త్వరలో పూర్తిస్థాయిలో ‘ఫ్యామిలీ డాక్టర్‌’!

2 Dec, 2022 03:35 IST|Sakshi

వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ పూర్తయ్యేకొద్దీ మరింతగా అందుబాటులోకి

వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో సీఎం జగన్‌ దిశా నిర్దేశం 

పర్యవేక్షణకు సమర్థ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలి

కాన్సెప్ట్‌ అమలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భాగస్వామ్యం 

రక్తహీనతతో బాధపడే చిన్నారులు, గర్భిణులకు మేలు

ఆరోగ్యశ్రీ సాఫ్ట్‌వేర్‌ మరింత మెరుగుపరచాలి

వైద్య ఆరోగ్యశాఖ అమలు చేసే కార్యక్రమాలన్నీ యాప్‌లో ఉండాలి

ఆరోగ్యశ్రీ చికిత్స అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రి వివరాలు లొకేషన్‌తో సహా వెల్లడించాలి

ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి

వారిని పరామర్శించండి..
గ్రామ సందర్శనలో భాగంగా వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ కింద శస్త్ర చికిత్స జరిగిన వారిని, దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర జబ్బులతో మంచానికే పరిమితమైన వ్యక్తులను ఫ్యామిలీ డాక్టర్‌ కలుసుకుని పరామర్శించాలి. ఇళ్ల వద్దకు వెళ్లి వారి ఆరోగ్యంపై వాకబు చేయాలి. అవసరమైన వైద్య సేవలు, మందులు అందించాలి. వైద్య ఆరోగ్య రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత విస్తృతంగా వినియోగించాలి.

క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా వర్కర్‌ స్థాయి వరకు ట్యాబ్‌లు/సెల్‌ఫోన్లు అందించాలి. వైద్య, ఆరోగ్య శాఖకు సంబంధించి అమలు చేస్తున్న ఎఫ్‌పీసీ, ఆరోగ్యశ్రీ సహా వివిధ కార్యక్రమాల యాప్‌లన్నీ వీటిలో పొందుపరచాలి. ఫ్యామిలీ డాక్టర్‌ సంబంధిత గ్రామానికి వెళ్లి అందిస్తున్న వైద్య సేవల రియల్‌ టైమ్‌ డేటాను రికార్డు చేయాలి. దీనివల్ల సిబ్బంది, వివిధ విభాగాలు తీసుకునే చర్యల మధ్య సమన్వయం చక్కగా కుదురుతుంది.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందచేసి క్రమం తప్పకుండా మందులు ఇవ్వడమే కాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలో కూడా సూచనలివ్వాలి. 
– ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

సాక్షి, అమరావతి: ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ (ఎఫ్‌పీసీ) పూర్తి స్థాయిలో అమలుకు  సన్నద్ధం కావాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. డాక్టర్లే స్వయంగా గ్రామాలకు వెళ్లి వైద్య సేవలు అందిస్తున్న నేపథ్యంలో అదనంగా అవసరమయ్యే 104 మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) వాహనాలను త్వరగా సమకూర్చుకోవాలని దిశా నిర్దేశం చేశారు.

ఎఫ్‌పీసీపై పర్యవేక్షణకు సమర్థ యంత్రాంగం ఉండాలని, రాష్ట్రం, అసెంబ్లీ, మండలాల వారీగా వివిధ స్థాయిల్లో పర్యవేక్షణకు అధికారులను నియమించాలని సూచించారు. వైద్య శాఖలో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేదని, అన్ని ఖాళీలను భర్తీ చేయాలని స్పష్టం చేశారు. ఆలోగా విలేజ్‌ క్లినిక్స్‌ నిర్మాణాలను వేగవంతం చేసి ఉగాది కల్లా పూర్తి చేసేలా తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.

ప్రస్తుతం పైలెట్‌ ప్రాతిపదికన కొనసాగుతున్న ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌.. వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్‌ పూర్తయ్యేకొద్దీ ఆయా చోట్ల పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం జగన్‌ ఈ ఏడాది అక్టోబరు 21న ప్రారంభించిన ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ ప్రాజెక్టు అమలుపై సమగ్రంగా సమీక్షించి పలు సూచనలు చేశారు. ఆ వివరాలివీ..
వైద్య, ఆరోగ్య శాఖపై సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

స్త్రీ, శిశు సంక్షేమ శాఖ భాగస్వామ్యం 
ఎఫ్‌పీసీ అమలులో స్త్రీ, శిశు సంక్షేమ శాఖను భాగస్వామ్యం చేయాలి. రక్తహీనతతో బాధ పడుతున్న పిల్లలు, గర్భవతులు, బాలింతలను గుర్తించి ఆ వివరాలను స్త్రీ, శిశు సంక్షేమ శాఖకు అందచేయాలి. వాటి ఆధారంగా పౌష్టికాహారం, మందులు అందించేలా చర్యలు తీసుకోవాలి. 

యాప్‌లో ఆసుపత్రుల వివరాలు..
ఏ వ్యాధికి, ఏ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కింద చికిత్స లభిస్తుందన్నది బాధితులకు తెలియాలి. సంబంధిత చికిత్స అందించే నెట్‌వర్క్‌ ఆసుపత్రి వివరాలు వెంటనే తెలిసేలా యాప్‌ రూపొందించాలి. ఆసుపత్రి లొకేషన్‌తో పాటు డైరెక్షన్‌ కూడా వెల్లడించేలా యాప్‌ ఉండాలి. ఆశా వర్కర్లు, ఏఎన్‌ఎంల దగ్గర నుంచి అందరూ ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆసుపత్రి గురించి గైడ్‌ చేసే పరిస్థితి రావాలి. ప్రజలకు ఈ యాప్‌ అందుబాటులో ఉండాలి. 

ఫిర్యాదులన్నీ 104 ద్వారా 
ఆరోగ్యశ్రీ సేవల విషయంలో ఏమైనా తప్పులుంటే కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. నెట్‌వర్క్‌ ఆస్పత్రులు రోగులకు సరిగా సేవలు అందించకపోవడం, సేవల్లో నాణ్యత లోపించడం లాంటి అంశాలపై వచ్చిన ఫిర్యాదులపై కచ్చితంగా దృష్టి పెట్టాలి. నెగిటివ్‌ ఫీడ్‌ బ్యాక్‌పై పరిశీలన చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలి. డయాలసిస్‌ రోగులకు సేవలందించేందుకు 108 వాహనాలను వినియోగించుకోవాలి. ఆరోగ్య రంగంలో ఎలాంటి ఫిర్యాదునైనా 104 ద్వారా స్వీకరించాలి. విలేజ్‌ క్లినిక్స్‌ సహా అన్ని చోట్లా ఈ నంబర్‌ను ప్రదర్శించాలి.  

మరో 260 వాహనాలు..
ఫ్యామిలీ డాక్టర్‌ పైలెట్‌ కార్యక్రమంలో భాగంగా వైద్యులు 7,166 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లను రెండు సార్లు, 2,866 విలేజ్‌ క్లినిక్‌లను ఒకసారి చొప్పున సందర్శించినట్లు అధికారులు తెలిపారు. గత అక్టోబర్‌ 21 నుంచి ఇప్పటివరకు 7,86,226 మందికి వైద్య సేవలందించామన్నారు. రక్తపోటు బాధితులు 1,78,387, మధుమేహం బాధితులు 1,25,948 మందికి మందులు అందచేసినట్లు వివరించారు. డిసెంబర్‌లో 104 ఎంఎంయూ వాహనాలను అదనంగా 260 సమకూర్చుకుంటున్నట్లు తెలిపారు. దీంతో పూర్తి స్థాయిలో 104 వాహనాలు అందుబాటులోకి వస్తాయన్నారు.

ఎఫ్‌పీసీతో వైద్య సిబ్బందిలో వివిధ విభాగాల మధ్య సమన్వయం గణనీయంగా పెరిగిందని, ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కూడా సిబ్బంది భాగస్వామ్యం బాగా పెరిగిందని చెప్పారు. పాఠశాల విద్యార్థులు, అంగన్‌వాడీ పిల్లలు, గర్భవతుల ఆరోగ్యంపై కూడా దృష్టి సారించి పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడుతున్న వారిని గుర్తించి చికిత్స అందిస్తున్నామన్నారు.

సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, కార్యదర్శి జి.ఎస్‌.నవీన్‌ కుమార్, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ జి.నివాస్, ఆరోగ్యశ్రీ సీఈవో ఎం.ఎన్‌.హరేందిరప్రసాద్, ఏపీ ఎంఎస్‌ఐడీసీ వీసీ, ఎండీ డి.మురళీధర్‌రెడ్డి, డీఎంఈ, ఏపీవీవీపీ కమిషనర్‌ వి.వినోద్‌ కుమార్, ఔషధ నియంత్రణ విభాగం డీజీ రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు