సుస్థిర అభివృద్ధే లక్ష్యం

27 Feb, 2021 03:29 IST|Sakshi
విశాఖలో జరిగిన టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌కు హాజరైన ప్రతినిధులు

69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ సదస్సులో సీఎం జగన్‌

వర్చువల్‌ విధానంలో సదస్సును ప్రారంభించిన ముఖ్యమంత్రి

కోవిడ్‌ నేపథ్యంలో మౌలిక సదుపాయాలపై ఆలోచించాలి

కర్బన ఉద్గారాల నియంత్రణపైనా సమగ్ర ప్రణాళిక అవసరం

ప్రభుత్వంపై భారం లేకుండా ప్రజల సొంతింటి కల నెరవేర్చాలి

తీర ప్రాంతం మనకు ఓ వరం.. దీనిని ఇంకా ఉపయోగించుకోవాలి

ఈ దిశగా మీ సూచనలను ముందుకు తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉన్నాం

సాక్షి, అమరావతి, విశాఖపట్నం: కోవిడ్‌–19 పరిస్థితులను ఎదుర్కోవడం, పర్యావరణ పరిరక్షణ, పట్టణ పేదలకు మౌలిక సదుపాయాలు, నీటి నిర్వహణ, సమగ్ర తీర అభివృద్ధి ప్రణాళిక మొదలైన 17 అంశాలపై 2030 నాటికి సుస్థిర అభివృద్ధిని సాధించాలన్న ఐక్య రాజ్య సమితి నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఇందుకోసం సమగ్రంగా చర్చించి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టౌన్‌ ప్లానర్స్‌ ఇండియా (ఐటీపీఐ) ఆధ్వర్యంలో విశాఖలో శుక్రవారం ప్రారంభమైన 69వ జాతీయ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ మూడు రోజుల కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ విధానంలో ప్రసంగించారు.

ఈ సదస్సు ముగిసే నాటికి ఆయా రంగాల్లో ప్రస్తుతం మనం ఏమి చేస్తున్నాం.. భవిష్యత్తులో ఏమి చేయాలన్నదానిపై ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చే అవకాశం ఉంటుందన్నారు. తొలుత కోవిడ్‌–19కు ముందు, ఆ తర్వాత ఎదురైన పరిస్థితుల్ని బేరీజు వేసుకొని.. ఎప్పటికప్పుడు విశ్లేషించుకోవాలని సూచించారు. ఇప్పటికీ అనేక సంస్థల్లో ఇంటి నుంచి పనిచేసే విధానం (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌) ఇంకా కొనసాగుతోందని.. ఈ పరిస్థితులు ఎన్ని నెలలు ఉంటాయో తెలియని సందిగ్ధంలో ఉన్నామన్నారు. ఈ విధానం ఇలాగే కొనసాగితే.. దీని కోసం భవిష్యత్తులో ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించాల్సి వస్తుందనేది ప్రపంచం ముందున్న ఆసక్తికరమైన అంశమని పేర్కొన్నారు. దీనిపై ఏ విధమైన సూచనలందిస్తారో ఆసక్తిగా ఎదురు చూస్తామన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానర్స్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పర్యావరణ పరిరక్షణ
– పర్యావరణం, వాతావరణ మార్పుల గురించి నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి ఒక్కరూ ఈ సమస్యపై పోరాటం చేస్తున్నారు. 
–  మానవ చర్యలకు అడ్డూ అదుపూ లేకపోవడంతో కర్బన ఉద్గారాలు ప్రమాదకరమైన స్థాయిలో పెరుగుతున్నాయి. గ్రీన్‌హౌన్‌ గ్యాసెస్‌ విచ్చల విడిగా విడుదలవుతుండటంతో కాలుష్యం పెరుగుతోంది. పర్యావరణ పరిరక్షణ విషయంలో ప్రతి ఒక్కరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మనం ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుందో గుర్తించాల్సిన అవసరం ఉంది.

ప్రజల సొంతింటి కల నెరవేరుద్దాం 
– పేద, మధ్యతరగతి ప్రజలకు ఇళ్లు అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నగరాల్లో భూముల ధరలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. ఇదే సమయంలో పట్టణాలు, నగరాల్లో ఇంటి అద్దెలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిణామం ప్రజల జీవన విధానాన్ని దెబ్బ తీస్తోంది.
– పెరుగుతున్న భూముల ధరలు, అత్యధిక వడ్డీ రేట్లతో భూ సేకరణ ప్రభుత్వానికి భారంగా మారుతోంది.  ఈ సవాళ్లను అధిగమించి.. ప్రభుత్వానికి భారం లేకుండా నగరాలు, పట్టణాల్లో పేద, మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చాలి. ఈ సమస్య పరిష్కారానికి మీ నుంచి వచ్చే ఏ సూచన అయినా తీసుకోవడానికి సిద్ధం. 

నీటి నిర్వహణకు సమగ్ర ప్రణాళిక 
– పెరుగుతున్న జనాభా, విస్తరిస్తున్న నగర, పట్టణీకరణ నేపథ్యంలో నీటి అవసరాలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ఒక విధాన ప్రణాళికలు అమలు చేస్తుంటే.. అంతకు మించి ఆయా నగర ప్రాంతాలకు నీటి సరఫరా పథకాలను పొడిగించాల్సి వస్తోంది. 
– పట్టణాలు, నగరాల్లో జనావాసాలు గణనీయంగా పెరుగుతుండటం వల్ల వారికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించడమే కాకుండా నీటి నిర్వహణపై నిర్దిష్ట ప్రణాళికలు అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి భావితరాలకు పుష్కల నీటి వనరులు అందించేందుకు అనుసరించాల్సిన వ్యూహాల్ని అందిస్తారని ఆశిస్తున్నాం.

సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక
– రాష్ట్రానికి 974 కిలోమీటర్ల సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతం ఉండటం వరం. సమగ్ర తీర ప్రాంత అభివృద్ధి ప్రణాళిక రాష్ట్రానికి ఎంతో ముఖ్యమైన అంశం. దీని వల్ల.. ఈ సదస్సు జరుగుతున్న సువిశాల విశాఖపట్నం గణనీయంగా లబ్ధి పొందుతుంది.
– ఈ మూడు రోజుల సదస్సులో ఐక్య రాజ్య సమితి సూచించిన అన్ని అంశాలపై కచ్చితంగా విస్తృత చర్చ జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ సదస్సులో మీరు సమగ్రంగా చర్చించిన అంశాలు, సూచనలు, తీర్మానాలను నేను కచ్చితంగా ముందుకు తీసుకువెళ్తాను. మీ సలహాలు, సూచనల కోసం ప్రభుత్వం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. 
– ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి హాజరైన టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, డైరెక్టర్లు, పరిశోధకులు, వివిధ సంస్థల ప్రతినిధులు, ప్రభుత్వ.. ప్రైవేట్‌ రంగాల నిపుణులకు సీఎం వైఎస్‌ జగన్‌ అభినందనలు తెలిపారు. ఈ సదస్సులో ఐటీపీఐ అధ్యక్షుడు ఎన్‌కే పటేల్, వైస్‌ ప్రెసిడెంట్‌ వి.రాములు, సెక్రెటరీ జనరల్‌ ఎస్‌.బి కుదాంకర్, రాష్ట్ర మున్సిపల్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ వై శ్రీలక్ష్మి పాల్గొన్నారు. సీఎం క్యాంప్‌ కార్యాలయం నుంచి మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు