CM YS Jagan: సీఎం జగన్‌ స్పష్టమైన సంకేతం.. ఇక తగ్గేదేలే!

1 Feb, 2023 18:13 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంత పట్టుదలతో ఉంటారో మరోసారి రుజువైంది. తెలుగు రాష్ట్రాలలో హైదరాబాద్ తర్వాత అతి పెద్ద నగరం అయిన విశాఖపట్నాన్ని రాజధానిగా ఎంపిక చేసుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేయవచ్చన్న భావనతో ఉన్న జగన్ ఆ దిశగా ఒక స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. విశాఖపట్నమే ఏపీ రాజధాని అని ఆయన డిల్లీలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ మీట్ సన్నాహక సదస్సులో పేర్కొన్నారు. రాబోయే నెలల్లో విశాఖ రాజధాని అవుతుందని, తాను విశాఖకు మారి అక్కడ నుంచే పాలన చేస్తానని ఆయన వెల్లడించారు.

బహుశా ఈ మధ్యకాలంలో ఇంత క్లారిటీతో ఈ విషయాన్ని చెప్పడం ఇదే మొదటిసారి కావచ్చు. మూడేళ్ల క్రితం మూడు రాజధానుల అంశం ప్రకటించి సంచలనం సృష్టించిన జగన్ వివిధ కారణాలతో వెంటనే దానిని అమలు చేయలేకపోయారు. తెలుగుదేశం, జనసేన వంటి పక్షాలు ఇందుకు అడ్డపడడం, హైకోర్టుకు వెళ్లి మూడు రాజధానుల నిర్ణయానికి  ఆటంకాలు సృష్టించడంతో, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అప్పటికి మూడు రాజధానుల చట్టాన్ని ఉపసంహరించుకోవడం జరిగాయి. కాని అప్పుడే మళ్లీ కొత్త బిల్లును మరింత ప్రయోజనకరంగా, మూడు ప్రాంతాలకు ఉపయోగపడేలా తీసుకువస్తామని ప్రకటించారు.

గత ప్రభుత్వం అమరావతి పేరుతో విజయవాడ, గుంటూరు ల మధ్య గ్రామాలను రాజధానిగా ఎంపిక చేసుకుంది. అక్కడ లక్షల కోట్ల వ్యయం చేస్తేకాని రాజధాని నిర్మాణం పూర్తి చేయలేని పరిస్థితిని సృష్టించుకుంది. బలవంతంగా పలు చోట్ల రైతుల నుంచి భూములను సమీకరించింది. కొన్ని చోట్ల పంటలను కూడా దగ్దం చేసిందన్న ఆరోపణలు కూడా వచ్చాయి. సుమారు ఏభైవేల ఎకరాలలో రాజధాని నిర్మాణం అంటే లక్షల కోట్ల వ్యయం చేయల్సి ఉంటుంది. తొలి దశలో లక్షా తొమ్మిదివేల కోట్ల రూపాయల మేర మౌలిక వసతుల కోసం వెచ్చించాలని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. కాని కేంద్రం మాత్రం కేవలం 2500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకుంది.

ఆచరణ సాధ్యం కాని ప్రతిపాదనలతో ఆయన హడావుడి చేశారు. ఈ నేపథ్యంలో అన్ని  ప్రాంతాల ప్రజలలో అమరావతిపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. చివరికి ఆ గ్రామాలు ఉన్న తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలలో సైతం టీడీపీ ఓటమిపాలైంది. తదుపరి అదికారంలోకి వచ్చిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం రాజధాని అంశంపై బోస్టన్ గ్రూప్ తో అధ్యయనం చేయించింది. ఆ తర్వాత  నిపుణుల కమిటీని నియమించింది.

అంతకుముందు కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ చేసిన సిఫారస్‌లను కూడా  పరిగణనలోకి తీసుకుని విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా  జగన్ సర్కార్ ప్రకటించింది. కాని దీనిని తెలుగుదేశం, జనసేన తదితర కొన్ని పక్షాలు వ్యతిరేకించాయి. అమరావతి రాజధానిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చడం, ఇన్ సైడ్ ట్రేడింగ్ వంటి ఆరోపణలు రావడం నెగిటివ్ పాయింట్లుగా మారాయి.

అంతేకాక జాతీయ రహదారికి సుదూరంగా మారుమూల గ్రామాలలో  రాజధాని నిర్మించాలన్న ఆలోచనపై వివిధ వర్గాలు పెదవి విరిచాయి. అక్కడకు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తాయని గత ప్రభుత్వం ఆశించినా, అందుకు పెట్టుబడిదారులు ఆసక్తి చూపలేదు. దానికి కారణం అమరావతిలో నగర వాతావరణం లేకపోవడం, కాస్మొపాలిటన్ కల్చర్ కాకుండా, సామాజికవర్గ ఆధిపత్య ధోరణి ఉండడమే అని వేరే చెప్పనవసరం లేదు.

అదే విశాఖ అయితే పెద్ద నగరం కావడం, అక్కడ ప్రభుత్వ భూములు అందుబాటులో ఉండడం, కాస్మోపాలిటన్ కల్చర్, కులాల రొంపి పెద్దగా లేకపోవడం వంటివి అడ్వాంటేజ్‌గా మారాయి. అక్కడకు పెట్టుబడిదారులు రావడం, ఐటీ వంటి పరిశ్రమలు పెట్టడానికి ఆసక్తి కనబరుస్తుండడం కూడా కలిసి వస్తోంది. గతంలో సైతం పెట్టుబడుల సదస్సులను విశాఖలోనే నిర్వహించేవారు. తద్వారా ఆ నగర ప్రాముఖ్యతను అప్పటి ప్రభుత్వం కూడా ఒప్పుకున్నట్లయింది.

కాని విశాఖ నగరం అయితే తమ రియల్ ఎస్టేట్ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలుగుదేశం పార్టీ ముఖ్యులు భావించి కృత్రిమ ఉద్యమం సృష్టించారు. కాని అది కాలక్రమేణా నీరుకారిపోయింది. తాజాగా మూడు రాజధానుల అంశం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. అసలు చట్టం చేసే అధికారమే అసెంబ్లీకి లేదని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం, అది కూడా చట్టం ఉపసంహరణ తర్వాత తీర్పు చెప్పడం ఆశ్చర్యం కలిగింది. దీనిపై గౌరవ అత్యున్నత స్థానం ఏమి చెబుతుందన్నది ఉత్కంఠ కలిగించే అంశం.
చదవండి: లోకేష్‌ పాదయాత్రలో ఏం కనిపించింది?.. వర్కౌట్‌ అవుతుందా?

ఈ నేపథ్యంలో జగన్ విశాఖను రాజధానిగా మరోసారి ఉద్ఘాటించడం ద్వారా తన ఆత్మ విశ్వాసాన్ని తెలియచెప్పారు. ఇప్పటికే ఉత్తరాంధ్రలో విశాఖ రాజధాని కావాలన్న ఆకాంక్ష బలంగా ఏర్పడింది. పలు చోట్ల ర్యాలీలు, సదస్సులు జరిగాయి. కాని విశాఖను రాజధాని కాకుండా అడ్డుకోవడానికి టీడీపీ, దాని అనుబంధ మీడియా విశ్వయత్నం చేస్తున్నాయి. అక్కడ ఎలాంటి అభివృద్దికి ప్రయత్నించినా, నిరోధించడానికి రకరకాల వ్యూహాలు పన్నుతున్నాయి.

అయినా జగన్ ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. ఏపీ దిశ,దశను మార్చే ఈ నిర్ణయాన్ని ఎంత త్వరగా అమలు చేస్తే అంత మంచిదని చెప్పాలి. ఏప్రిల్ నాటికి విశాఖ నుంచి సీఎం పాలన చేస్తారని టీడీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా ప్రకటించారు. ఇదే సమయంలో అమరావతి ప్రాంతంలో శాసన సభ ను ఉంచడమే కాకుండా, అక్కడ అభివృద్ది పథకాలకు శ్రీకారం చుడుతున్నారు.  ఏది ఏమైనా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం చేస్తున్న ఈ ప్రయత్నం సఫలం కావాలని ఆకాంక్షిద్దాం.
-హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ 

మరిన్ని వార్తలు