YS Jagan: పరిశుభ్రతకు పెద్దపీట

14 Jul, 2021 02:48 IST|Sakshi

పల్లెలు, పట్టణాలు శుభ్రంగా ఉంటేనే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారు.. ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్‌ 

చెత్త సేకరణకు ప్రత్యేక వాహనాల కొనుగోలు

వ్యర్థాల తొలగింపు విధానానికి సమన్వయం కోసం ప్రొటోకాల్‌

చేయూత, ఆసరా మహిళల వ్యాపార ఉత్పత్తులకు మార్కెటింగ్‌ కల్పించాలి

వైఎస్సార్‌ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి 

చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలకు ప్రణాళిక సిద్ధం చేయాలి

సమగ్ర భూ సర్వే వేగవంతానికి ముగ్గురు మంత్రులతో కమిటీ

తొలి దశలో గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు ఈ ఏడాది పూర్తి కావాలి

వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ప్రాధాన్యతా క్రమంలో మౌలిక సదుపాయాల కల్పన 

గ్రామీణ ప్రాంతాల్లో వ్యర్థాలను సమీపంలోని ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లకు తరలించే ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఒక ప్రత్యేక నంబర్‌ను డిస్‌ప్లే చేయాలి. కాల్‌ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వ్యర్థాలను సేకరించి, ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలి. మురుగు నీటి కాల్వల శుద్ధిపై కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. డ్రెయిన్లను తరచూ శుభ్రం చేయాలి.  
–  సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పల్లెలు, పట్టణాల్లో పరిశుభ్రతకు పెద్ద పీట వేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. బలమైన పారిశుధ్య కార్యక్రమాల వల్లే ప్రజారోగ్యం మెరుగు పడుతుందని చెప్పారు. ప్రధానంగా పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, అప్పుడే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఇందులో భాగంగా గ్రామాల్లో 14 వేల ట్రై సైకిళ్లు, పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1,034 ఆటోలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పల్లెల్లో ఎంత స్వచ్ఛత పాటిస్తే అంత ఎక్కువగా రోగాల వ్యాప్తిని నిరోధించవచ్చని స్పష్టం చేశారు. డోర్‌ టు డోర్‌ వ్యర్థాల సేకరణ కోసం ఇప్పటికే విధుల్లో 23,747 మంది గ్రీన్‌ అంబాసిడర్స్, 4,482 గ్రీన్‌ గార్డ్స్‌ను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా మరో 11,453 మంది గ్రీన్‌ అంబాసిడర్స్, 5,551 మంది గ్రీన్‌ గార్డ్స్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. వ్యర్థాల నిర్వహణకు భారీగా యంత్రాలను వినియోగించాలని,  పట్టణాలతో పాటు పల్లెల్లోనూ వ్యర్థాల నిర్వహణ చేపట్టాలని ఆదేశించారు. ఈ సమీక్షలో ఇంకా ఏమన్నారంటే..

పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పలు కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు 

వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి 
వ్యర్థాల సేకరణతో పాటు వాహనాల నిర్వహణ పైనా ధ్యాస పెట్టాలి. పీపీఈ కిట్స్‌ డిస్పోజల్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను పక్కాగా చేపట్టాలి. ఈ అంశంలో మున్సిపల్, పంచాయతీరాజ్‌ శాఖల మధ్య సమన్వయం ఉండాలి. అప్పుడే క్లీన్‌ ఆంధ్రప్రదేశ్‌ సాధ్యమవుతుంది. 
– ఫోన్‌ చేయగానే వ్యర్థాలను తొలగించడానికి అనుసరించాల్సిన విధానంపై పురపాలక, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం కోసం ఒక ప్రోటోకాల్‌ ఉండాలి. 

6 లక్షల మంది మహిళలకు సుస్థిర జీవనోపాధి కింద లబ్ధి

  • వైఎస్సార్‌ చేయూత, ఆసరా పథకాల ద్వారా సుస్థిర జీవనోపాధి కింద ఈ ఏడాది 6 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. మహిళల ఉత్పాదనలు, వారి వ్యాపారాలకు మార్కెటింగ్‌ సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలి.
  • టై అప్‌ చేస్తున్న కంపెనీలు కచ్చితంగా ప్రతిష్ట ఉన్నవి, మంచి పనితీరు కలిగినవిగా చూసుకోవాలి. మార్కెటింగ్‌ సామర్థ్యాలు విస్తృతంగా ఉన్న కంపెనీలతోనే ఒప్పందం చేసుకోవాలి.

    సమగ్ర భూ సర్వే, ఉపాధి పనులు వేగవంతం

  • సమగ్ర సర్వేను ఉద్ధృతంగా చేపట్టడంపై దృష్టి పెట్టాలి. వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూహక్కు - భూరక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయాలి.
  • ఇందుకోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక పట్టణాభివృద్ధి, రెవెన్యూ మంత్రులతో త్రిసభ్య కమిటీ చేయాలి.
  • ఈ ఏడాది ఉపాధి హామీ కింద చేపట్టిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు అన్నీ కూడా పూర్తి కావాలి. వీటి నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలి. నిర్మాణాలు సరిగ్గా జరుగుతున్నాయా? లేదా? అన్నదానిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. జియో ట్యాగింగ్‌ చేసి.. నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలి.
  • వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించిన పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలి. ఇళ్ల నిర్మాణం పూర్తి కాగానే అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు, రోడ్లు.. ఇలా ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలి.
  • వైఎస్సార్‌ జలకళ ప్రాజెక్టుపై మరింతగా దృష్టి సారించాలి. భూగర్భ జలాలను పెంపొందించడంలో భాగంగా చిన్న చిన్న నదులపై ఉన్న వంతెనల వద్ద చెక్‌డ్యాం తరహా నిర్మాణాలు చేపట్టాలి. 

ప్రగతిపథంలో పనులు..

  • వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఉపాధి హామీ కింద చేపట్టిన పనుల ప్రగతిని, గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో చేపడుతున్న పనుల ప్రగతిని అధికారులు సీఎంకు వివరించారు. జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం వివరాలు తెలిపారు. నాడు–నేడులో భాగంగా పనులు చేపడుతున్న ఆస్పత్రులు, స్కూళ్లలో కూడా మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వైఎస్సార్‌ బీమా, జలజీవన్‌ మిషన్, గ్రామీణ రహదారుల నిర్మాణ పనుల ప్రగతిని వివరించారు.
  • పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా 9,148 ఇన్సినిరేటర్స్‌ (బూడిదగా మార్చేవి), 3,279 మిస్ట్‌ బ్లోయర్స్‌ (పిచికారి చేసేవి), 3,197 బ్రష్‌ కట్టర్స్‌ (గడ్డి కత్తిరించేవి), 3130 హైప్రెషర్‌ టాయ్‌లెట్‌ క్లీనర్లు, 165 పోర్టబుల్‌ థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్లు, 157 షడ్డింగ్‌ మిషన్లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. గ్రీన్‌ అంబాసిడర్, గ్రీన్‌ గార్డ్స్‌ అందరికీ పీపీఈ కిట్లు పంపిణీ చేశామని చెప్పారు. 
  • ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్, సెర్ప్‌ సీఈఓ పి.రాజాబాబు, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్‌ ఎండీ పి.సంపత్‌ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  
మరిన్ని వార్తలు