తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడదాం

12 May, 2021 04:02 IST|Sakshi
కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న సీఎం జగన్‌

రూ.87 వేల కోట్లు నేరుగా ప్రజల ఖాతాలకు బదిలీ చేశాం..

అలాంటిది కోవిడ్‌ టీకాల కోసం రూ.1,600 కోట్లు ఇవ్వలేమా?

‘స్పందన’పై సమీక్షలో కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌

దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే

ఇందులో 6 కోట్ల డోసులు కోవిషీల్డ్, కోటి డోసులు కోవాగ్జిన్‌ 

ఈ విషయం ప్రతిపక్ష నాయకులకు, వీరు అధికారంలో లేరని జీర్ణించుకోలేని ఎల్లో మీడియాకూ తెలుసు

కోవాగ్జిన్‌ ఉత్పత్తి చేసే భారత్‌ బయోటిక్‌ సాక్షాత్తూ చంద్రబాబు బంధువు.. రామోజీరావు కొడుకు వియ్యంకుడిది

డబ్బులు తీసుకుని సరఫరా చేయండని కోరినా సరే కంపెనీలు తీసుకోవడం లేదు

వ్యాక్సిన్ల పంపిణీ అన్నది కేంద్రం నియంత్రణలో ఉంది.. రాష్ట్రాల జనాభాను బట్టి కోటా ఇస్తోంది

ఈ మేరకు సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది

ఈ వాస్తవాలను కాదని చంద్రబాబు, ఎల్లో మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో తిప్పికొట్టండి

సాక్షి, అమరావతి: వ్యాక్సినేషన్‌పై ప్రజల్లో అలజడి సృష్టించి, భయాందోళనలు రేకెత్తించడానికి ప్రతిపక్ష నేతలు, ఎల్లో మీడియా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, వారి దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి జగన్‌ అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో రుయా ఘటనతో పాటు కోవిడ్‌–19 నియంత్రణ, చికిత్స, వ్యాక్సినేషన్‌ అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత 23 నెలల్లో పేదలకు రూ.87 వేల కోట్లు ఇచ్చిన ప్రభుత్వం వ్యాక్సిన్ల కోసం రూ.1600 కోట్లు ఇవ్వలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో కావాలనే రాజకీయ కారణాలను దృష్టిలో ఉంచుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, ఇవి ఏ స్థాయిలో జరుగుతున్నాయో మనం చూస్తున్నామన్నారు. వ్యాక్సిన్ల పరిస్థితి ఏంటో రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. దేశంలో వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం నెలకు 7 కోట్ల డోసులనే విషయం ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్షం అధికారంలో లేదని జీర్ణించుకోలేక.. ఎలాగైనా సరే అధికారంలోకి తీసుకురావాలని తాపత్రయ పడే ఎల్లో మీడియాకు తెలుసన్నారు. ఈ సమీక్షలో సీఎం ఇంకా ఏమన్నారంటే..

వ్యాక్సిన్ల ఉత్పత్తి – డిమాండ్‌
► దేశంలో నెలకు వ్యాక్సిన్‌ ఉత్పత్తి సామర్థ్యం 7 కోట్ల డోసులు అయితే ఇందులో 6 కోట్ల డోసులు కోవిషీల్డ్‌ను సీరం ఇన్‌స్టిట్యూట్‌ తయారు చేస్తోంది. కోటి డోసులను భారత్‌ బయోటెక్‌ సంస్థ తయారు చేస్తోంది. భారత్‌ బయోటెక్‌ ఎవరిది అంటే.. సాక్షాత్తు ఈ చంద్రబాబు బంధువు.. రామోజీరావు కొడుకు వియ్యంకుడిది. 
► అక్కడ ఏం జరుగుతోందన్న సంగతి వీళ్లందరికీ తెలుసు. దేశంలో నెలకు 7 కోట్ల డోసులు మాత్రమే తయారయ్యే పరిస్థితి ఉంటే.. దేశం మొత్తానికి ఇప్పటి వరకు ఇచ్చిన డోసులు కేవలం 17 కోట్లు మాత్రమే.
► దేశం మొత్తం అవసరాలను చూస్తే.. 45 ఏళ్లకు పైబడిన 26 కోట్ల మందికి 2 డోసులు చొప్పున 52 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. 18 నుంచి 45 సంవత్సరాల లోబడి ఉన్న వాళ్లు మరో 60 కోట్లు ఉన్నారు. వారికి రెండు డోసులు చొప్పున మొత్తం 120 కోట్ల డోసులు ఇవ్వాలి. అంటే 172 కోట్ల డోసులు దేశానికి అవసరమైతే.. ఇప్పటి వరకు కేవలం 17 కోట్ల డోసులు మాత్రమే ఇవ్వగలిగాం. అంటే 10 శాతం లోపు మాత్రమే ఇవ్వగలిగాం.

రాష్ట్రంలో డిమాండ్‌ ఇలా..
► మన రాష్ట్రం విషయానికొస్తే 45 సంవత్సరాలు పైబడి ఉన్న వారు, హెల్త్‌ వర్కర్లు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు కలుపుకుని రాష్ట్రంలో 1.48 కోట్ల మంది ఉన్నారు. వీరికి 2 డోసులు చొప్పున దాదాపుగా 3 కోట్లు డోసులు ఇవ్వాలి.
► 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారు రాష్ట్రంలో సుమారు 2 కోట్ల మంది ఉన్నారు. వీరికి దాదాపు 4 కోట్ల డోసులు అవసరం. అంటే మొత్తంగా 7 కోట్ల డోసులు ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు కేవలం 73 లక్షల డోసులు మాత్రమే కేంద్రం నుంచి మనకు అందాయి. 
► మనం డబ్బులు ఇస్తామని చెప్పినా కూడా వ్యాక్సిన్‌ కంపెనీ వాళ్లు తీసుకోవడం లేదు. మాకు సప్‌లై చేయండని చెప్పినా కూడా చేయడం లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో నడుస్తున్నాయి. 

కేంద్రమే స్పష్టం చేసింది..
► ఇదే విషయమై కేంద్రం నిన్న (సోమవారం) సుప్రీంకోర్టుకు అఫడవిట్‌ దాఖలు చేసింది. రాష్ట్రాలు ఎంత కొనుగోలు చేయాలంటే అంత వ్యాక్సిన్లు ఇచ్చే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ కంపెనీలు మా నియంత్రణలోనే సాగాలి అని చెప్పింది. మేం ఎంత కోటా కేటాయిస్తే.. ఆ కోటా మేరకు వ్యాక్సిన్‌ కంపెనీలు ఆయా రాష్ట్రాలకు ఇవ్వాలని, అంతకన్నా ఎక్కువ ఇవ్వకూడదని చెప్పింది. 
► డబ్బులు ఇచ్చే రాష్ట్రమైనా, డబ్బులు ఇవ్వని రాష్ట్రమైనా ఒకే మాదిరిగా ఉండాలని.. జనాభా ప్రాతిపదికన కోటాను నిర్ధారిస్తామని, ఆ కోటా మేరకు కంపెనీలు వ్యాక్సిన్లను పంపిణీ చేయాలని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది.  

బాధ్యతారహిత విమర్శలు
► ఈ వాస్తవ పరిస్థితి తెలిసి కూడా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5 లాంటివి చేస్తున్న ప్రచారాలు చూస్తే ఇవాళ నాకు బాధ అనిపిస్తోంది. వ్యాక్సిన్లకు కేవలం రూ.45 కోట్లు మాత్రమే ఆంధ్రరాష్ట్రం ఇస్తామని చెప్పిందంటున్నారు. 
► వ్యాక్సిన్లకు రూ.1,600 కోట్లు ఖర్చు చేయడానికి మనసు రావడం లేదు.. కమీషన్ల కోసమని చెప్పి.. ఇలా చేస్తున్నారంటూ చాలా బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారు. ఆ మాటలను ఈనాడు దినపత్రికలో పతాక శీర్షికల్లో వేస్తారు. 
► వాళ్లవే వ్యాక్సిన్‌ కంపెనీలు. అక్కడ ఏం జరుగుతుందో వీరికి తెలుసు. అయినా కూడా వక్రీకరించడానికి, ప్రభుత్వం మీద దుష్ప్రచారం చేయడానికి, కలెక్టర్ల మీద దుష్ప్రచారం చేయడానికి, ప్రజల్లో అలజడిని సృష్టించడానికి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని, తప్పుడు సందేశాన్ని అందిస్తున్నారు. 

సిబ్బంది పనితీరు పట్ల గర్వపడుతున్నా
► వ్యాక్సినేషన్‌ కానివ్వండి, హెల్త్‌కేర్‌ కానివ్వండి, ఆక్సిజన్‌ సప్లై కానివ్వండి.. ఎక్కడా కూడా దేశంలో జరగని విధంగా ప్రజలకు సేవలందిస్తున్నాం. ఈ విషయాన్ని గొప్పగా, గర్వంగా కూడా చెప్పగలుగుతాం. ఎందుకంటే.. రాష్ట్రానికి టయర్‌ –1 సిటీ లేదు.
► హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు లేకపోయినా దేశంలో ఎక్కడా లేని విధంగా వైద్య సేవలు అందించగలుగుతున్నాం. కోవిడ్‌ కారణంగా మరణాల రేటు పరిశీలిస్తే చాలా రాష్ట్రాలతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉన్నాం. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే చాలా బెటర్‌గా ఉన్నాం. ఇందుకు కారణం.. కలెక్టర్ల స్థాయి నుంచి ఆశా వర్కర్, వలంటీర్‌ స్థాయి వరకు ఎంతో కమిట్‌మెంట్‌తో, ఎంతో చిత్తశుద్ధితో పని చేస్తున్నాం. అందుకే ఈ ఫలితాలు వస్తున్నాయి. సిబ్బంది పనితీరు పట్ల చాలా గర్వపడుతున్నా.  
► ఇన్ని మంచి పనులు చేస్తుంటే జీర్ణించుకోలేని పరిస్థితుల్లో కొందరు రాజకీయ నాయకులు, ఎల్లో మీడియా యాజమాన్యాలు ఉన్నాయి. వీరందరినీ మనం ఎదుర్కోవాల్సి ఉంది. మరింత అప్రమత్తంగా ఉందాం. మరింత మానవత్వంతో సేవలు అందిద్దాం. సానుభూతితో పనిచేద్దాం. 

వాస్తవాలేమిటో ప్రజలకు చెబుదాం
► వ్యాక్సినేషన్‌కు సంబంధించిన దుష్ప్రచారాన్ని ప్రతి సందర్భంలో కూడా తిప్పికొట్టాలి. ప్రజలను రెచ్చగొట్టి, వారి భావోద్వేగాలతో ఆడుకుంటూ.. ప్రజలు వ్యాక్సినేషన్‌ కేంద్రాల వద్ద గుమిగూడే పరిస్థితిని సృష్టిస్తున్నారు. అందరికీ ఉచితంగా టీకా అందుతుందని స్పష్టంగా చెప్పండి.
► వ్యాక్సిన్ల కొరత ఉంది కాబట్టి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపుల ప్రకారం వ్యాక్సిన్ల పంపిణీ జరుగుతుంది కాబట్టి, మీ వంతు వచ్చేంత వరకు ఓపిగ్గా ఉండాలని ప్రజలకు చెప్పాలి. 
► 45 ఏళ్లకు పైబడి రెండో డోసు ఇవ్వాల్సిన వారు 33 లక్షలకు పైగా ఉన్నారు. ఈ నెలలో వీరికి మొదట ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. లేకపోతే మొదటి డోసు వేసుకున్నా ప్రయోజనం ఉండదు. ఆ తర్వాత 45 ఏళ్ల పైబడి ఉన్నవారు ఇంకా ఎవరైనా ఉంటే వారికీ కంప్లీట్‌ చేస్తాం. 
► వ్యాక్సిన్ల కోసం ప్రభుత్వం కూడా విస్తృతంగా ప్రయత్నాలు చేస్తోంది. వచ్చే సరఫరాను బట్టి.. ప్రాధాన్యత క్రమంలో అందిస్తామనే విషయాన్ని ప్రజలకు చెప్పాలి. 
► ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వివిధ శాఖల ముఖ్య అధికారులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు