స్నేహలత కుటుంబానికి అండగా రాష్ట్ర ప్రభుత్వం

25 Dec, 2020 06:12 IST|Sakshi
స్నేహలత తల్లిని ఓదారుస్తున్న వాసిరెడ్డి పద్మ  

చట్టపరంగా లభించే పరిహారం రూ.8.25 లక్షలు

సీఎం ప్రకటించిన రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా దీనికి అదనం

సాక్షి, అనంతపురం‌: అనంతపురం జిల్లా ధర్మవరం మండలం బడన్నపల్లి వద్ద హత్యకు గురైన స్నేహలత కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని రాష్ట్ర రహదారులు, భవనాలశాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, కలెక్టర్‌ గంధం చంద్రుడు తెలిపారు. ఈ దారుణ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి ఆమె కుటుంబానికి రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని గురువారం చెప్పారు. దళిత వర్గానికి చెందిన మహిళలపై అత్యాచార ఘటనల్లో చట్టపరంగా రూ.8.25 లక్షల పరిహారం అందజేస్తారు. దీనికి సీఎం ప్రకటించిన రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అదనమని మంత్రి తెలిపారు.

పక్షపాతానికి తావివ్వకుండా త్వరితగతిన కేసును దర్యాప్తు చేయాలని పోలీసుశాఖను సీఎం ఆదేశించారని చెప్పారు. స్నేహలత కుటుంబానికి చట్టప్రకారం వచ్చే రూ.8.25 లక్షల్లో తక్షణసాయంగా రూ.4,12,500 అందజేస్తున్నామన్నారు. స్నేహలత కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఇంటి స్థలం, ఇల్లు, ఐదెకరాల పొలం ఇస్తామని చెప్పారు. ఆ కుటుంబానికి మూడు నెలలకు సరిపడా వందకిలోల బియ్యం, పదిలీటర్ల వంటనూనె, పదికిలోల చక్కెర, ఇతర నిత్యావసర సరుకులు, వంటపాత్రలు అందించినట్లు తెలిపారు. చదవండి: (యువతి దారుణ హత్య)

నిందితులకు కఠినశిక్ష పడేలా చూస్తాం
స్నేహలత హత్యపై పూర్తిస్థాయిలో న్యాయ విచారణ జరిపించి నిందితులకు కఠినశిక్షలు పడేలా చూస్తామని రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు.   గురువారం ఆమె అనంతపురంలో స్నేహలత కుటుంబసభ్యులను పరామర్శించారు. 

మరో నిందితుడు కార్తీక్‌ అరెస్టు
స్నేహలత హత్యకేసులో మరో నిందితుడు సాకే కార్తీక్‌ను గురువారం అరెస్టు చేసినట్లు ఎస్పీ బి.సత్యయేసుబాబు మీడియాకు తెలిపారు.  

మరిన్ని వార్తలు