గొప్ప మనసు చాటుకున్న సీఎం జగన్‌.. హనీ వైద్యం కోసం రూ.కోటి మంజూరు

2 Oct, 2022 21:17 IST|Sakshi

అమలాపురం ఏరియా ఆస్పత్రిలో తొలి ఇంజెక్షన్‌ ఇచ్చిన వైద్యులు

చిన్నారికి చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ అందిస్తామని ప్రభుత్వం భరోసా

ముఖ్యమంత్రి మానవత్వాన్ని చూసి తల్లిదండ్రుల ఆనందభాష్పాలు

జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటామంటూ ఉద్వేగం  

అమలాపురం టౌన్‌(కోనసీమ జిల్లా): ఓ చిన్నారి ప్రాణాలకు సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీరామరక్షలా నిలిచారు. ఆమెకు సోకిన అరుదైన వ్యాధి వైద్యానికి లక్షలాది రూపాయల ఖర్చును జీవితాంతం భరిస్తానని భరోసా ఇచ్చారు. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రుల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. తమ పాలిట దైవంలా వచ్చి తమ బిడ్డకు ప్రాణం పోశారంటూ ఆ నిరుపేద తల్లిదండ్రులు సీఎం జగన్‌కు చేతులెత్తి దండం పెడుతున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అల్లవరం మండలం నక్కా రామేశ్వరానికి చెందిన మూడేళ్ల కొప్పాడి హనీ.. కాలేయానికి సంబంధించిన అరుదైన వ్యాధి 

‘గాకర్స్‌’ బారిన పడింది. తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి నిరు పేదలు. తండ్రి ఇంటింటా ప్రభుత్వ రేషన్‌ వాహనాన్ని నడుపుకుంటూ, తల్లి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు, కుమార్తె హనీ ఉన్నారు. హనీకి 15 రోజులకోసారి రూ.1.25 లక్షల విలువైన సెరిజైమ్‌ అనే ఇంజెక్షన్‌ చేయాల్సి ఉంది. అమెరికాలోని ఈ ఇంజెక్షన్‌ తయారీ సంస్థ డిస్కౌంట్‌ పోను రూ.74 వేలకు దీనిని అందిస్తోంది. ఇంత ఖర్చు చేయడం ఆ కుటుంబం వల్ల కావడం లేదు.

ప్లకార్డు చూసి.. స్పందించిన సీఎం జగన్‌
కుమార్తెను ఎలా దక్కించుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్న వారికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆపద్బాంధవుడిలా కనిపించారు. గత జూలై 26న సీఎం జగన్‌ కోనసీమ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల సందర్శనకు వచ్చారు. లంకల్లో వరద పరిస్థితులను పరిశీలించాక పి.గన్నవరం మండలం గంటి పెదపూడిలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కాన్వాయ్‌తో వెళుతున్నారు. ‘సీఎం గారూ.. మా పాపకు వైద్యం అందించండి’ అనే అభ్యర్థనతో ప్లకార్డు పట్టుకుని.. హెలిప్యాడ్‌ సమీపాన కుమార్తెతో కలిసి తల్లిదండ్రులు నిలుచున్నారు. ఆ ప్లకార్డు చూసి ఆగిన  సీఎం జగన్‌.. ఆ చిన్నారి వ్యాధి గురించి విని చలించిపోయారు. పాప ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఎన్ని లక్షల రూపాయలు ఖర్చయినా జీవితాంతం వైద్యం చేయిస్తానని వారికి భరోసా ఇచ్చారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌   హిమాన్షు శుక్లాను ఆదేశించారు.

తొలి విడతగా రూ.10 లక్షలతో 13 ఇంజెక్షన్లు
సీఎం ఆదేశాల మేరకు చిన్నారి వైద్యానికి తొలి విడతగా రూ.10 లక్షల విలువైన 13 ఇంజెక్షన్లను అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఇక ముందు కూడా దాదాపు రూ.40 లక్షలతో మరో 52 ఇంజెక్షన్లు తెప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రిలో కలెక్టర్‌ సమక్షంలో జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ పద్మశ్రీరాణి, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి  భరతలక్ష్మి, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకరరావులు.. హనీకి ఆదివారం ఉదయం తొలి ఇంజెక్షన్‌ చేశారు. బాలిక తల్లిదండ్రులకు కలెక్టర్‌ శుక్లా ధైర్యం చెప్పారు. చిన్నారి వైద్యానికి సీఎం జగన్‌ రూ.కోటి కేటాయించారని తెలిపారు. చదువుతో పాటు పౌష్టికాహారం, పెన్షన్‌ను కూడా ప్రభుత్వం అందిస్తుందని భరోసా ఇచ్చారు. చిన్నారికి ప్రభుత్వం సరఫరా చేసిన మందుల కిట్‌ను వారికి అందించారు.

దేశంలో మొత్తం 14 మంది.. రాష్ట్రంలో తొలి బాధితురాలు
హనీకి వచ్చిన కాలేయ సంబంధిత గ్రాకర్‌ వ్యాధి అత్యంత అరుదైనది. దేశంలో ఈ తరహా బాధితులు 14 మందే ఉండగా..   రాష్ట్రంలో హనీ తొలి బాధితురాలు. కాలేయ పనితీరులో జరిగే ప్రతికూల పరిస్థితులు, జన్యుపరమైన లోపాల వల్ల ఈ అరుదైన వ్యాధి సోకుతుంది. లివర్‌ హార్మోన్ల రీప్లేస్‌మెంట్‌ థెరపీ ద్వారా చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. లివర్‌లో ఉండే ఎంజైమ్‌ బీటా గ్లూకోసైడేజ్‌ లోపించడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. వీరికి జీవితాంతం వైద్యం అవసరం. అయితే హనీ చిన్న వయస్సులో ఉన్నందున పదేళ్ల పాటు ప్రతి నెలా రెండు ఇంజెక్షన్ల చొప్పున ఇస్తే.. ఆరోగ్యం కుదుట పడే అవకాశముందని వైద్యులు భావిస్తున్నారు.

పేదోడి కోసం ఓ ముఖ్యమంత్రి ఇంతలా పరితపిస్తారా.. 
ఈ రోజే తొలి ఇంజెక్షన్‌ ఇచ్చారు. మా పాపకు ప్రాణం దానం చేసిన సీఎం జగన్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం. ఆ రోజు కాన్వాయ్‌లో సీఎం జగనన్న మమ్మల్ని చూసి ఆగడం.. మా పాప అనారోగ్యం గురించి తక్షణమే స్పందించి కలెక్టర్‌కు చెప్పడం, ఇప్పుడు రూ.లక్షల విలువైన వైద్యం అందించడం చూస్తుంటే.. ఓ సీఎం ఇంతలా ఓ పేదవాడి కోసం తపిస్తారా.. అని ఆశ్చర్యమేస్తోంది. మా బిడ్డను ఆదుకుని మాపాలిట దైవంలా నిలిచిన జగనన్నకు చేతులెత్తి దండాలు పెడుతున్నాం.
–  తల్లిదండ్రులు రాంబాబు, నాగలక్ష్మి  


 

మరిన్ని వార్తలు