చిన్న, సన్నకారు రైతులందరికీ డ్రిప్, స్ప్రింక్లర్లు

7 Apr, 2021 02:58 IST|Sakshi

నిర్ణీత సమయంలోగా సమకూర్చాలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

సీమ, ప్రకాశంలో 10 ఎకరాల్లోపు రైతులకు ప్రాధాన్యం

మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్నవారికి ప్రాధాన్యం

చిన్న, సన్నకారు రైతులకు మేలు చేకూర్చడంపై కార్యాచరణకు ఆదేశం

ఆర్బీకేల పరిధిలో సేంద్రియ, సహజ వ్యవసాయ విధానాలకు ప్రోత్సాహం

ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మౌలిక వసతులపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష   

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులందరికీ బిందు, తుంపర (డ్రిప్, స్ప్రింక్లర్లు) సేద్యం సదుపాయాలను నిర్ణీత సమయంలోగా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. చిన్న, సన్నకారు రైతులకు వైఎస్సార్‌ జలకళ పథకం ద్వారా బోర్లు తవ్విస్తున్నందున వారికి సూక్ష్మ సేద్యం సదుపాయాలను కల్పిస్తే మంచి ఫలితాలు వస్తాయని సీఎం పేర్కొన్నారు.

ఏం చేసినా సంతృప్త స్థాయి (శాచ్యురేషన్‌)పద్ధతిలో ఉండాలని, కొందరికి మాత్రమే పథకాలు ఉండకూడదని, అందరికీ ఫలాలు అందాలని సీఎం స్పష్టం చేశారు. వ్యవçస్థలో అవినీతి ఉండకూడదని, చిన్న, సన్నకారు రైతులకు ఎలా మేలు చేయాలన్న అంశంపై ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, వ్యవసాయ మౌలిక వసతుల కల్పనపై సీఎం మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.  

రివర్స్‌ టెండర్లతో ధరలు తగ్గి ఎక్కువ మందికి మేలు..
రాయలసీమ, ప్రకాశం లాంటి ప్రాంతాల్లో 10 ఎకరాల్లోపు, మిగిలిన చోట్ల 5 ఎకరాల్లోపు ఉన్న రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ల సదుపాయాలను కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. దీనిపై పూర్తిస్థాయిలో కసరత్తు జరిపి కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సూక్ష్మ సేద్యం పరికరాలను రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా కొనుగోలు చేయడం ద్వారా ధర తగ్గి ఎక్కువ మంది రైతులకు అందుబాటులోకి తెచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కల్పించే రాయితీలను పరిగణలోకి తీసుకుని లెక్కిస్తే ఎంత ధరకు డ్రిప్, స్ప్రింక్లర్‌ వ్యవస్థలు అందుబాటులోకి వస్తాయన్న దానిపై ఒక అవగాహన వస్తుందన్నారు.

సెరి కల్చర్‌పై ప్రత్యేక దృష్టి
మల్బరీ సాగు రైతుల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. మల్బరీ సాగు చేసే రైతుల పరిస్థితులను పూర్తి స్థాయిలో మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

మల్టీ పర్పస్‌ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు
అగ్రి ఇన్‌ఫ్రాలో భాగంగా ఏర్పాటు చేయనున్న మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. ప్రతి ఆర్బీకే పరిధిలో సేంద్రీయ, సహజ వ్యవసాయ విధానాలను ప్రోత్సహించాలని ఆదేశించారు. దీనికి సంబంధించిన పరికరాలను ప్రతి కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ (సీహెచ్‌సీ)లో ఉంచాలని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మల్టీపర్పస్‌ కేంద్రాల్లో 14 రకాల సదుపాయాలు ఉంటాయని, ఇందుకు దాదాపు రూ.14,562 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. డ్రై స్టోరేజీ, డ్రైయింగ్‌ ఫ్లాట్‌ఫాం, గోడౌన్లు, హార్టికల్చర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రైమరీ ప్రాసెసింగ్‌ సెంటర్లు, యంత్ర పరికరాలు, ప్రొక్యూర్‌మెంట్‌ సెంటర్లు, ఈ – మార్కెటింగ్, జనతాబజార్లు, ప్రైమరీ ప్రాసెసింగ్‌ యూనిట్లు తదితరాలు ఉంటాయని అధికారులు తెలిపారు.

– సమీక్షలో ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ పూనం మాలకొండయ్య, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, మార్కెటింగ్‌ శాఖ కమిషనర్‌ పీఎస్‌ ప్రద్యుమ్న, మత్స్యశాఖ కమిషనర్‌ కె. కన్నబాబు, మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, హార్టికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు