ప్రశాంతంగా ముగిసిన ‘పది’ పరీక్షలు 

16 Apr, 2023 02:53 IST|Sakshi

ఈ నెల 19 నుంచి 26 వరకు మూల్యాంకనం 

మే 2వ వారంలో ఫలితాలు 

గతేడాది అనుభవాల దృష్ట్యా పకడ్బందీ చర్యలు 

సీఎం జగన్‌ ఆదేశాలతో లీక్, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు 

ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ 

పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్న పత్రాలకు బార్‌ కోడింగ్‌.. ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి ప్రధాన పేపర్ల పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పరీక్షలను  ఆరు పేపర్లతో నిర్వహించారు. ప్రథమ భాష (పేపర్‌–1), ద్వితీయ భాష, ఇంగ్లిష్, మేథమెటిక్స్, సైన్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు జరిగాయి. ఈ నెల 17, 18 తేదీల్లో జరిగే ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2, ఓఎస్సెస్సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–1, పేపర్‌–2, వొకేషనల్‌ కోర్సుల పేపర్లతో టెన్త్‌ పరీక్షలు పూర్తవుతాయి. జవాబు పత్రాల మూల్యాంకనం ఈనెల 19 నుంచి 26 వరకు జరుగుతుంది.

ఇతర ప్రక్రియలను కూడా ముగించి ఫలితాలను మే 2వ వారంలో విడుదల చేయనున్నారు. గతేడాది అనుభవాల దృష్ట్యా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు లీకులు, ఫేక్‌లకు ఆస్కారం లేకుండా విద్యా శాఖ జాగ్రత్తలు తీసుకుంది. ప్రతి ప్రశ్నపత్రంపైనా ప్రత్యేకంగా క్యూఆర్‌ కోడ్‌ ముద్రించింది. పరీక్ష కేంద్రాల వారీగా ప్రశ్నపత్రాలకు బార్‌ కోడింగ్‌ పెట్టింది. దీంతో ఎక్కడా అవకతవకలు జరగకుండా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. కాపీయింగ్‌కు కూడా అడ్డుకట్ట పడింది. ఈ ఆరు రోజుల పరీక్షల్లో మాల్‌ప్రాక్టీస్‌ కేసులు రాష్ట్రవ్యాప్తంగా 5 మాత్రమే నమోదయ్యాయి. 

గతేడాది ‘నారాయణ’ అక్రమాలు 
గతేడాది కొన్ని కార్పొరేట్‌ యాజమాన్యాలు విద్యా వ్యాపారాన్ని పెంచుకొనేందుకు అత్యధిక పాస్‌ పర్సంటేజీ, మార్కుల కోసం ప్రశ్నపత్రాల లీకులకు తెగబడ్డాయి. టీడీపీ పెద్దలతో అనుబంధమున్న ‘నారా­యణ’ విద్యా సంస్థ దీనికి తెరతీసింది. తమ సంస్థల్లోని పిల్లలతో కాపీయింగ్‌ చేయించేలా, అదే తరుణంలో ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాల్జేసేలా వ్యవహారాన్ని నడిపించింది. కొందరు ప్రభుత్వ టీచర్లనూ మభ్యపెట్టింది. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా దీనికి తోడయ్యారు.

లీకులతో, సామాజిక మాధ్య­మాల ద్వారా ఫేక్‌ ప్రశ్నపత్రాల ప్రచారంతో విద్యార్థుల్లో గందరగోళం సృష్టించారు. ఈ వ్యవహారాన్ని ప్రభు­త్వం చాలా సీరియస్‌గా తీసుకొని కఠిన చర్యలు తీసుకుంది. అక్రమాలతో సంబంధమున్న పలువురు నారాయణ విద్యా సంస్థల సిబ్బందిని, ప్రభుత్వ, ప్రైవేటు టీచర్లు, ఇతర వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. 74 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అక్రమాలకు ప్రధాన కారణమైన నారాయణ విద్యా సంస్థల యాజమాన్యంపైనా కేసులు నమోదు చేశారు. 

ఈసారి పకడ్బందీ చర్యలు 
ఈసారి పరీక్షల్లో చిన్న ఘటనలకు కూడా తావివ్వకూడదన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు విద్యా శాఖ పటిష్ట చర్యలు చేపట్టింది. పరీ­క్షల నిర్వహణలో పూర్తిగా ప్రభుత్వ సిబ్బందినే భాగస్వామ్యం చేసింది. గతంలో ప్రైవేటు విద్యా సంస్థల్లో ఇన్విజిలేటర్లు కాకుండా ఇతర సిబ్బంది ఆయా సంస్థల వారే ఉండేవారు. దీనివల్ల అక్రమాలకు ఎక్కువ ఆస్కారముండేది.

ఈసారి దానికి అడ్డుకట్ట వేస్తూ ప్రైవేటు పరీక్ష కేంద్రాల్లోనూ మొత్తం ప్రభుత్వ సిబ్బందినే నియమించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్ల ఎంపికలో కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. కాన్ఫిడెన్షియల్‌ మెటీరియల్‌ తరలింపు, రూట్‌ ఆఫీసర్ల నియామకం, పరీక్ష కేంద్రాలకు మెటీరియల్‌ పంపిణీలో ఎక్కడా లోటుపాట్లకు తావులేకుండా చర్యలు తీసుకున్నారు.

లీక్, ఫేక్‌ లకు ఆస్కారం లేకుండా తీసుకున్న చర్యలివీ..
లీకులకు ఆస్కారం లేకుండా అన్ని పరీక్ష కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రకటించారు. చీఫ్‌ సూపరింటెండెంట్లతో సహా ఎవరికీ పరీక్ష కేంద్రాల్లో ఫోన్లను అనుమతించలేదు. స్మార్ట్, డిజిటల్‌ వాచీలు, కెమెరాలు, బ్లూటూత్‌ వంటి ఎల్రక్టానిక్‌ పరికరాలనూ నిషేధించారు.
 ఇన్విజిలేటర్లను జంబ్లింగ్‌ విధానంలో పరీక్ష కేంద్రాలకు ఎంపికచేశారు. 
♦ టీచర్లకు వారి స్కూళ్ల విద్యార్థులు పరీక్షలు రాసే కేంద్రాల్లో కాకుండా ఇతర కేంద్రాల్లో విధులు కేటాయించారు. 
 విద్యార్థులకు పంపిణీ చేయగా మిగిలిన ప్రశ్నపత్రాలను చీఫ్‌ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్‌ ఆఫీసర్‌ సహా ఇద్దరు ఇన్విజిలేటర్ల సమక్షంలో సీల్‌ వేశారు. ఇదంతా సీసీ కెమెరాల్లో రికార్డు చేశారు. 
 ప్రతి ప్రశ్నపత్రానికి బార్‌కోడింగ్‌ ఇవ్వడమే కాకుండా క్యూఆర్‌ కోడ్‌ను సూపర్‌ ఇంపోజ్‌ చేయించారు. దీనివల్ల ప్రశ్నపత్రం బయటకు వచ్చినా అది ఎక్కడి నుంచి వచ్చిందో వెంటనే తెలిసిపోతుంది. 
♦ పరీక్ష కేంద్రంలో ప్రశ్నపత్రాలను అందించిన వె­ం­టనే విద్యార్థులతో వాటిలోని అన్ని పేజీల­పై రో­ల్‌ నంబర్, సెంటర్‌ నంబర్‌ను రాయించా­రు. 
♦ విద్యార్థుల ఓఎమ్మార్‌ పత్రాలపైనా ఈసారి బార్‌ కోడింగ్‌ ఇచ్చారు 
 సిట్టింగ్‌ స్క్వాడ్, ఫ్లయింగ్‌ స్క్వాడ్ల సంఖ్యను రెట్టింపు చేశారు. రెవెన్యూ, పోలీసు సహా ఇతర విభాగాల సీనియర్‌ అధికారులను, ఇతర సిబ్బందిని కూడా పరీక్షల్లో భాగస్వాములను చేశారు. ఫ్లయింగ్‌ స్క్వాడ్లు ఎస్పీల ఆధ్వర్యంలో పని చేశాయి. 
   పరీక్ష కేంద్రాల్లోకి నిర్ణీత సమయంలో అనుమతించడమే కాకుండా పరీక్ష ముగిసిన తర్వాతే విద్యార్థులు, సిబ్బంది బయటకు వచ్చేలా చర్యలు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు