AP Curfew Timings: 8 జిల్లాల్లో ఆంక్షలు సడలింపు

29 Jun, 2021 02:43 IST|Sakshi

ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకూ సడలింపులు; ఆ తరువాత రాత్రంతా కర్ఫ్యూ

ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశంలో సాయంత్రం 6 వరకే సడలింపులు.. అప్పటి నుంచి ఉదయం 6 వరకూ కర్ఫ్యూ  

జూలై 1 నుంచి 7 వరకూ వర్తింపు

పాజిటివిటీ రేటు ఆధారంగా ప్రభుత్వం ఆదేశాలు

కోవిడ్‌ బాధితులకు మెరుగ్గా సైకలాజికల్‌  కౌన్సెలింగ్‌

కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా తక్కువగా ఉన్న 8 జిల్లాల్లో జూలై 1 నుంచి వారం రోజుల పాటు కర్ఫ్యూ ఆంక్షలు సడలించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. అనంతపురం, గుంటూరు, వైఎస్సార్, కర్నూలు, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో పాజిటివిటీ రేటు తక్కువగా ఉన్నందున ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు కర్ఫ్యూ సడలించనున్నారు. ఈ జిల్లాల్లో రాత్రి 9 గంటల నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు, తదితరాలన్నీ మూసివేయాలని ఆదేశించారు. ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పాజిటివిటీ రేటు ఐదు శాతం కన్నా ఎక్కువగా ఉన్నందున ప్రస్తుతం అమల్లో ఉన్న విధంగానే సాయంత్రం 6 గంటల వరకే కర్ఫ్యూ సడలింపు ఉంటుంది. ఈ ఐదు జిల్లాల్లో సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. పాజిటివిటీ రేటు పరిశీలించాక ఈ జిల్లాల్లో  సడలింపులపై నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఈ సడలింపులు జూలై 1 నుంచి 7 వరకు అమల్లో ఉంటాయని తెలిపారు. కోవిడ్‌ థర్డ్‌ వేవ్‌ వస్తే ఎదుర్కొనేందుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కోవిడ్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సోమవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

సీజనల్‌ వ్యాధులకు 104 వైద్య సేవలు
కోవిడేతర కేసులకూ 104 ద్వారా వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. సీజనల్‌ వ్యాధులకూ 104 కాల్‌సెంటర్‌ ద్వారా వైద్య సేవలు అందాలని స్పష్టం చేశారు. విలేజ్‌ క్లినిక్స్, పీహెచ్‌సీలతోపాటు 104 కూడా ఆరోగ్యశ్రీకి రిఫరల్‌ పాయింట్‌గా వ్యవహరించాలన్నారు. ప్రతి పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులను నియమించామని, మండలానికి రెండు పీహెచ్‌సీలు ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రతి వైద్యుడు నెలకు రెండుసార్లు గ్రామాల్లో పర్యటించాలని, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్‌నెస్‌ రెండూ ఉండేలా వ్యవహరించాలన్నారు.

బాధితులకు సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ 
కోవిడ్‌ బాధితులకు 190 మంది సైకియాట్రిస్టులు, 16 మంది క్లినికల్‌ సైకాలజిస్ట్‌లతో కౌన్సిలింగ్‌ నిర్వహిస్తూ సలహాలు, సూచనలు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల ప్రకారం సైకలాజికల్‌ కౌన్సిలింగ్‌ నిర్వహిస్తున్నామని, అవసరమైన వారికి మందులు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. సైకలాజికల్‌  కౌన్సిలింగ్‌ సమర్ధంగా ఉండాలని సీఎం సూచించారు. థర్ఢ్‌ వేవ్‌ హెచ్చరికలను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే మూడు దఫాలు నిపుణులతో వెబినార్‌ నిర్వహించామని అధికారులు తెలిపారు. వెబినార్‌లో చర్చించిన అంశాలపై కొత్త వైద్యులకు కూడా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. టెలీమెడిసిన్‌ కూడా అందుబాటులో తెస్తున్నామని అధికారులు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యశాఖ) ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌(నాని), సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ ఛైర్‌పర్సన్‌ డాక్టర్‌ కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, వైద్య,ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌ కుమార్‌ సింఘాల్, కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌ ఎం.టి.కృష్ణబాబు,  వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ మేనేజిమెంట్, వ్యాక్సినేషన్‌) ఎం.రవిచంద్ర, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, 104 కాల్‌ సెంటర్‌ ఇన్‌చార్జ్‌ ఏ.బాబు, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఏ.మల్లిఖార్జున్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ వి.విజయరామరాజు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు.

ఆదివారం నాటికి కోవిడ్‌ ఇలా
► రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 44,773 
► ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు 7,998 
► కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో చికిత్స పొందుతున్నవారు 5,655 
► రికవరీ రేటు 96.95 శాతం
► పాజిటివిటీ రేటు 4.46 శాతం
► నెట్‌వర్క్‌ ఆస్పత్రులలో  93.62 శాతం బెడ్లలో ఆరోగ్యశ్రీ కింద రోగులకు చికిత్స 
► 104 కాల్‌ సెంటర్‌ ద్వారా వచ్చిన కాల్స్‌  868 
► బ్లాక్‌ ఫంగస్‌ కేసులు 3,329
► చికిత్స పొందుతున్నవారు 1,441 
► మృతి చెందినవారు 253 
► డిశ్చార్జ్‌ అయినవారు 1,635

మరిన్ని వార్తలు