కొండకు కొత్త శోభ

8 Dec, 2023 04:45 IST|Sakshi
దుర్గగుడి నమూనాను పరిశీలిస్తున్న సీఎం జగన్‌

ఇంద్రకీలాద్రిపై రూ.216.05 కోట్లతో అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌ 

శంకుస్థాపన.. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులు ప్రారంభం 

అమ్మవారిని దర్శించుకున్న సీఎం.. శ్రీకనకదుర్గా వైభవం పుస్తకం ఆవిష్కరణ  

సాక్షి ప్రతినిధి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారంశంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వ­హించారు. విజయవాడ కనకదుర్గానగర్‌ గోశాల వద్ద రూ.216.05 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మరో రూ.23.145 కోట్లతో పూర్తి చేసిన పనులను ప్రారంభించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల నడుమ పనులకు సీఎం జగన్‌ తొలుత శాస్త్రోక్తంగా భూమి పూజ చేశారు. అమ్మవారి విశేషాలతో దుర్గామల్లేశ్వర దేవస్థానం ప్రచురించిన ‘శ్రీకనకదుర్గా వైభవం – ఉపాసనా విధానం’ పరిశోధనాత్మక గ్రంథాన్ని ఆవిష్కరించారు. వేద పాఠశాల విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. అనంతరం ఇంద్రకీలాద్రిపైకి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు సంబంధించిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. దుర్గగుడి మాస్టర్‌ ప్లాన్‌ను పరిశీలించారు. మాస్టర్‌ ప్లాన్‌ వివరాలను దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్‌ ముఖ్యమంత్రికి తెలియచేశారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా గోశాల శంకుస్థాపన ప్రాంతం వరకు వివిధ కళాబృందాలు తమ ప్రదర్శనలతో ఘన స్వాగతం పలికాయి. కేరళ సంప్రదాయ డ్రమ్స్‌ బృందం, తెలంగాణ కొత్తగూడెం గిరిజనుల కొమ్ము కోయ నృత్యం, భద్రాచలం ఒగ్గుడోలు, గిరిజన గుస్సాడి (నెమలి నృత్యం) కోలాటం, కూచిపూడి నృత్య బృందాల ప్రదర్శనలు అలరించాయి. 

పూర్ణకుంభంతో స్వాగతం
కనక దుర్గమ్మను దర్శించుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు పెద రాజగోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారి అంతరాలయంలో ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ముఖ్యమంత్రికి తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటాన్ని దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, దుర్గగుడి చైర్మెన్‌ కర్నాటి రాంబాబు, కమిషనర్‌ ఎస్‌.సత్యనారాయణ, ఈవో కెఎస్‌.రామారావు, వేద పండితులు అందించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి తానేటి వనిత, శాసన మండలి సభ్యులు తలశిల రఘరామ్, రుహుల్లా, అరుణ్‌కుమార్, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, తూర్పు నియోజక వర్గ ఇన్‌చార్జి దేవినేని అవినాష్, జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి, మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ, డిప్యూటీ మేయర్‌ అవుతు శైలజారెడ్డి, దేవస్థానం కమిటీ సభ్యులు, దేవదాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలన్, దేవదాయశాఖ కమిషనర్‌ సత్యనారాయణ, కలెక్టర్‌ ఢిల్లీరావు, ఎన్టీఆర్‌ జిల్లా పోలీస్‌ కమిషనర్‌ టి.కె రాణా, డీసీపీ విశాల్‌ గున్ని, జాయింట్‌ కలెక్టర్‌ సంపత్‌కుమార్, నగర కమిషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్, సబ్‌ కలెక్టర్‌ అదితిసింగ్‌ , ఆలయ ఈవో కె.ఎస్‌ రామారావు, ఆలయ స్థానాచార్యులు శివప్రసాద్‌ శర్మ, ప్రధాన అర్చకులు ఎల్‌.డి ప్రసాద్, వైదిక కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

ప్రారంభించిన పనులు ఇవీ..
► రూ.5.60 కోట్లతో పునః నిర్మించిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం 
► రూ.4.25 కోట్లతో పూర్తైన ఇంద్రకీలాద్రి కొండ రక్షణ పనులు
► రూ.3.25 కోట్లతో ఎల్‌టీ ప్యానల్‌ బోర్డులు, ఎనర్జీ, వాటర్‌ మేనేజ్‌మెంట్, స్కాడా పనులు 
► 2016 పుష్కరాల సమయంలో గత సర్కారు కూల్చిన ఎనిమిది ఆలయాలను రూ 3.87 కోట్లతో పునః నిర్మించి ప్రారంభించిన సీఎం జగన్‌.
► పాతపాడు గ్రామంలో దేవస్థానం స్థలంలో రూ.5.66 కోట్లతో 1 మెగావాట్‌ సోలార్‌ విద్యుత్‌ కేంద్రం
► కొండ దిగువన రూ.23 లక్షలతో నిర్మించిన బొడ్డు బొమ్మ, రూ.28 లక్షలతో అమ్మవారి పాత మెట్ల మార్గంలో నిర్మించిన ఆంజనేయ స్వామి,  వినాయక ఆలయాలను ప్రారంభించిన సీఎం జగన్‌.

శంకుస్థాపనలు
► దుర్గగుడిలో రూ.30 కోట్లతో అన్నప్రసాద భవనం
► రూ.27 కోట్లతో ప్రసాదం పోటు భవన నిర్మాణాలు
► రూ.13 కోట్లతో ఎలివేటెడ్‌ క్యూ కాంప్లెక్స్‌
► రూ.15 కోట్లతో రాజగోపురం ముందుభాగం వద్ద మెట్ల నిర్మాణం
► రూ.23.50 కోట్లతో దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్‌
► రూ.7.75 కోట్లతో కనకదుర్గ ప్రవేశ మార్గం వద్ద మహారాజద్వార నిర్మాణం
► రూ.7 కోట్లతో కొండపైన పూజా మండపం
► రూ.18.30 కోట్లతో మల్లిఖార్జున మహా మండపం క్యూకాంప్లెక్స్‌గా మార్పు
► రూ.19 కోట్లతో నూతన కేశ ఖండనశాల
► కొండ దిగువన ఉన్న గోశాల భవనం రూ.10 కోట్లతో బహుళ ప్రయోజన సౌకర్య సముదాయంగా మార్పు
► దాతల సహకారంతో రూ.5 కోట్లతో కొండపైన గ్రానైట్‌  రాతి యాగశాల నిర్మాణం
► దేవస్థానం–ప్రైవేట్‌ భాగస్వామ్యంతో రూ.33 కోట్లతో కనక దుర్గానగర్‌ వద్ద మల్టీ లెవల్‌ కారు పార్కింగ్‌ నిర్మాణం పనులు. 

>
మరిన్ని వార్తలు