CM YS Jagan Birthday Celebrations: అంబరాన్నంటిన సంబరం

22 Dec, 2022 04:33 IST|Sakshi
కృష్ణా జిల్లా సంగమూడి జెడ్‌పీ పాఠశాల విద్యార్థుల వినూత్న ప్రదర్శన

సంక్షేమ సారథికి జన నీరాజనం

ఊరూవాడ పండుగలా సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలు

వస్త్ర, అన్నదానాలు, రక్తదానం చేసి ప్రేమాభిమానాలు చాటుకున్న జనం

మొక్కలు నాటి వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ

సాక్షి, నెట్‌వర్క్‌: సంక్షేమ సారథి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజుని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటాయి. కేవలం రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణతోపాటు వివిధ రాష్ట్రాల్లోనూ, విదేశాల్లోనూ వైఎస్సార్‌సీపీ శ్రేణులు, సీఎం వైఎస్‌ జగన్‌ అభిమానులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా దాదాపు అన్నిచోట్లా పేదలకు, అనాథలకు వస్త్రదానం చేశారు. భారీ ఎత్తున అన్నదానాలు నిర్వహించారు.

రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటారు. వికలాంగులకు ట్రైసైకిళ్లు పంపిణీ చేశారు. రోగులకు పండ్లు అందజేశారు. భారీ ఎత్తున రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ప్రజాప్రతినిధులను బైజూస్‌ కంటెంట్‌తో కూడిన ట్యాబ్‌లను పంపిణీ చేశారు. ముఖ్యంగా తమ వర్గాల్లో ఆర్థిక, విద్య, రాజకీయ, సామాజిక, మహిళా సాధికారత తీసుకొచ్చేందుకు మహత్తర కృషి చేస్తున్న సీఎం పుట్టిన రోజు వేడుకలను ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, పేదలు సహా అన్ని వర్గాల ప్రజలూ నిర్వహించారు. తద్వారా సీఎం జగన్‌పై తమ ప్రేమాభిమానాలు చాటుకున్నారు. ఇందుకోసం పోటీలు పడి వేడుకలు నిర్వహించారు. తమ కుటుంబ సభ్యుడిగా సీఎం వైఎస్‌ జగన్‌ను భావించి.. 

ప్రతి ఇంటా పండుగలా నిర్వహించడంతో సంబరాలు అంబరాన్నంటాయి. గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు ఎక్కడికక్కడ సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసి.. మిఠాయిలు పంచిపెట్టారు. వివిధ రాష్ట్రాలతోపాటు అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లండ్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్, తదితర దేశాల్లోనూ సీఎం జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు.

ప్రకాశం జిల్లా ఒంగోలులో 15 మంది వైద్యులతో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వైఎస్సార్‌ సీపీ రీజినల్‌ కోఆర్డినేటర్‌ బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి రక్తదానం చేశారు.

గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మంత్రులు అంబటి రాంబాబు, విడదల రజిని, పలువురు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. కర్నూలు, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో మెగా రక్తదాన, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. ధర్మవరంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి నేతృత్వంలో పది వేల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. చెన్నైలోని భారత్‌ యూనివర్సిటీలో బీటెక్‌ చదువుతున్న ఏపీ విద్యార్థులు కేక్‌ కట్‌ చేశారు. 
విశాఖలో హ్యాపీ బర్త్‌డే సీఎం జగన్‌ అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్న స్థానికులు 

సీఎం పుట్టిన రోజున 49 ఎకరాల భూ పంపిణీ 
సీతంపేట: సీఎం జగన్‌ జన్మదినం సందర్భంగా విశాఖపట్నంకు చెందిన సుబ్రహ్మణ్యంరాజు కుమారుడు వెంకటపతిరాజు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో 49 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. బిల్లమడ, మోహన్‌ కాలనీకి చెందిన గిరిజనులకు గిఫ్డ్‌డీడ్‌ కింద జిరాయితీ సాగుభూమి రిజిస్టర్డ్‌ డాక్యుమెంట్లను సీతంపేట ఐటీడీఏ పీవో బి.నవ్య, పాలకొండ సబ్‌ కలెక్టర్‌ నూరుల్‌కమర్‌ చేతుల మీదుగా అందజేశారు. బిల్లుమడలో 30 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ఎకరా 33 సెంట్లు చొప్పున మొత్తం 40 ఎకరాలు, రెండు ఎకరాలు గ్రామకంఠానికి, మరో ఎకరా కమ్యూనిటీ హాల్‌కు ఇచ్చారు. మోహన్‌ కాలనీలో 6 కుటుంబాలకు ఎకరా చొప్పున 6 ఎకరాలు పంపిణీ చేశారు. 

డెహ్రాడూన్‌లో వేడుకలు
ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో సీఎం పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. మూడో జాతీయస్థాయి మహిళా కమిషన్ల సదస్సులో పాల్గొనేందుకు డెహ్రాడూన్‌ వెళ్లిన ఏపీ మహిళా కమిషన్‌ సభ్యులు కర్రి జయశ్రీరెడ్డి, గజ్జల లక్ష్మిరెడ్డి, బూసి వినీత అక్కడ కేక్‌ కట్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాఖండ్, తెలంగాణ, కర్ణాటక, అసోం, గుజరాత్‌ రాష్ట్రాల మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌లు, సభ్యులు పాల్గొన్నారు.

సంగమూడి గ్రామంలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యాభివృద్ధి కోసం సీఎం జగన్‌ చేస్తున్న కృషికి కృతజ్ఞతగా ‘‘హ్యాపీ బర్త్‌ డే జగన్‌ మామ’’ అంటూ అక్షర రూపంలో కూర్చుని ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలిపారు.
– కృత్తివెన్ను 

16 కిలోమీటర్ల వెంబడి రహదారి పక్కన మొక్కలు
ఉప ముఖ్యమంత్రి, దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సుమారు మూడు వేల మొక్కలను ఎనిమిది కిలోమీటర్ల పొడవునా రహదారికి ఇరువైపులా మొత్తం 16 కిలోమీటర్ల మేర నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఆయన తనయుడు కొట్టు విశాల్, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పాల్గొన్నాయి.

తాడేపల్లిగూడెం పట్టణంలోని కనకదుర్గ ఆలయం నుంచి వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం వరకు నాలుగు లైన్లుగా విస్తరిస్తున్న రోడ్డుకు ఇరువైపులా వీటిని నాటారు. విజయవాడ నుంచి ప్రత్యేకంగా వాహనాలలో తీసుకొచ్చిన రోజీ ట్రంపెట్‌ ట్రీ, సపాటేసి మొక్కలను పెట్టారు. దాదాపు రూ.26 లక్షల విలువ చేసే మొక్కలను నాటారు. 

మరిన్ని వార్తలు