అత్యధికులకు జీవనోపాధి

20 Jan, 2021 03:02 IST|Sakshi

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం దిశగా అడుగులు

జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, ఆసరా, బీమా పథకాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వండి

ఉన్నత స్థాయి సమీక్షలో సీఎం జగన్‌ 

ఈ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ మార్చిలో పూర్తవ్వాలి

రెండో విడత ‘చేయూత’ పరిధిలోకి మరింత మంది వచ్చేట్లు చూడాలి 

ఆర్బీకేల ద్వారా పశువుల క్రయవిక్రయాలు, దాణా, మందుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలి.. పంపిణీ చేస్తున్న పశువులకు యూనిక్‌ ఐడీ నంబర్, జియో ట్యాగింగ్‌

నాడు–నేడు కింద పశువుల ఆస్పత్రుల ఆధునికీకరణ

వెటర్నరీ డాక్టర్ల పోస్టుల భర్తీకి ఆమోదం  

వైఎస్సార్‌ చేయూత కింద ఏర్పాటు చేస్తున్న రిటైల్‌ షాపులకు ప్రాముఖ్యత కల్పించడం చాలా అవసరం. ఈ పథకాలు ఏ మేరకు అమలవుతున్నాయో పరిశీలించాలి. మరింత పక్కాగా అమలు చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఒక అధ్యయనం చేయాలి. వీటి ద్వారా లబ్ధిదారుల జీవితాల్లో వచ్చిన మార్పులపై సమగ్ర అధ్యయనం చేసేందుకు అంతర్జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలి.

నాడు–నేడు ద్వారా జరుగుతున్న విద్యా, వైద్య రంగాల్లో మార్పులను కూడా ఈ తరహా సంస్థల దృష్టికి తీసుకెళ్లి అధ్యయనం చేయించాలి. ప్రతి రంగంలోనూ ఉన్నత స్థాయిలో ఉన్న కంపెనీలతో మాట్లాడి.. చేయూత లబ్ధిదారులకు వారిని అనుసంధానం చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చూడాలి.

సాక్షి, అమరావతి: జగనన్న తోడు, వైఎస్సార్‌ చేయూత, ఆసరా, బీమా పథకాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంబంధిత అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ పథకాల లబ్ధిదారులకు రుణాల మంజూరు ప్రక్రియ మార్చి ఆఖరుకల్లా పూర్తి చేయాలని సూచించారు.  వైఎస్సార్‌ చేయూత కింద చేపడుతున్న వివిధ ఉపాధి కల్పనా కార్యక్రమాలకు లబ్ధిదారుల ఎంపికపై మరింత దృష్టి సారించాలన్నారు. ఇటువంటి మంచి వ్యవస్థ ఎప్పటికీ కొనసాగాల్సిన అవసరం ఉందని, రెండో విడత చేయూత అందించే సమయానికి మరింత మంది ఈ కార్యక్రమంలోకి వచ్చేటట్లు చేయాలని చెప్పారు. వైఎస్సార్‌ చేయూత, ఆసరా, బీమా, జగనన్న తోడు పథకాలపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన మొత్తాన్ని వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చు చేయడం కన్నా, ఉపాధి కల్పించే దిశగా పెట్టుబడి పెట్టేలా చేస్తే బాగుంటుందని.. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. దీనివల్ల ఆ కుటుంబం జీవనోపాధి మెరుగు పడుతుందని, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా బలోపేతం అవుతుందని పేర్కొన్నారు. ఆయా పథకాల కింద అర్హులైన లబ్ధిదారులకు పాడి పశువులు, గొర్రెలు, మేకల పంపిణీతో పాటు, రిటైల్‌ స్టోర్స్‌ ఏర్పాటు అంశాలపై లోతుగా సమీక్షించారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏం చెప్పారంటే..

ఫీడ్‌ నుంచి అమ్మకం దాకా..
► వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాల్లో (ఆర్బీకే) పాల వెల్లువ, జీవక్రాంతి లబ్ధిదారులు ఆర్డర్‌ చేస్తే పశుదాణా, మందులు ఇచ్చే ఏర్పాటు చేయాలి. ఈ పథకం కింద సరఫరా చేస్తున్న పశువులకు యూనిక్‌ ఐడీ నంబర్‌తో పాటు జియో ట్యాగింగ్‌ చేయడానికి ఉన్న అవకాశాలను కూడా పరిశీలించాలి.
► లబ్ధిదారులు పశువులను అమ్మాలనుకుంటే కూడా ఆర్బీకేల ద్వారా అది జరిగేలా చూడాలి. పశువులకు సంబంధించిన పూర్తి హెల్త్‌ రికార్డు నిర్వహించాలి. విత్తనం నుంచి విక్రయం దాకా తరహాలో.. ఫీడ్‌ నుంచి అమ్మకం దాకా అన్నట్లు అన్ని సేవలు ఆర్బీకేలలో అందుబాటులో ఉండాలి.
► జగనన్న తోడు పథకానికి సంబంధించి అర్హత ఉన్న మిగిలిన లబ్ధిదారులకు కూడా బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. 
► వైఎస్సార్‌ బీమా పథకానికి సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను మరింత వేగవంతం చేయాలి. బ్యాంకర్లతో సమన్వయం చేసుకుని అందరికీ లబ్ధి జరిగేలా చూడాలి. బీమా పథకం అమలుపై ప్రతి 15 రోజులకొకసారి సమావేశమై సమీక్షించాలి. 

2022 మార్చికి ఏపీ అమూల్‌ ప్రాజెక్టు విస్తరణ
► ఏపీ అమూల్‌ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇప్పటి వరకు 3 జిల్లాల్లో (ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప) అమలవుతున్న ప్రాజెక్టును ఫిబ్రవరి మొదటి వారంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు విస్తరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 
► 2022 మార్చి 31 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఈ ప్రాజెక్టును విస్తరిస్తామని అధికారులు పేర్కొన్నారు. పాలసేకరణకు సంబంధించి డెయిరీల సామర్థ్యం, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల గురించి వివరించారు.   
► పశు సంవర్ధక శాఖలో ఖాళీగా ఉన్న వెటర్నరీ వైద్యుల పోస్టుల భర్తీ ప్రతిపాదనలకు, పశువుల చికిత్స కోసం కొత్త టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటుకు సీఎం జగన్‌ ఆమోదం తెలిపారు. పశువుల ఆస్పత్రులను కూడా నాడు–నేడు తరహాలో ఆధునికీకరించాలని సీఎం ఆదేశించారు.
► ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పశు సంవర్ధక, పాడి పరిశ్రమ అభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు