పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు రూ.6 వేలు ఓహెచ్‌ఏ

15 Jul, 2022 03:46 IST|Sakshi

ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయం 

ఆరోగ్య భృతి, వేతనం రూ.15 వేలు కలిపి మొత్తం రూ.21 వేలు 

మున్సిపల్‌ శాఖ మంత్రి సురేష్‌ వెల్లడి 

కార్మికులు సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి 

హర్షం వ్యక్తం చేసిన కార్మికులు 

ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు

సాక్షి, అమరావతి: పట్టణ పారిశుద్ధ్య ఒప్పంద కార్మికులకు ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు (ఆరోగ్య భృతి–ఓహెచ్‌ఏ) రూ.6 వేలు చెల్లిస్తామని, రూ.15 వేల వేతనంతో కలిపి మొత్తం రూ.21 వేలు ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. కార్మికుల ప్రధాన డిమాండ్‌ పరిష్కారమైనందున సమ్మె విరమించి విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేశారు. గురువారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి సురేష్‌తో పాటు విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో కూడిన కేబినెట్‌ సబ్‌ కమిటీ కార్మికుల డిమాండ్లపై సీఎంతో చర్చించింది.

అనంతరం మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపల్‌ శాఖలో పనిచేస్తున్న అవుట్‌సోర్సింగ్‌ పారిశుద్ధ్య కార్మికులకు హెల్త్‌ అలవెన్సు రూ.6 వేలు చెల్లించాలని సీఎం నిర్ణయించినట్టు చెప్పారు. జీవో నం.233 ద్వారా ఇస్తున్న ఆరోగ్య భృతిని యథాతథంగా అమలు చేస్తామన్నారు. మిగిలిన డిమాండ్ల  పరిష్కారంపై మున్సిపల్‌ శాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించాలని ఆయన కోరారు.

43,233 మంది కార్మికులకు మేలు 
రాష్ట్రంలోని 123 నగరపాలక, పురపాలక, నగర పంచాయతీల్లో మొత్తం 51,306 మంది కార్మికులు ప్రజారోగ్య శాఖ, ఇతర విభాగాల్లో సేవలు అందిస్తున్నారు. వీరిలో 8,073 మంది రెగ్యులర్‌ సిబ్బంది ఉన్నారు. 43,233 మంది అవుట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. గత టీడీపీ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు రూ.12 వేలు వేతనంగా చెల్లించేది, అయితే, వారి కష్టాన్ని గుర్తించిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వారికి మేలు చేయాలని ఆక్యుపేషనల్‌ హెల్త్‌ అలవెన్సు కింద రూ.6 వేలు కలిపి మొత్తం రూ.18 వేలకు పెంచింది.

అనంతరం పీఆర్సీ అమలు చేయడంతో వారి వేతనాలు రూ.15 వేలకు పెరగడంతో ఓహెచ్‌ఏను సవరించి రూ.3 వేలు కలిపి వేతనం రూ.18 వేలుగా ఇస్తున్నారు. అయితే, తొలుత ప్రకటించిన ఓహెచ్‌ఏ మొత్తం చెల్లించాలని సోమవారం నుంచి కార్మికులు సమ్మెకు దిగారు. కార్మికుల వినతి మేరకు ఆరోగ్య భృతి రూ.6 వేలు చెల్లించాలని సీఎం జగన్‌ నిర్ణయించారు. దీంతో పారిశుద్ధ్య కార్మికుల వేతనం రూ.21 వేలకు చేరింది. ఓహెచే పూర్తిస్థాయిలో రూ.6 వేలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించడంపై మున్సిపల్‌ పారిశుద్ధ్య కార్మికులు హర్షం వ్యక్తంచేశారు. తమ డిమాండ్లు పరిష్కరించిన సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

విధుల్లో చేరండి
డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించినందున పారిశుద్ధ్య కార్మికులు విధుల్లో చేరాలి. ప్రస్తుత వర్షాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలి. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక మున్సిపల్‌ కమిషనర్ల ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తాం.     
– ప్రవీణ్‌కుమార్, సీడీఎంఏ 

మరిన్ని వార్తలు