నేడు గొల్లపూడిలో దిశ యాప్‌ అవగాహన సదస్సు

29 Jun, 2021 03:46 IST|Sakshi

 పాల్గొననున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి/భవానీపురం (విజయవాడ): విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడిలో మంగళవారం నిర్వహించనున్న ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొననున్నారు. మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరిస్తారు. దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవడం, ఆపద సమయంలో ఉపయోగించడం ఎలా అనే విషయంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో స్క్రీన్లపై ప్రజెంటేషన్‌ ద్వారా అవగాహన కల్పిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థినులు, యువతులు, మహిళలు ఈ అవగాహన సదస్సులో వర్చువల్‌ విధానంలో పాల్గొంటారు.

(ఫైల్‌ఫోటో)

ఈ సదస్సు కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయం నుంచి మంగళవారం ఉదయం 10గంటలకు బయలుదేరి 10.30 గంటలకు గొల్లపూడిలోని పంచాయతీ కార్యాలయానికి  చేరుకుంటారు. అక్కడ మొక్కలు నాటుతారు. అనంతరం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదుగురు మహిళలతో వారి మొబైల్‌ ఫోన్లలో దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయిస్తారు. అన్ని జిల్లాల్లో విద్యార్థినులు, మహిళలతో నిర్వహించే దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ కార్యక్రమాన్ని ఆయన వర్చువల్‌ విధానంలో వీక్షిస్తారు. ఈ సందర్భంగా దిశ యాప్‌ ఆవశ్యతను వారికి ముఖ్యమంత్రి స్వయంగా చెబుతారు. విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు ఈ యాప్‌ను ఎలా ఉపయోగించాలి, పోలీసు వ్యవస్థ వెంటనే ఎలా స్పందించి రక్షణ కల్పిస్తుందన్నది వీడియో స్క్రీన్లపై ప్రదర్శించి వివరిస్తారు.  

మహిళా భద్రతకు సీఎం పెద్దపీట 
ఈ కార్యక్రమం కోసం గొల్లపూడి పంచాయతీ కార్యాలయం ప్రాంగణంలో చేస్తున్న ఏర్పాట్లను సోమవారం దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దిశ యాప్‌ అవగాహన సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా పాల్గొననుండటం మహిళా భద్రతకు తమ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనమని చెప్పారు. ఇప్పటికే 20 లక్షలమంది దిశ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం దిశ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, కృష్ణాజిల్లా కలెక్టర్‌ జె.నివాస్, విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ బి.శ్రీనివాసులు, దిశ యాప్‌ అమలు విభాగం ప్రత్యేక అధికారి దీపిక పాటిల్‌ తదితరులు పాల్గొన్నారు.   

ఇక్కడ చదవండి: కోవిడ్‌పై పోరులో మంచిపేరు వచ్చిందనే.. తప్పుడు రాతలు 

మరిన్ని వార్తలు