Alluri Sitarama Raju Birth Anniversary: తరతరాలకు స్ఫూర్తిదాత

5 Jul, 2022 04:53 IST|Sakshi

అడవిలో అగ్గి రగిల్చిన పోరాట యోధుడు అల్లూరి: సీఎం జగన్‌

సామాజిక ఐకమత్యాన్ని చాటిచెప్పిన సంస్కర్త

మహనీయుడి ఘనతకు నివాళిగా ‘అల్లూరి’ జిల్లా

ఏడాది పొడవునా దేశమంతా అల్లూరి జయంతి వేడుకలు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి  

అగ్నికణం.. అల్లూరి
లక్షల మంది త్యాగాల ఫలితమే నేటి మన స్వతంత్ర భారతదేశం. అలాంటి త్యాగమూర్తుల్లో మన గడ్డమీద, ఈ రాష్ట్రం మట్టి నుంచి అనేక అగ్ని కణాలు పుట్టాయి. వారు ఎంచుకున్న మార్గాలు వేరైనా లక్ష్యం మాత్రం ఒక్కటే. ఆ త్యాగధనులు, పోరాట యోధుల్లో ఓ మహా అగ్నికణమే అల్లూరి సీతారామరాజు.
– సీఎం జగన్‌ 

(భీమవరం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి): తన జీవితాన్ని, తన మరణాన్ని కూడా తరతరాలకు సందేశమిచ్చేలా విప్లవాగ్నిని రగిల్చి చిన్న వయసులోనే ప్రాణాలను త్యాగం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజును తెలుగుజాతి ఎన్నటికీ మరువదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. దేశానికి స్ఫూర్తి ప్రదాత, అడవిలో కూడా అగ్గి పుట్టించిన యోధుడు, సామాజిక ఐకమత్యం అవసరాన్ని తెలియజెప్పిన సంస్కర్త, ఎన్నటికీ మరణం లేని ఓ విప్లవవీరుడిని స్మరించుకునేందుకు భీమవరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు సీఎం తెలిపారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌లో భాగంగా భీమవరంలో నిర్వహించిన అల్లూరి 125వ జయంతి వేడుకల్లో ప్రధాని మోదీ, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో కలిసి సీఎం జగన్‌ సోమవారం పాల్గొన్నారు. అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ అనంతరం జరిగిన బహిరంగ సభలో సీఎం వైఎస్‌ జగన్‌ మాట్లాడారు. 

ఎప్పటికీ చరితార్ధుడే
విప్లవజ్యోతి అల్లూరి ఘనతకు నివాళిగా ఆ మహానుభావుడు నడయాడిన నేల, నేలకొరిగిన ప్రదేశం ఉన్న గడ్డకు జిల్లాల పునర్విభజనలో భాగంగా అల్లూరి సీతారామరాజు జిల్లా అని పేరు పెట్టినట్లు సీఎం జగన్‌ గుర్తు చేశారు. ‘దేశం కోసం, అడవి బిడ్డల కోసం తనను తానే త్యాగం చేసుకున్న ఆ మహావీరుడికి నా వందనం. ఆయన ఎప్పటికీ చరితార్ధుడే. ఆ త్యాగం ప్రతి పాప, ప్రతి బాబు, ప్రతి మనిషి గుండెల్లో చిరకాలం నిలుస్తుంది..’ అని పేర్కొన్నారు. భీమవరంలో మాదిరిగానే ఇదే రోజు అల్లూరి సీతారామరాజు జిల్లాలో కూడా కాంస్య విగ్రహావిష్కరణ జరుగుతోందని చెప్పారు. 

దోపిడీ లేని సమాజం కోసం..
ఒక దేశాన్ని మరో దేశం.. ఒక జాతిని ఇంకో జాతి.. ఒక మనిషిని మరో మనిషి దోపిడీ చేయడానికి వీల్లేని సమాజాన్ని నిర్మించాలని కలలు కన్న మన స్వాతంత్య్ర సమర యోధులను స్మరించుకుంటూ ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ జరుపుకొంటున్నామన్నారు. మన పూర్వీకులు, సమరయోధులు వారి జీవితాన్ని, రక్తాన్ని ధారపోసి సాధించిన స్వాతంత్య్రం అమృతంతో సమానమన్నారు. మహాయోధుడి విగ్రహ ఆవిష్కరణ కోసం భీమవరం వచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు చెప్పారు.

యాత్ర స్థలాలుగా తీర్చిదిద్దుతాం: కిషన్‌రెడ్డి
తెలుగు పౌరుషానికి అల్లూరి ప్రతీకని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. అల్లూరి నడయాడిన ప్రాంతాలను తీర్థయాత్ర కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. అల్లూరి జయంతి ఉత్సవాలను దేశవ్యాప్తంగా ఏడాది పాటు ఘనంగా నిర్వహిస్తామన్నారు. ఈ ఉత్సవాల సందర్భంగా అల్లూరి కుటుంబ సభ్యులతో పాటు ఆనాడు ఆయన సైన్యంలో పనిచేసిన విప్లవ వీరుల కుటుంబాలను ప్రభుత్వం తరుఫున కలుస్తామన్నారు.

కార్యక్రమంలో మంత్రులు ఆర్‌కే రోజా, దాడిశెట్టి రాజా, బీజేపీ నాయకులు సోము వీర్రాజు, దగ్గుబాటి పురందేశ్వరి, నిర్వాహక కమిటీ ప్రతినిధులు నానిరాజు తదితరులు పాల్గొన్నారు. కాగా, భీమవరం ఏఎస్‌ఆర్‌ నగర్‌లో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. అల్లూరి జయంతి ముగింపు ఉత్సవాలకు త్వరలో ఎన్నిక కానున్న కొత్త రాష్ట్రపతిని పిలుస్తామన్నారు. త్వరలో హైదరాబాద్, బెంగళూరు, విశాఖ, ఢిల్లీ, ఒడిశాలలో అల్లూరి జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 

మరిన్ని వార్తలు