ఫీ'జులుం' సాగడంలేదిక్కడ

24 Jul, 2022 04:16 IST|Sakshi

ఎంబీబీఎస్‌ చదివిన ప్రతి విద్యార్థికీ ఇప్పుడు పీజీ తప్పనిసరి. ఇందుకోసం వైద్య విద్యార్థులు అహోరాత్రాలూ కష్టపడతారు. తీరా నీట్‌ పరీక్ష రాసి, ర్యాంకులు వచ్చాక.. ప్రభుత్వ కళాశాలల్లో సీటు రాక, ప్రైవేటు కళాశాలల్లో చేరలేక నిరుత్సాహ పడిపోతారు. ఫీజులు అత్యధికంగా ఉండటమే ఇందుకు కారణం. ఇలా పేద, మధ్య తరగతి విద్యార్థులు ఉన్నత వైద్య విద్యకు దూరమవుతున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఇదే విషయంపై ఆలోచన చేశారు. వెంటనే భారీగా ఫీజులు తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిస్థితి మారింది. ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో సీటు పొందాలని ప్రయత్నిస్తున్నారు. 
– నాగా వెంకటరెడ్డి

చంద్రబాబు దుర్మార్గం.. జగన్‌ మానవత 
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రైవేటు మెడికల్‌ కాలేజీల యాజమాన్యాలు ఇష్టానుసారం ఫీజులు పెంచుకునేలా నిర్ణయం తీసుకున్నారు. 2014లో చంద్రబాబు అధికారం చేపట్టగానే ఆయన బంధువుకు చెందిన విశాఖలోని గీతం మెడికల్‌ కళాశాలకు డీమ్డ్‌ హోదా కల్పించి, ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లో ఎంబీబీఎస్, డెంటల్, పీజీ సీట్ల ఫీజులు ఇష్టానుసారం పెంచుకొనే అవకాశమిచ్చారు. ఇందుకు అడ్డు చెప్పిన అప్పటి వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎల్‌వీ సుబ్రమణ్యంను తప్పించి మరీ నిర్ణయం తీసుకున్నారు.

2015లో రాష్ట్రంలోని ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ పీజీ వైద్య ఫీజు ఏడాదికి రూ.11 లక్షలు ఉండగా, చంద్రబాబు ప్రభుత్వం 2017లో ఏడాదికి రూ.24.20 లక్షలకు పెంచేసింది. అంటే రెండింతలకు పైగా పెంచింది. దీంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు అనేకమంది ఉన్నత వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీని సాకుగా చూపుతూ కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ తదితర రాష్ట్రాలు కూడా ఫీజులు పెంచేశాయి. జగన్‌ సర్కారు వచ్చిన తర్వాత మానవతా దృక్పధంతో ఆలోచించింది. సీఎం జగన్‌ జస్టిస్‌ వి.ఈశ్వరయ్య నేతృత్వంలో ఉన్నత విద్య ఫీజుల నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ను నియమించారు.

దేశంలోని మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలల్లో ఫీజులను పరిశీలించారు. సహేతుకత ఆధారంగా 2020–21 విద్యా సంవత్సరం నుంచి ఫీజులను తగ్గించారు. దీంతో ప్రైవేటు కళాశాలల్లో బి కేటగిరీ ఫీజు రూ.24.20 లక్షల నుంచి రూ.8.64 లక్షలకు దిగొచ్చింది. అంటే ఏడాదికి రూ.15.56 లక్షలు చొప్పున మూడేళ్ల  కోర్సుకు రూ.46.68 లక్షల భారం తల్లిదండ్రులకు తగ్గింది. దీంతో అన్ని రాష్ట్రాల విద్యార్థులూ ఏపీ వైపు చూస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో బి కేటగిరి సీట్లకు తీవ్రమైన పోటీ ఉంటుందని ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్శిటీ వైస్‌ ఛాన్సలర్‌ డాక్టర్‌ పి.శ్యాంప్రసాద్‌ తెలిపారు. ఫీజులు తక్కువ కావడంతో పాటు ఏపీలో కోర్సు పూర్తయిన తరువాత సర్వీసు బాండ్లు అమల్లో లేవు. ఇది కూడా  విద్యార్థులకు సానుకూల అంశమని వైద్య కళాశాలల ప్రతినిధులు చెబుతున్నారు. 

పీజీ అయ్యేలోగా రుణం తీర్చేసుకోవచ్చు 
ఆంధ్రలో బి కేటగిరిలో పీజీ సీటు తెచ్చుకోగలిగితే పేద, మధ్య తరగతి వారు కూడా ధైర్యంగా చేరవచ్చు. బ్యాంకుల నుంచి ఎడ్యుకేషన్‌ లోన్‌ తీసుకుని కోర్స్‌ పూర్తయ్యేలోగా స్టయిఫండ్‌తో, సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్‌గా పనిచేస్తూ అప్పు తీర్చేసుకోవచ్చు అని ఓ వైద్య విద్యార్థి అభిప్రాయపడ్డారు. 

మెడికల్‌ కాలేజీల్లో ఫీజులు ఇలా.. 
జగన్‌ సర్కారు చర్యల కారణంగా మెడికల్‌ పీజీ క్లినికల్‌ డిగ్రీ, పారా క్లినికల్‌ డిగ్రీ/ డిప్లొమా, ప్రి క్లినికల్‌ కోర్సుల కన్వీనర్‌ కోటా, మేనేజ్‌మెంట్‌ కోటా, ఇన్‌స్టిట్యూషనల్‌/ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజులు మన రాష్ట్రంలోనే తక్కువగా ఉన్నాయి. 
► క్లినికల్‌ డిగ్రీ కన్వీనర్‌ కోటా ఫీజు రూ.4.32 లక్షలు కాగా, మేనేజ్‌మెంట్‌ కోటా రూ.8.64 లక్షలు. ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు రూ.50 లక్షలుగా ఉండగా కళాశాలల యాజమాన్యాలు కోర్సు డిమాండ్‌ ఆధారంగా అధికమొత్తంలో వసూలు చేస్తున్నట్లు విద్యార్థులు చెబుతున్నారు. క్లినికల్‌ డిగ్రీ బి కేటగిరి కింద ఏపీలో మూడేళ్లలో చెల్లించే ఫీజు 25.92 లక్షలు. అదే తెలంగాణలో ఏడాదికి రూ.23 లక్షలు చొప్పున మూడేళ్లలో రూ.69 లక్షలు చెల్లించాలి. ఇది ఏపీలో కన్నా 62.43 శాతం అధికం. 
► పారా క్లినికల్‌ డిగ్రీ/ డిప్లొమా కన్వీనర్‌ కోటా ఫీజు రూ.1.35 లక్షలు కాగా, మేనేజ్‌మెంట్‌ కోటా రూ.2.70 లక్షలు.  ఎన్‌ఆర్‌ఐ కోటా ఫీజు రూ.15 లక్షలు. తెలంగాణలో ఇవే రూ.4.30 లక్షలు, రూ.5.30 లక్షలు, రూ.15.90 లక్షలు వసూలు చేస్తున్నారు. ఇవి ఏపీలోకన్నా 68.60, 49.06, 5.66 శాతం అధికం.  
► ప్రి క్లినికల్‌ కోర్సు ఫీజుల్లోనూ ఇదే విధంగా తేడాలు ఉన్నాయి. 
► కర్ణాటక, కేరళలోనూ ఫీజులు ఏపీలోకన్నా ఎక్కువే. కర్ణాటక ప్రైవేటు మెడికల్‌ కాలేజీలో పీజీ సీటుకు కోర్సును బట్టి రూ.11.50 లక్షల నుంచి వసూలు చేస్తున్నారు. అదే డీమ్డ్‌ యూనివర్శిటీల్లో పీజీ బి కేటగిరి సీటు ఏడాది ఫీజు 25.30 లక్షలు. క్లినికల్‌ డిగ్రీ ఫీజు కేరళలో ఏపీలోకన్నా 42.4 శాతం అధికం. పారా క్లినికల్‌ డిగ్రీ/ డిప్లొమో కోర్సుల ఫీజులు ఏకంగా 70.35 శాతం ఎక్కువ.

పీజీ మెడికల్‌ సీట్లు ఇలా.. 
► 2021– 2022 ప్రకారం రాష్ట్రంలోని 11 ప్రభుత్వ, 16 ప్రైవేటు మెడికల్‌ కాలేజీల్లోని మొత్తం పీజీ సీట్లు 2,358.  
► ప్రభుత్వ కాలేజీల్లో 1,034 సీట్లు కాగా ఆల్‌ ఇండియా కోటా కింద 505, స్టేట్‌ కోటా కింద 529 ఉన్నాయి. 
► ప్రైవేటు కాలేజీల్లో సీటు 1,324 కాగా కాంపిటెంట్‌ కోటా కింద 639, మేనేజ్‌మెంట్‌ కోటా 685 ఉన్నాయి.

థ్యాంక్యూ.. జగన్‌ అంకుల్‌ 
‘నీట్‌’లో ర్యాంకు వచ్చింది. ‘బీ’ కేటగిరిలో ఆం్ర«ధాలో సీటు వచ్చింది. పెంచిన ఫీజుల భారాన్ని భరించే ఆర్థిక పరిస్థితులు లేక అమ్మనాన్నలను, ఆంధ్రాను వదిలి 2016లో కర్ణాటకకు రావాల్సి వచ్చింది. నాకన్నా మెరుగైన ర్యాంకులు పొందిన నా ప్రెండ్స్‌ ఫీజులు భరించలేక వైద్య విద్యకు దూరమయ్యారు. ఏపీలో 2014 వరకు ఎంబీబీఎస్‌ సీటు బీ కేటగిరిలో ఏడాదికి రూ.2.50 లక్షలు ఉండేది. దాన్ని రూ.11 లక్షలకు పెంచుకునేలా చంద్రబాబు ప్రభుత్వం అనుమతిచ్చింది.

ఏపీని చూసి కర్ణాటకలోనూ పెంచేశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మంచి ర్యాంకులు తెచ్చుకుని డబ్బు లేనివారు మెడిసిన్‌కు దూరమవుతున్నారు. ఆంధ్రాలో బీ కేటగిరీలో పీజీ సీటు వచ్చేలా ర్యాంకు తెచ్చుకోవాలని.. ఇక్కడ సీటొస్తే కుటుంబమంతా కలిసి ఉండవచ్చని అమ్మానాన్నలు పదేపదే చెపుతున్నారు. ఈ ఆకాంక్ష మా ఒక్కరిదే కాదు.. తల్లిదండ్రులందరిదీ. థాంక్యూ జగన్‌ అంకుల్‌. 
– ఎం.కావ్య (ఎంబీబీఎస్‌), కర్ణాటక 

మరిన్ని వార్తలు