CM YS Jagan Davos Tour: రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు

27 May, 2022 04:11 IST|Sakshi

దావోస్‌ వేదికగా రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు అడుగులు 

గ్రీన్‌ ఎనర్జీ రంగంలో భారీ పెట్టుబడుల ఒప్పందాలు 

ఆర్సిలర్‌ మిట్టల్‌తో సహా పెట్టుబడులకు ముందుకొచ్చిన అదానీ, గ్రీన్‌కో, అరబిందో 

సాక్షి, అమరావతి: దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం దావోస్‌ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా  వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు,  పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు.  

27,700 మెగావాట్ల క్లీన్‌ గ్రీన్‌ ఎనర్జీ 
నాలుగోతరం పారిశ్రామికీకరణకు ప్రధాన కేంద్రంగా రాష్ట్రాన్ని మార్చాలన్న లక్ష్యంతో గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులపై అదానీ, గ్రీన్‌కో, అరబిందోలతో ఆంధ్రప్రదేశ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. పంప్డ్‌ స్టోరేజీ లాంటి వినూత్న విధానాలతో మొత్తంగా 27,700 మెగావాట్ల గ్రీన్‌ ఎనర్జీ రాష్ట్రంలోకి రాబోతోంది. గ్రీన్‌ కోతో కలిసి తాము ప్రపంచంలోనే తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీపై ఏపీలో పెట్టుబడులు పెడుతున్నట్లు, ఈ పెట్టుబడులను రెట్టింపు చేస్తున్నట్లు ప్రపంచ ప్రసిద్ధ కంపెనీ ఆర్సిలర్‌ మిట్టల్‌ ప్రకటించింది.

ముఖ్యమంత్రి.. సంస్థ సీఈఓ ఆదిత్య మిట్టల్‌ ఈ ప్రకటన చేశారు. ఏపీలో పారిశ్రామిక విధానాలు చాలా సానుకూలంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు. స్టీల్‌తోపాటు, ఎనర్జీ, నిర్మాణ, మైనింగ్, రవాణా, ప్యాకేజింగ్‌ తదితర రంగాల్లో ఉన్న 76.571 బిలియన్‌ డాలర్ల ఆర్సిలర్‌ మిట్టల్‌ గ్రూపు తొలిసారిగా గ్రీన్‌ ఎనర్జీకి వేదికగా రాష్ట్రాన్ని ఎంపిక చేసుకుంది.  
కర్బన రహిత పారిశ్రామికీకరణపై దృష్టి 
కొత్త తరం ఇంధనాలు హైడ్రోజన్, అమ్మోనియా ఉత్పత్తులపైనా దావోస్‌లో ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టారు. కర్బన రహిత పారిశ్రామికీకరణకు ఏపీ కేంద్రంగా నిలుస్తోందని నీతి ఆయోగ్‌ సీఈఓ అమితాబ్‌ కాంత్‌ కితాబిచ్చారు. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకుని పారిశ్రామిక ఉత్పత్తులు దిశగా మచిలీపట్నంలో ఒక ఎస్‌ఈజెడ్‌ను తీసుకురానుండడం దావోస్‌ ఫలితాల్లో ఒకటి. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఒప్పందం చేసుకుంది. గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడంతోపాటు, అత్యాధునిక పద్ధతుల్లో ఉత్పత్తులు సాధించేందుకు వీలుగా ఈ జోన్‌ను అభివృద్ధి చేస్తారు.
 
పారిశ్రామిక రంగానికి డబ్ల్యూఈఎఫ్‌ సహకారం 
కాలుష్యాన్ని తగ్గించడం.. పర్యావరణ సమతుల్యతకు, నాణ్యతకు పెద్దపీట వేయడం, గ్రీన్‌ ఎనర్జీని వినియోగించుకోవడం, టెక్నాలజీకి పెద్దపీట వేస్తూ ప్రపంచస్థాయి ఉత్పత్తులు సాధించేలా పరిశ్రమలకు తోడుగా నిలవడానికి అడ్వాన్స్‌డ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ దిశగా రాష్ట్ర ప్రభుత్వం దావోస్‌లో అడుగులు వేసింది. దీనికి సంబంధించి డబ్ల్యూఈఎఫ్‌తో ఒప్పందం కూడా చేసుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం.. డబ్ల్యూఈఎఫ్‌ నిర్వహించే అనేక కార్యక్రమాలు, ప్రాజెక్టులతో రాష్ట్రానికి మంచి అనుసంధానం ఏర్పడుతుంది. రాష్ట్రంలోని పారిశ్రామిక రంగానికి అత్యాధునికతను, కాలుష్యంలేని విధానాలను జోడించడానికి డబ్ల్యూఈఎఫ్‌ తగిన సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రంలోకి కొత్తగా నాలుగు పోర్టులు వస్తున్న దృష్ట్యా పోర్టు ఆధారిత పారిశ్రామికీకరణపైనా కూడా దావోస్‌ సభలో సీఎం దృష్టిపెట్టారు. దస్సాల్ట్‌ సిస్టమ్స్, మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌తోనూ జరిగిన చర్చల్లో ముఖ్యమంత్రి జగన్‌ ఇవే అంశాలపై దృష్టిపెట్టారు.

సముద్ర మార్గం ద్వారా రవాణాను మూడు రెట్లు పెంచే ఉద్దేశ్యంతో ఇదివరకే ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ పాలసీని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం.. దీనికి సంబంధించిన వివరాలను వీరి ముందు ఉంచింది. తాము త్వరలో కాకినాడలో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు మిట్సుయి ఓఎస్‌కే లైన్స్‌ లిమిటెడ్‌ ప్రెసిడెంట్, సీఈఓ తకీషి హషిమొటో ప్రకటించారు. సీఎం విజ్ఞప్తి మేరకు, లాజిస్టిక్‌ రంగాలపైనా దృష్టిపెడుతున్నామన్నారు. ప్రపంచంలోనే ఓడల ద్వారా అత్యధిక మొత్తంలో సరుకు రవాణా చేస్తున్న కంపెనీ ఇది.  

బైజూస్‌ పరిశోధన కేంద్రం ఏర్పాటు 
ఏపీలో విద్యారంగానికి తోడుగా నిలుస్తామని.. పరిశోధక కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని బైజూస్‌ ప్రకటించింది. పాఠ్యప్రణాళికను ఏపీ విద్యార్థులకు అందిస్తామని సీఎంతో జరిగిన సమావేశంలో సంస్థ సీఈఓ రవీంద్రన్‌ వెల్లడించారు. సమగ్ర భూ సర్వే రికార్డులను నిక్షిప్తం చేయడంలో పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తామని కాయిన్‌స్విచ్‌ క్యూబర్‌ ప్రకటించింది. 

విశాఖకు ప్రత్యేక గుర్తింపు 
ఇక రాష్ట్రంలోనే అతిపెద్ద నగరం, కార్యనిర్వాహక రాజధానిగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసుకున్న విశాఖపట్నానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దావోస్‌ వేదికగా విశేష కృషిచేశారు.  

► హైఎండ్‌ టెక్నాలజీకి వేదికగా ఈ నగరాన్ని తీర్చిదిద్దుతున్నామని ప్రకటించారు. ఈ రంగంలో పెట్టుబడులకు ఆహ్వానం పలికారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంతో కలిసి హైఎండ్‌ టెక్నాలజీపై పాఠ్యప్రణాళిక రూపకల్పనలో భాగస్వామ్యానికి టెక్‌ మహీంద్ర అంగీకారం తెలిపింది. కంపెనీ కార్యకలాపాలను విస్తరించడంపైనా చర్చించారు.  
► మేజర్‌ టెక్నాలజీ హబ్‌గా విశాఖను తీర్చిదిద్దాలని సీఎం సంకల్పంతో ఉన్నారని, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌కు ప్రధాన కేంద్రంగా ఆయన విశాఖను తీర్చిదిద్దాలనుకుంటున్నారని టెక్‌ మహీంద్ర సీఈఓ గుర్నాని ముఖ్యమంత్రితో భేటీ అనంతరం వెల్లడించారు.  

► ఐబీఎం చైర్మన్, సీఈఓ అరవింద్‌ కృష్ణతోనూ ఇవే అంశాలను సీఎం జగన్‌ చర్చించారు. ఐటీ రంగంలో కొత్తగా వస్తున్న ఆవిష్కరణలకు, ఆ అంశాల్లో శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాభివృద్ధి అంశాలపై వీరితో ప్రధానంగా చర్చలు జరిగాయి.  
► అలాగే, యూనికార్న్‌ స్టార్టప్స్‌కూ వేదికగా విశాఖపట్నాన్ని తీర్చిదిద్దడానికి సీఎం దావోస్‌ వేదికగా గట్టి ప్రయత్నాలు చేశారు. వివిధ యూనికార్న్‌ స్టార్టప్స్‌ వ్యవస్థాపకులు, సీఈఓలతో దావోస్‌లో సీఎం భేటీ అయ్యారు.  
► ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి తమవంతు చేయూతనిస్తామని, రవాణా రంగానికి తోడుగా నిలుస్తామని ఈజ్‌మై ట్రిప్‌ వెల్లడించింది. విశాఖ వేదికగా కార్యకలాపాలపైనా ప్రణాళికలను వారు సీఎంతో పంచుకున్నారు.    

మరిన్ని వార్తలు