అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాలి

1 Jan, 2021 04:36 IST|Sakshi
ఇళ్ల పట్టాల కేటాయింపుపై హర్షం వ్యక్తం చేస్తున్న కృష్ణా జిల్లా బుడమేరు కాలువ గట్టుపై నివసిస్తున్న మహిళలు

అర్హత ఉన్నా ఇంటి పట్టా రాలేదనే మాటే వినిపించకూడదు 

దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడు 

విగ్రహాల ధ్వంసం ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు  

పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలి 

సీఎంవో అధికారుల సమావేశంలో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: అర్హత ఉన్నప్పటికీ ఇంటి పట్టా రాలేదనే మాట ఎక్కడా వినిపించకూడదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. అర్హులందరికీ ఇంటి పట్టాలు అందాల్సిందేనని స్పష్టం చేశారు. గురువారం ఉదయం ఆయన ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులతో సమావేశం సందర్భంగా అర్హులందరికీ ఇంటి పట్టాలు, విగ్రహాల విధ్వంసం తదితర విషయాలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దేవుడితో చెలగాటమాడితే దేవుడు తప్పకుండా శిక్షిస్తాడని పేర్కొన్నారు. విగ్రహాల విధ్వంసం లాంటి ఘటనలకు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. మరోసారి ఇలాంటి తప్పిదాలకు పాల్పడకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఎం ఇంకా ఏమన్నారంటే..

పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం
► పొరపాటున ఎక్కడైనా అర్హులు మిగిలిపోయి ఉంటే వారికి వెంటనే ఇంటి పట్టాలు ఇప్పించాలి. మనది అర్హులకు పథకాలను కత్తిరించే ప్రభుత్వం కాదు. మనం పేదల సంక్షేమం కోసం యజ్ఞం చేస్తున్నాం. అర్హులకు పథకాలన్నీ అందాల్సిందే. అదే సమయంలో అనర్హతల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
► పెన్షన్, బియ్యం కార్డు, ఇంటి పట్టాకు సంబంధించి సచివాలయాల్లో పెండింగులో దరఖాస్తులు లేకుండా చూసుకోవాలి. అర్హులైన వారికి 10 రోజుల్లో బియ్యం కార్డు, 10 రోజుల్లో పెన్షన్, 20 రోజుల్లో ఆరోగ్యశ్రీ కార్డు, 90 రోజుల్లో ఇంటి పట్టా ఇస్తామని మనం లక్ష్యంగా పెట్టుకున్నాం. 
► ఈ లక్ష్యాలను కచ్చితంగా అందుకుంటూ ముందుకు సాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న దరఖాస్తులను పరిష్కరించాలి. ఇన్ని రోజుల్లో ఈ సేవలు అందిస్తామన్న విషయాన్ని తెలిపేలా గ్రామ, వార్డు సచివాలయాల్లో బోర్డులు ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ఉన్నాయా? లేవా? అనేది మరోసారి పరిశీలించండి. 
► అమ్మ ఒడి పథకానికి సిద్ధం కావాలి. 

మరిన్ని వార్తలు