సీఎం జగన్‌కు విశాఖ అంటే ఎంతో ఇష్టం..

5 Mar, 2021 18:45 IST|Sakshi

సాక్షి, విశాఖ: సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి విశాఖ నగరంపై ప్రత్యేక మమకారం ఉందని, ఈ నగరాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ఆయన ప్రత్యేక ప్రణాళికలు కలిగి ఉన్నారని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. విశాఖ కేంద్రంగా రాజధాని ఏర్పాటు చేయడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు కలిగించినా వెనక్కు తగ్గేది లేదని, విశాఖ రాజధాని కావడం తధ్యమని ఆయన స్పష్టం చేశారు. విశాఖను రాజధానిగా వ్యతిరేకించిన చంద్రబాబు, అతని తనయుడు లోకేశ్‌ బాబుకు విశాఖలో పర్యటించే అర్హత లేదని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నేడు కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌ విజయవంతమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

బంద్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. కార్మిక సంఘాలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం అండగా నిలవడంతో బంద్ విజయవంతమయ్యిందన్నారు. ఈ మున్సిపల్‌ ఎన్నికలతో టీడీపీ ఖేల్‌ ఖతం అవుతుందన్న ఆయన.. ఆ పార్టీని ఆల్ బెవర్స్ అండ్ డెకాయిట్స్ పార్టీ(ఏబీసీ పార్టీ) అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన హయాంలో తప్పుడు డాక్యుమెంట్లతో అనుయాయులకు విలువైన భూములు కట్టబెట్టడాన్ని ఆయన ప్రస్థావించారు. త్వరలో విశాఖలో లక్షా 90 వేల మందికి సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. 

ప్రభుత్వ సహకారంతో బంద్ విజయవంతం..

స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు చేపట్టిన బంద్‌కు ప్రభుత్వ సహకారం తోడవడంతో బంద్‌ విజయవంతమైందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. విశాఖ ఉక్కుకు మద్దతుగా ప్రధానికి లేఖ రాసేందుకు కూడా చంద్రబాబుకు ధైర్యం లేదని ఎద్దేవా చేశారు. వైయస్సార్సీపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం అవుతుందని చంద్రబాబు దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. పొస్కో ఏపీకి రావడం నిజమే కానీ.. ప్రభుత్వం కృష్ణ పట్నం, భావనపాడులో పరిశ్రమ ఏర్పాటు చేయాలని సూచించిందన్నారు. ఓట్ల కోసం చంద్రబాబు గల్లి గల్లి తిరుగుతున్నారని, మా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డికి ఆ అవసరం లేదని పేర్కొన్నారు. సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రజలే స్వచ్ఛందంగా తమకు ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికలేవైనా రిజల్ట్‌ ఎప్పుడూ వైఎస్సార్సీపీ అనుకూలంగానే వస్తుందన్నారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు