అయ్యో బిడ్డా! ఏమైందిరా? నిమిషాల వ్యవధిలో ఆ కుటుంబానికి తీరని విషాదం

19 Aug, 2022 19:18 IST|Sakshi

రణస్థలం (శ్రీకాకుళం): పదమూడేళ్ల కుర్రవాడు. అప్పటివరకు ఉత్సాహంగా ఉన్నవాడు. ఏమైందో ఏమో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. క్షణాల వ్యవధిలో ప్రా ణాలు వదిలేసి తల్లిదండ్రులకు శోకం మిగిల్చాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రంలోని జేఆర్‌ పురంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో బౌరోతు సంతోష్‌(13) ఏడో తరగతి చదువుతున్నాడు. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో బెంచీపై కూర్చుని ఉన్న సంతోష్‌ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 

తోటి విద్యార్థులు టీచర్‌కు చెప్పగా ఆయన స్కూల్‌ యాజమాన్యానికి సమాచారం అందించారు. వెంటనే స్కూల్‌ వ్యాన్‌లోనే మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యులు అతడు చనిపోయినట్లు నిర్ధారించారు. నిమిషాల వ్యవధిలో ఇంత విషాదం చోటుచేసుకోవడంతో ఎవరూ జీర్ణించుకోలేకపోయారు. దీనిపై బాలుడి తల్లి మణికి సమాచారం అందించగా.. ఆమె ఆస్పత్రికి వచ్చి కన్నీరుమున్నీరయ్యారు. వీరు జేఆర్‌పురంలోని వెంకటేశ్వర కాలనీలో నివాసం ఉంటున్నారు. 

బాలుడి తండ్రి జయరావు అరబిందో పరిశ్రమలో టెక్నికల్‌ కార్మికుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా విషయం చెప్పడంతో ఆస్పత్రికి వచ్చి గుండెలవిసేలా రోదించారు. వీరి స్వగ్రామం విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంలోని గొడుగువలస. మృతదేహాన్ని అక్కడకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. జేఆర్‌ పురం ఎస్‌ఐ జి.రాజేష్‌ ఆస్పత్రికి వచ్చి ఆరా తీశారు. అనంతరం ప్రైవేటు స్కూల్‌కు వెళ్లి యాజమాన్యంతో మాట్లాడారు. 
(చదవండి: భార్య ప్రవర్తనపై అనుమానం.. భర్త ఎంతపని చేశాడంటే?)

మరిన్ని వార్తలు