వైఎస్సార్‌ చేయూతతో కోటి మందికి మేలు

23 Jun, 2021 03:11 IST|Sakshi
వైఎస్సార్‌ చేయూత రెండో విడతకు సంబంధించిన చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎంలు పుష్పశ్రీవాణి, ధర్మాన కృష్ణదాస్, మంత్రులు పెద్దిరెడ్డి, కన్నబాబు, బొత్స, వేణుగోపాల కృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్‌ రోజా, అధికారులు, లబ్ధిదారులు

వైఎస్సార్‌ చేయూత రెండో విడత కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

23.44 లక్షల మంది మహిళల ఖాతాల్లో రూ.4,395 కోట్లు జమ 

అక్కచెల్లెమ్మల కుటుంబ సభ్యులతో కలిపి కోటి మందికి లబ్ధి

కష్టాన్ని నమ్ముకున్న 45–60 ఏళ్ల అక్కచెల్లెమ్మలు వారి కుటుంబాల రథసారథులు

ఈ రెండేళ్లలో వైఎస్సార్‌ చేయూత ద్వారానే రూ.9 వేల కోట్లు సాయం

ప్రభుత్వానికున్న ఇబ్బందుల కన్నా.. మహిళల కష్టాలే ఎక్కువ అని భావించాం

అందుకే అర్హత ఉన్న ప్రతి అక్కా చెల్లెమ్మకూ మంచి చేశాం

మనది మహిళా పక్షపాత ప్రభుత్వం.. ప్రతి అడుగులోనూ వారికి మంచి జరగాలి

అక్కా చెల్లెమ్మలు చిరునవ్వుతో ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుందని నమ్మే వ్యక్తిని

వీరికి ఇచ్చిన డబ్బులు వృథా కావు 

ఇంకా అర్హులెవరికైనా రాకపోతే కంగారొద్దు.. నెల రోజుల్లో దరఖాస్తు చేయండి

ఆర్థిక స్థోమత మరింత పెరిగేలా..
► ప్రతి అక్కా చెల్లెమ్మ ఖాతాలో చేయూత కింద జమ చేస్తున్న ఈ డబ్బును ఎలా ఖర్చు చేసుకోవాలన్నది వారి నిర్ణయానికే వదిలేస్తున్నాం. వీరు బాధ్యతాయుతమైన మహిళలు. ఆర్థిక స్థోమత మరింత పెరిగే విధంగా బాధ్యతాయుతంగానే అడుగులు వేస్తారు.
వ్యాపారంలో అండగా నిలుస్తాం..
► అక్కచెల్లెమ్మలు వ్యాపారం చేసేందుకు అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను సమర్థంగా వినియోగించేలా.. వీరందరి జీవనోపాధి కోసం అమూల్, ఐటీసీ, హిందుస్థాన్‌ లీవర్‌ తదితర వ్యాపార సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది.
– సీఎం వైఎస్‌ జగన్‌ 

ఏ ముఖ్యమంత్రి కూడా మీలాగా మేలు చేయలేదు 
మీరు చెప్పిన మాట ప్రకారం మాకు గత ఏడాది చేయూత డబ్బు అందింది. బ్యాంకులతో మాట్లాడి రుణం కూడా ఇప్పించారు. ఆ డబ్బులతో మేకలు కొనుక్కున్నాను. ఏ సీఎం కూడా మీలాగా మేలు చేయలేదు. మీరు రెండు చేతులతో పథకాలు ఇస్తున్నారు. మహిళలు అందరూ మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు. రెండేళ్లలోనే ఎన్నో పథకాల ద్వారా అన్ని వర్గాల వారిని ఆదుకుంటున్నారు. పెద్ద కొడుకులా సాయం చేస్తున్నారు. మహిళలందరి తరపున మీకు ధన్యవాదాలు.     
    – రాజేశ్వరమ్మ, పుసర్లపాడు, శ్రీకాకుళం 

ప్రభుత్వానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా.. మహిళల కష్టాలే ఎక్కువ అని భావించాం. 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యనున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు చేయూత వర్తిస్తుంది. ఈ వయసు వారికి నాలుగేళ్లలో  రూ.75 వేలు చేతికి వస్తుంది. 60 ఏళ్లు దాటిన వారికి వెంటనే పెన్షన్‌ వస్తుంది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పెన్షన్‌ రూ.1,000 నుంచి రూ.2,250 చేశాం. జనవరిలో రూ.2,500 చేయబోతున్నాం. అలా దీన్ని రూ.3 వేల వరకూ తీసుకుపోతామని భరోసా ఇస్తున్నాం.  

మన ప్రభుత్వం మహిళా పక్షపాత ప్రభుత్వం అని మన పని తీరుతో ఇట్టే అర్థం అవుతుంది. దేశ, రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా నామినేటెడ్‌ పదవులు, కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు ఇస్తూ చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఈ చట్టం చేశాం కాబట్టి ఆలయ బోర్డుల్లో, కార్పొరేషన్‌ పదవుల్లో, మార్కెట్‌ యార్డుల్లో, బీసీ కార్పొరేషన్లలో ఇవాళ అక్క చెల్లెమ్మలు అగ్రభాగాన కనిపిస్తున్నారు. రాష్ట్ర కేబినెట్‌లో నా చెల్లి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరో చెల్లి హోం మంత్రిగా ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను. 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : ‘వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా దాదాపు 23.44 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు లబ్ధి చేకూరనుంది. రూ.4,395 కోట్లు నేరుగా వారి బ్యాంక్‌ అకౌంట్లలోకి జమ చేసే గొప్ప కార్యక్రమం ఇది. వారి కుటుంబ సభ్యులను కూడా కలుపుకుంటే దాదాపు కోటి మంది జనాభాకు మంచి జరుగుతుంది. దేవుడి దయ, మీ అందరి చల్లని దీవెనలతో ఈ రోజు ప్రతి అక్కకు, చెల్లెమ్మకు మంచి చేసే అవకాశం వచ్చింది’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి వరుసగా రెండో ఏడాది వైఎస్సార్‌ చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం 45–60 సంవత్సరాల మధ్య ఉన్న అర్హులైన ప్రతి అక్క, చెల్లెమ్మకూ వైఎస్సార్‌ చేయూత పథకం కింద ఏటా రూ.18,750 చొప్పున వరుసగా నాలుగేళ్లపాటు మొత్తంగా రూ.75 వేలు ఇస్తామని చెప్పామన్నారు. ఇందులో భాగంగా ఇవాళ (మంగళవారం) రెండో విడత కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని పేర్కొన్నారు. ఈ అక్కచెల్లెమ్మలందరూ అత్యంత బాధ్యతాయుతమైన వారని, వారి కుటుంబాలకు రథసారథులని చెప్పారు. వీరి చేతిలో డబ్బు పెడితే వారి కుటుంబానికి మంచి జరుగుతుందని, వారి ఆర్థిక స్థితిగతులు మెరుగు పడతాయన్న ఆలోచనతో ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల అకౌంట్‌లో నగదు జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

సామాజిక ఫించన్‌ వారికీ చేయూత
► వైఎస్సార్‌ చేయూత ద్వారా లబ్ధి పొందుతున్న 45 నుంచి 60 ఏళ్లున్న మహిళల్లో దాదాపు 6 లక్షలకుపైగా వితంతువులు, ఒంటరి మహిళలు, వికలాంగులు ఉన్నారు. వీరికి సామాజిక పెన్షన్ల ద్వారా లబ్ధి కలుగుతున్నా, అటువంటి వారికే ఎక్కువ సహాయం అందించాలన్న దృఢ నిర్ణయంతో ఈ సహాయం చేస్తున్నాం.
► గత సంవత్సరం దాదాపు 24 లక్షల మందికి రూ.18,750 చొప్పున జమ చేశాం. రెండవ ఏడాది ఇప్పుడు 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున నేరుగా దాదాపు రూ.4,400 కోట్లు వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం.
► ఈ రెండేళ్లలో అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, సున్నా వడ్డీ కాకుండా.. కేవలం వైఎస్సార్‌ చేయూత ద్వారా మన ప్రభుత్వం అందించిన ఆర్థిక సహాయం దాదాపు రూ.9 వేల కోట్లు. తద్వారా మనందరి ప్రభుత్వం అక్కచెల్లెమ్మల్లో కొండంత ఆత్మవిశ్వాసం నింపుతుందని ఆశిస్తున్నాను. ఇంట్లో అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో ఆనందంగా ఉంటేనే ఆ ఇల్లు బాగుంటుందని ప్రగాఢంగా నమ్ముతాను.

కార్పొరేట్‌ కంపెనీలతో టై అప్‌
► అక్కచెల్లెమ్మలు ఎవరికైనా సహాయం కావాలన్నా, వ్యాపారం చేసేందుకు ఏదైనా తోడ్పాటు కావాలన్నా అన్ని విధాలా సహకారం అందిస్తున్నాం. నాలుగేళ్లలో అందే రూ.75 వేలను మరింత సమర్థవంతంగా వినియోగించేలా ఆరాటపడుతూ వీరందరి జీవనోపాధి కోసం అనేక కంపెనీలతో టై అప్‌ చేశాం. 
► రిస్క్‌ లేకుండా వ్యాపారం చేసే విధంగా అమూల్, ఐటీసీ, పీ అండ్‌ జీ, అలానా, హిందుస్థాన్‌ లీవర్‌ లాంటి భారీ వ్యాపార సంస్థలతో ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. నాణ్యమైన ఉత్పాదనలు డీలర్లకిచ్చే రేటు కన్నా తక్కువకు అక్క చెల్లెమ్మలకు వచ్చేలా చూశాం. 
► ఆ ఉత్పత్తులు అమ్మినప్పుడు రూ.7 వేల నుంచి 10 వేల వరకూ ప్రతి ఒక్కరికీ లాభం ఉంటుంది. వీరి వ్యాపారాల కోసం బ్యాంకులతో కూడా మాట్లాడి టై అప్‌ చేశాం. ఇందుకోసం ప్రభుత్వమే అక్కచెల్లెమ్మలను, బ్యాంకులను, కంపెనీలను ఒక తాటిమీదకు తీసుకొచ్చింది. 
► ఇలా 78 వేల మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు పెట్టుకోగలిగారు. 1.19 లక్షల మంది ఆవులు, గేదెలు కొనుగోలు చేయగలిగారు. అమూల్‌ ద్వారా రూ.5 నుంచి రూ.15 వరకు ప్రతి లీటర్‌కూ గతంలో ఇచ్చిన రేటు కన్నా ఎక్కువ రేటు వచ్చేలా చేయగలిగాం. మరో 70 వేల మందికి మేలు జరిగేలా 70 వేల యూనిట్ల గొర్రెలు, మేకలు కొనుగోలు చేశారు. వాటి పెంపకం ద్వారా వాళ్ల ఆదాయం పెరిగి మేలు జరిగింది.
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ జిల్లాల అధికారులు, లబ్ధిదారులతో మాట్లాడుతున్న సీఎం జగన్‌ 

చేయూత కాల్‌ సెంటర్లు
► తొలి ఏడాది వైఎస్సార్‌ చేయూత ద్వారా బ్యాంకులు, స్త్రీనిధి, కార్పొరేట్‌ సంస్థలు.. ఇలా వ్యవస్థలన్నింటినీ భాగస్వామ్యం చేసి రూ.1,510 కోట్ల ఆర్థిక సహాయం చేశాం. అనుసంధానం చేసేందుకు వైఎస్సార్‌ చేయూత కాల్‌ సెంటర్లు కూడా ప్రారంభించాం.
► కాల్‌ సెంటర్ల కోసం 08662468899, 9392917899 నంబర్లను ప్రారంభించాం. అవసరమైన సహాయం, శిక్షణ కోసం కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. 

మరో నెల రోజులు అవకాశం
► అర్హత ఉండీ ఎవరికైనా చేయూత రాకపోతే.. కంగారు పడవద్దు. సమీపంలోని గ్రామ సచివాలయానికి వెళ్లండి. వలంటీర్‌ సహాయం తీసుకోండి. గ్రామ సచివాలయంలో వెంటనే దరఖాస్తు చేసుకోండి. మరో నెల రోజులపాటు ఇటువంటి దరఖాస్తులు తీసుకునే అవకాశం కల్పిస్తామని మీకు భరోసా ఇస్తున్నాను.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి (రెవెన్యూ శాఖ) ధర్మాన కృష్ణదాస్, ఉప ముఖ్యమంత్రి (గిరిజన సంక్షేమ శాఖ) పాముల పుష్ప శ్రీవాణి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ, ఏపీఐఐసీ చైర్మన్‌ ఆర్‌కే రోజా, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

ప్రతి ఇంటిలో మహిళ మహారాణి 
జగనన్నా.. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నేను కిరాణా కొట్టు పెట్టుకున్నాను. మెప్మా అధికారులు సాయం చేయడంతో పలు కంపెనీల ద్వారా తక్కువ ధరకు సరుకులు అందాయి. రోజుకు రూ.600 నుంచి రూ.700 లబ్ధి పొందుతున్నాను. ఇతరత్రా పథకాల ద్వారా మేము చాలా లబ్ధి పొందాము. మీ పాలనలో ఏ సేవ కావాలన్నా వెంటనే లభిస్తోంది. మీ కార్యక్రమాలు, చర్యల వల్ల ఈ రోజు రాష్ట్రంలో ప్రతి ఇంటిలో మహిళ మహారాణిలా ఉంటోంది.    
– జుజ్జవరపు మేరి, ఉయ్యూరు, కృష్ణా జిల్లా  

సొంత అన్నదమ్ముల కంటే మిన్నగా చూస్తున్నారు 
అన్నా నేను మహిళా సంఘం సభ్యురాలిని. మీరు పాదయాత్రలో అందరి సమస్యలు తెలుసుకుని, వాటిని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. సీఎం అయ్యాక ఆ మాట నిలుపుకుంటూ మా కష్టాలు తీరుస్తున్నారు. వైఎస్సార్‌ చేయూత కింద రూ.18,750 నా అకౌంట్‌లో పడ్డాయి. చాలా సంతోషంగా ఉంది. రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మలకు సొంత అన్నదమ్ముల కంటే మీరు ఎక్కువ మేలు చేస్తున్నారు. మాకు ఇంత సాయం ఎవరూ చేయలేదన్నా. మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేమన్నా.  
    – గీతాంజలి, కన్యకాపురం, గుంటిపల్లి పంచాయతీ, చిత్తూరు జిల్లా  

మరిన్ని వార్తలు