20న రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన

13 Jul, 2022 04:03 IST|Sakshi
పోర్టు శంకుస్థాపన ప్రదేశం వద్ద కరికాల వలవన్, చక్రధర్‌బాబు

సీఎం జగన్‌ చేతుల మీదుగా..

హెలిప్యాడ్, పైలాన్‌ పనుల పరిశీలన

గుడ్లూరు: రామాయపట్నం పోర్టు పనులకు ఈ నెల 20వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేస్తారని పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆర్‌.కరికాల వలవన్‌ తెలిపారు. పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలోని మొండివారిపాలెం వద్ద రామాయపట్నం పోర్టు శంకుస్థాపనకు సీఎం రానున్న నేపథ్యంలో మంగళవారం కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబుతో కలిసి ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. పోర్టు ప్రతిపాదిత ప్రాంతం వద్ద ఏర్పాటు చేస్తున్న పైలాన్, హెలిప్యాడ్‌ నిర్మాణ పనులను పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు.

భద్రతా ఏర్పాట్లపై డీఎస్పీ శ్రీనివాసరావుతో చర్చించారు. కరికాల వలవన్‌ మాట్లాడుతూ రామాయపట్నం పోర్టుకు సంబంధించి భూసేకరణ పనులు దాదాపు పూర్తయ్యాయన్నారు. పోర్టు ఏర్పాటుతో రెండు జిల్లాలు అభివృద్ధి చెందడమే కాకుండా పరిశ్రమల ఏర్పాటు వల్ల వేలాది మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని చెప్పారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌లో ఈ ఏడాది కూడా రాష్ట్ర ప్రభుత్వం మొదటిస్థానంలో నిలిచిందని తెలిపారు. 3 పోర్టులు, 9 షిప్పింగ్‌ హార్బర్లు, మల్టీ మోడల్‌ పార్కులు, వివిధ రకాల పరిశ్రమల నిర్మాణాలు ఏ రాష్ట్రంలోనూ జరగడం లేదన్నారు.

కలెక్టర్‌ చక్రధర్‌బాబు మాట్లాడుతూ.. 2013 చట్టం ప్రకారం మొండివారిపాలెం, ఆవులవారిపాలెం, కర్లపాలెం గ్రామాల్లో నిర్వాసితులవుతున్న 600 కుటుంబాలకు ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ నష్టపరిహారం అందజేస్తుందన్నారు. పోర్టు నిర్మాణానికి మూడు గ్రామాల ప్రజలు పూర్తి సహకారం అందిస్తున్నారని తెలిపారు. మారిటైం బోర్డు నుంచి రవీంథ్రనాథ్‌రెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ ఆర్‌.కూర్మనాథ్, ఇరిగేషన్‌ ఎస్‌ఈ కృష్ణమోహన్, డీఆర్‌డీఏ పీడీ సాంబశివారెడ్డి, కందుకూరు ఆర్డీవో సుబ్బారెడ్డి, పోర్టు లైజనింగ్‌ అధికారి ఐవీ రెడ్డి, విద్యుత్‌ శాఖ ఈఈ వీరయ్య, డీఎస్పీ శ్రీనివాసరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు