సీఎం జగన్‌ బర్త్‌డే రక్తదాన శిబిరాల రికార్డు

18 Sep, 2022 04:28 IST|Sakshi

2020 డిసెంబర్‌ 21న ఒక్క రోజులో 34,723 యూనిట్ల రక్తం సేకరణ 

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో రక్తదాన శిబిరాలు 

వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌లో నమోదు 

కరోనా కారణంగా రక్తం కొరత ఏర్పడ్డ సమయంలో రక్తదానం 

శిబిరాల్లో సేకరించిన రక్తం బ్లడ్‌ బ్యాంకులకు సరఫరా 

గత రికార్డు ఒక రోజులో 10,500 యూనిట్లు మాత్రమే

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా 2020 డిసెంబర్‌ 21న రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున నిర్వహించిన రక్తదాన కార్యక్రమం అరుదైన రికార్డును నెలకొల్పింది. వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌లో నమోదైంది. సీఎం వైఎస్‌ జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు జరిగిన సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ రక్తదాన శిబిరాలు నిర్వహించారు.

కరోనా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్త నిల్వలు తగ్గిన సమయంలో రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలతో పాటు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా ముమ్మరంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. వీటి ద్వారా ఒక్కరోజులో 34,723 యూనిట్ల(12,153 లీటర్లు) రక్తాన్ని సేకరించారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ, రోటరీ, రెడ్‌క్రాస్, లయన్స్‌ క్లబ్‌ ఇతర ఎన్జీవోలు ఈ శిబిరాల నిర్వహణలో పాలుపంచుకున్నాయి.

ఒకేరోజు ఇంత పెద్ద ఎత్తున రక్తాన్ని సేకరించడంతో ఈ కార్యక్రమం వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌లో నమోదైంది. గతంలో ఒకేరోజు అత్యధికంగా 10,500 యూనిట్ల రక్తాన్ని సేకరించిన రికార్డును ఇది అధిగమించింది. పైగా కేవలం 8 – 9 గంటల్లోనే మూడు రెట్లు అదనంగా రక్తాన్ని సేకరించటంపట్ల వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ఇంటర్నేషనల్‌ నిర్వాహకులు పార్టీ నాయకత్వాన్ని అభినందించారు.

కరోనా నేపథ్యంలో రక్త దాతలు ముందుకొచ్చే వారు కాదు. దీంతో రాష్ట్రంలోని బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం నిల్వలు తగ్గిపోయాయి. రక్తం దొరక్క చాలా ఆస్పత్రుల్లో శస్త్ర చికిత్సలకు ఆటంకం ఏర్పడింది. ఈ క్రమంలో సీఎం జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇలా సేకరించిన రక్తాన్ని రాష్ట్రంలోని వివిధ బ్లడ్‌ బ్యాంకులకు సరఫరా చేశారు.  

మరిన్ని వార్తలు