో కలిసి భోజనం చేశారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్లు జీసీ కిశోర్‌కుమార్, మహేష్‌కుమార్, వెంకటరావు, మయూక్‌ అశోక్, డీఆర్‌వో గణపతిరావు తదితరులు పాల్గొన్నారు.

అన్నివిధాలా రక్షణ...
కొటియా గ్రామాల ప్రజలకు అన్నివిధాలా రక్షణ కల్పిస్తామని విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక హామీ ఇచ్చారు. ఒడిశా పోలీసుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ కొటియా ప్రజలు ఆమెను కలిశారు. కొటియాలో త్వరలోనే పోలీసుస్టేషన్‌ ఏర్పాటు చేసేందుకు ఉన్నతాధికారుల అనుమతి కోరినట్లు ఆమె చెప్పారు. వారికి నిత్యావసర వస్తువులను ఎస్పీ అందించారు. 

మరిన్ని వార్తలు