‘జయహో బీసీ’ తరహాలో మిగతా విభాగాల సదస్సులు

3 Feb, 2023 06:30 IST|Sakshi

రీజనల్‌ కోఆర్డినేటర్ల సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం

త్వరితగతిన గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు 

మరింత సీరియస్‌గా ‘గడప గడపకు మన ప్రభుత్వం’ 

పార్టీ అంతర్గత లోపాల పరిష్కారంపై దృష్టి పెట్టాలి 

సాక్షి, అమరావతి: విజయవంతమైన ‘జయహో బీసీ’ తరహాలోనే మిగతా విభాగాల సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం వైఎస్సార్‌సీపీ రీజనల్‌ కోఆర్డినేటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు విషయాల్లో వారికి దిశా నిర్దేశం చేశారు. జయహో బీసీ తరహాలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సదస్సుల నిర్వహణపై యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించాలని సూచించారు.

పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. గతంలో నిర్దేశించుకున్న మేరకు సాధ్యమైనంత త్వరగా గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల నియామకాలు పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ ప్రక్రియలో వెనకబడిన నియోజకవర్గాలపై ప్రత్యేకంగా దృష్టి సారించి, స్థానిక నేతలతో సమావేశాలు ఏర్పాటు చేసి.. నియామకాలు పూర్తి చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. నియోజకవర్గాల్లో పార్టీ పరంగా నెలకొన్న చిన్నచిన్న అంతర్గత లోపాలను పరిష్కరించడంపై దృష్టి సారించాలని చెప్పారు.  

అప్పటికీ సమస్యలు అపరిష్కృతంగా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యేలు మరింత సీరియస్‌గా తీసుకోవాలని చెప్పారు. ప్రభుత్వం చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ విధానాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రచార కార్యక్రమాలపై కూడా దృష్టి పెట్టాలని, ఈ విషయంలో పార్టీ నాయకులు, యంత్రాంగం చురుగ్గా పని చేసేలా చూడాలని సూచించారు.

మరిన్ని వార్తలు