ప్రభుత్వ అప్పీల్‌పై ముగిసిన వాదనలు

2 Jul, 2021 05:33 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, అమరావతి: సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలకు సంబంధించి ఇటీవల సింగిల్‌ జడ్జి జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌పై వాదనలు ముగిశాయి. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ అరూప్‌కుమార్‌గోస్వామి, జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సంగం డెయిరీ యాజమాన్య నిర్వహణ బాధ్యతలను ఆంధ్రప్రదేశ్‌ పాడిపరిశ్రమ అభివృద్ధి సంస్థ పరిధిలోకి తీసుకొస్తూ గత నెల 27న జారీచేసిన జీవో 19 అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఈ నెల 7న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.

ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం గురువారం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సింగిల్‌ జడ్జి అసలు సంగం డెయిరీ ఎలా ఏర్పాటైందన్న కీలక అంశాన్ని తేల్చ కుండా మధ్యంతర ఉత్తర్వులిచ్చారన్నారు. డెయిరీ యాజ మాన్య హక్కుల గురించి తేల్చేదిశగా విచారణ జరపాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తిన పలు అంశాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. సంగం డెయిరీ మోసపూరిత చర్యలను తేల్చకుండా ప్రభుత్వ అధికారంపై ఉత్తర్వులిచ్చారని వివరించారు. అన్ని రకాలుగా సింగిల్‌ జడ్జి ఉత్తర్వులు తప్పు అని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు