పోలీస్‌ ఉద్యోగాలకు డిసెంబర్‌లో నోటిఫికేషన్‌: సీఎం జగన్‌

21 Oct, 2020 08:55 IST|Sakshi

సాక్షి, అమరావతి: మహిళలు, చిన్నారులు, వృద్ధుల రక్షణకు ప్రథమ ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. నేరం చేసిన ఎవరినైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని వ్యాఖ్యానించారు. సంఘ విద్రోహులు, తీవ్రవాదాన్ని ఉపేక్షించొద్దని చెప్పారు. ఇందిరాగాంధీ స్టేడియంలో బుధవారం జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. ‘దేశమంతా పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు. కోవిడ్ సమయంలో పోలీసులు అమూల్యమైన సేవలు అందించారు. రాష్ట్ర హోంమంత్రిగా మహిళను నియమించాం. రాష్ట్ర వ్యాప్తంగా 18 దిశా పోలీస్‌స్టేషన్లను తీసుకొచ్చాం. దిశా బిల్లును కేంద్రాని కూడా పంపించాం. మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. పోలీసు ఉద్యోగాల భర్తీకి డిసెంబర్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి, జనవరిలో పోస్టుల భర్తీకి షెడ్యూల్‌ జారీ చేస్తాం. నాలుగు దశల్లో 6500 పోస్టుల భర్తీ చేస్తాం. పోలీస్ శాఖకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లిస్తాం’అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.
(చదవండి: పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి)

అంతకుముందు రాష్ట్ర డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ మాట్లాడుతూ..  ‘అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. పోలీసులందరికీ వారు ఆదర్శంగా నిలిచారు. కరోనా సమయంలో కుటుంబాలకు దూరంగా ఉండి పోలీసులు విధులు నిర్వహించారు. కరోనాతో మృతిచెందిన పోలీసులకు సీఎం రూ.50లక్షలు ప్రకటించారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌, హోంగార్డుల జీతాల పెంపులాంటి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నాం. దిశా లాంటి చట్టాలు తెచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచాం. టెక్నాలజీ ఉపయోగించడంలో ఏపీకి 27 జాతీయ స్థాయి అవార్డులు వచ్చాయి. సవాళ్లు ఎదుర్కోవడానికి పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు’ అని డీజీపీ అన్నారు.


వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం
అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హోంమంత్రి మేకతోటి సుచరిత అన్నారు. పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ మాత్రమేనని చెప్పారు. మహిళా సిబ్బందిని ప్రోత్సహించి మహిళా సాధికారతకు ప్రాధాన్యత ఇచ్చామని ఆమె గుర్తు చేశారు. సైబర్ నేరగాళ్ల నుంచి తప్పించుకోవడానికి బాలికలకు అవగాహన కల్పించామని తెలిపారు. పోలీస్ సేవా యాప్‌ కూడా తీసుకొచ్చామని హోంమంత్రి పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు