మంత్రుల రాజీనామా: సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు

7 Apr, 2022 17:41 IST|Sakshi

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్‌ భేటీ ముగిసింది. ఏప్రిల్‌ 11న మంత్రి వర్గాన్ని పునర్‌ వ్యవస్థీకరిస్తున్న నేపథ్యంలో కేబినెట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులంతా తమ రాజీనామా లేఖలను సీఎం జగన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 'మీరు సమర్థులు, అనుభవం ఉన్నవారు కాబట్టే ఆరోజు మిమ్మల్ని క్యాబినెట్లోకి తీసుకున్నాను. ఇవాళ కూడా మీకున్న అనుభవాన్ని, సమర్థతను పార్టీకి వినియోగించుకోవాలన్నది నా ఆలోచన. మంత్రులుగా మీలో కొందర్ని తొలగించి, కొందర్ని కొనసాగిస్తున్నంతమాత్రాన ఎవ్వరినీ తక్కువ చేసినట్టుకాదు. మంత్రులుగా కన్నా, పార్టీకి సేవచేయడాన్ని, పార్టీకి పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను. పార్టీ కోసం పనిచేసేవారినే గొప్పగా చూస్తాను. 2024 ఎన్నికల్లో మీరు గెలిపించుకు రండి.. మీరు మళ్లీ ఇవే స్థానాల్లో కూర్చుంటారు. 2024 ఎన్నికలు కూడా మనకు అత్యంత కీలకం. 2019లో మనమీద ఎన్నో ఆశలు పెట్టుకుని ప్రజలు మనల్ని గెలిపించారు. వారి ఆశలు నెరవేర్చేలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టి అన్నిరకాలుగా ప్రజలకు తోడుగా నిలిచాం. వారి అభిమానాన్ని సంపాదించుకున్నాం.

చరిత్రలో ఏ ప్రభుత్వం చూపని గొప్ప పనితీరుతో మళ్లీ మనం ప్రజల దగ్గరకు వెళ్తున్నాం. ఇలాంటి సందర్భంలో 2019లో మనకు 151 సీట్లు వచ్చినట్టుగా ఎందుకు రావు? కచ్చితంగా వస్తాయనే నేను విశ్వాసంతో ఉన్నాను. ఈ ప్రక్రియలో మీరు భాగస్వాములు కావడం చాలా గొప్ప విషయం. గడపగడపకూ వెళ్లగలిగినప్పుడు, ప్రజల మధ్య ఉన్నప్పుడు మరింత ఎదుగుతామనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. ప్రజల్లో ఉండి పార్టీకోసం పనిచేయడాన్ని నేను గొప్పగా భావిస్తాను కూడా. మంత్రులుగా మీరంతా చాలా చక్కగా పనిచేశారని' ప్రస్తుత మంత్రులతో నిర్వహించిన కేబినెట్‌ భేటీలో సీఎం జగన్‌ అన్నారు

చదవండి: (ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన మంత్రులు) 

కాగా, మూడేళ్లపాటు ప్రభుత్వంలో మా బాధ్యతలను మేం నిర్వహించామని మంత్రులు ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వివరించారు. అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లామన్న సంతృప్తి మాలో ఉందని మంత్రులు తెలియజేశారు. ఇక మిగిలిన రెండేళ్లపాటు పార్టీ కోసం పనిచేసి.. పార్టీని పటిష్టం చేస్తామని మంత్రులు సీఎం జగన్‌తో అన్నారు.

చదవండి: (Perni Nani: మంత్రి పేర్ని నాని వీడ్కోలు విందు)   

మరిన్ని వార్తలు