CM YS Jagan Davos Tour: ఇంధన రంగంలో 60 వేల కోట్ల పెట్టుబడి

24 May, 2022 03:51 IST|Sakshi
సీఎం జగన్, గౌతమ్‌ అదానీ సమక్షంలో ఒప్పంద పత్రాలతో ఏపీ ప్రభుత్వ, అదానీ గ్రీన్‌ ఎనర్జీ సంస్థ ప్రతినిధులు

ఏపీలో గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు అదానీతో ఎంవోయూ..  రెండో రోజు దావోస్‌లో కీలక ఒప్పందాలు

3,700 మెగావాట్లతో పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు

10 వేల మెగావాట్లతో సోలార్‌ విద్యుదుత్పత్తి

ఏపీలో దాదాపు 10 వేల మందికి ఉద్యోగావకాశాలు

ముఖ్యమంత్రి జగన్, గౌతమ్‌ అదానీ సమక్షంలో ఎంవోయూ 

దావోస్‌: సుస్థిర అభివృద్ధిలో భాగంగా కర్బన ఉద్గారాలు లేని ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది. కాలుష్య రహిత ఇంధనం ఉత్పత్తే లక్ష్యంగా రాష్ట్రంలో రెండు మెగా గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటుకు ఎంవోయూ కుదుర్చుకుంది. ఈ రెండు ప్రాజెక్టులను అదానీ గ్రీన్‌ ఎనర్జీ నెలకొల్పనుంది. ఇందులో 3,700 మెగావాట్లు పంప్డ్‌ హైడ్రో స్టోరేజ్‌ ప్రాజెక్టు కాగా 10 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు కూడా ఉంది.

రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధిలో ఇవి అత్యంత కీలకం కానున్నాయి. రెండు ప్రాజెక్టుల కోసం దాదాపు రూ.60 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు ఎంవోయూలో పేర్కొన్నారు. తద్వారా 10 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. 

రెండో రోజు విస్తృతంగా చర్చ
దావోస్‌లో తొలిరోజు గౌతమ్‌ అదానీతో సమావేశమైన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెండోరోజు సోమవారం మరోసారి భేటీ నిర్వహించి ఈ ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చించారు. గ్రీన్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి సీఎం జగన్, అదానీ గ్రూపు సంస్థల అధిపతి గౌతమ్‌ అదానీల సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ తరఫున ఆశిష్‌ రాజ్‌వంశీ ఎంవోయూపై సంతకాలు చేశారు.  

మరిన్ని వార్తలు