YSR Free Crop Insurance: వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారం

14 Jun, 2022 05:50 IST|Sakshi

15.61 లక్షల మంది రైతులకు రూ. 2,977.82 కోట్లు

శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో రైతన్నల ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైఎస్‌ జగన్‌

టీడీపీ హయాంలో అశాస్త్రీయంగా పంట నష్టం అంచనా

అయిన వారికే బీమా పరిహారం..  

అర్హులకు ఏళ్ల తరబడి అందని సాయం

టీడీపీ హయాం ఐదేళ్లలో అందిన పరిహారం రూ.3,411.2 కోట్లే

ఇప్పుడు శాస్త్రీయంగా పంట నష్టం అంచనా

పంట వేసినప్పుడే ఈ క్రాప్‌లో నమోదు

ప్రతి ఒక్కరికీ పరిహారం.. నేరుగా వారి ఖాతాల్లోనే జమ

గత మూడేళ్లలో ఇచ్చింది రూ.3,707.02 కోట్లు

అన్నదాతలకు పలు పథకాల ద్వారా రూ.1,27,823 కోట్ల సాయం

సాక్షి, అమరావతి/సాక్షి, పుట్టపర్తి: ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పరిహారాన్ని అందించనున్నారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేస్తారు.

ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పంటల బీమాకు ప్రీమియంను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తోంది. వైఎస్సార్‌ ఉచిత పంటల బీమా పథకం కింద రైతన్నలపై ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం పడకుండా చూస్తోంది. సాగు చేసిన ప్రతి ఎకరాన్ని ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌లో నమోదు చేయించి బీమా రక్షణ కల్పిస్తోంది. బీమా పరిహారం సొమ్ము కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఒక సీజన్‌ పంటల బీమా మరుసటి ఏడాది అదే సీజన్‌ రాకముందే క్రమం తప్పకుండా చెల్లిస్తోంది.

గతంలో అస్తవ్యస్తం.. నేడు పూర్తి పారదర్శకం
గత ప్రభుత్వంలో పంట నష్టాల అంచనా అశాస్త్రీయంగా ఉండేది. అయిన వారికే పరిహారం అందేది. రైతన్నలు ప్రభుత్వ ఉద్యోగుల చుట్టూ ఏళ్ల తరబడి తిరిగినా పరిహారం అందుతుందో లేదో తెలియని దుస్ధితి. దళారులను ఆశ్రయించి, లంచాలు ఇస్తే అరకొరగా అందేది. ఇప్పుడా పరిస్థితి లేదు. చీడ పీడలు, అకాల వర్షాలు, వరదలు, కరువు కాటకాల వల్ల ఏ కష్టమొచ్చినా, ఏ నష్టం జరిగినా ఆదుకోవాలన్న తపనతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రైతులకు అన్ని విధాలుగా అండదండగా నిలుస్తున్నారు.

పైసా భారం పడకుండా ఆర్బీకేల ద్వారానే ఈ–క్రాప్‌లో నమోదే ప్రామాణికంగా పంటల బీమా వర్తింపజేస్తున్నారు. పంట వేసినప్పుడే ఈ క్రాప్‌లో నమోదు చేయించి రసీదు ఇస్తున్నారు. పంట నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేస్తున్నారు. దీంతో అర్హులైన ప్రతి ఒక్కరికీ బీమా అందుతోంది. పారదర్శకతకు పెద్దపీట వేస్తూ గ్రామ సచివాలయంలో అర్హుల జాబితా ప్రదర్శిస్తున్నారు. వైపరీత్యాల వల్ల ఏ సీజన్‌లో జరిగిన పంట నష్టానికి ఆ సీజన్‌ ముగిసేలోగానే నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు, దళారుల చుట్టూ తిరగాల్సిన అవస్థలు రైతన్నలకు తప్పాయి. 

టీడీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సాయం
టీడీపీ ఐదేళ్ల పాలనలో 30.85 లక్షల మంది రైతులకు రూ.3,411.2 కోట్ల బీమా పరిహారాన్ని అందించింది.  వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలతో కలిపి ఇప్పటికే 28.67 లక్షల మందికి రూ.3,707.02 కోట్ల బీమా పరిహారం అందించింది. తాజాగా ఖరీఫ్‌–2021లో నష్టపోయిన రైతులకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారం అందిస్తోంది. దీంతో కలిపితే 44.28 లక్షల మంది లబ్ధిదారులకు రూ.6,684.84 కోట్లు లబ్ధి చేకూర్చింది. గడిచిన మూడేళ్లలో రాష్ట్రంలో రైతులకు అన్ని పథకాలూ కలిపి రూ. 1,27,823  కోట్లు సాయంగా నేరుగా అందించింది. 

నేడు చెన్నే కొత్తపల్లికి సీఎం జగన్‌
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో పర్యటించనున్నారు. 2021 ఖరీఫ్‌ పంటల బీమా పరిహారాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని సీఎం ప్రారంభిస్తారు. ఆయన ఉదయం 9 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి 10.50 గంటలకు చెన్నే కొత్తపల్లి చేరుకుంటారు. 

10.50 నుంచి 11.05 గంటల మధ్య స్థానిక నేతలను కలుస్తారు. 11.15 నుంచి 12.45 గంటల వరకు బహిరంగ సభలో పాల్గొంటారు. వేదికపై రైతులతో ముఖాముఖి నిర్వహించి, అనంతరం ప్రసంగిస్తారు. తర్వాత పంటల బీమా మెగా చెక్‌ను రైతులకు అందజేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు  అక్కడి నుంచి బయల్దేరి 2.50 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.  

మరిన్ని వార్తలు