ఫుడ్‌ ప్రాసెసింగ్‌@రూ.10వేల కోట్లు

24 Nov, 2020 03:44 IST|Sakshi

ప్రాసెసింగ్‌ క్లస్టర్లపై ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం జగన్‌  

భారీగా ఖర్చు చేస్తున్నందున ప్రొఫెషనల్‌ విధానంలో పనిచేయాలి 

నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలి 

రైతులకు మంచి ధరలు అందించాలన్నదే మన లక్ష్యం  

సాక్షి, అమరావతి: రైతు భరోసా కేంద్రాల పరిధిలో గోడౌన్ల నిర్మాణం, జనతా బజార్లు, ప్రాథమికంగా ఆహార ఉత్పత్తుల శుద్ధి, రెండో దశ ప్రాసెసింగ్‌ తదితరాల కోసం దాదాపు రూ.10,000 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లపై పెద్ద ఎత్తున వ్యయం చేస్తున్నందున యూనిట్లన్నీ అత్యంత నైపుణ్యంతో ప్రొఫెషనల్‌ విధానంలో పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేలా చూడాలని అధికారులను ఆదేశించారు. నిర్వహణలో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. ప్రాసెసింగ్‌ అనంతరం మార్కెటింగ్‌ కోసం ఒప్పందాలు కుదుర్చుకునే సమయంలో విశ్వసనీయత ఉన్న సంస్థలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ క్లస్టర్లపై సీఎం సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

అదనపు విలువ జోడించాలి...
రైతులకు మంచి ధరలు అందించాలనే లక్ష్యానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. నిర్దేశిత ధరలకు పంటలను కొనుగోలు చేస్తామని ముందుగానే రైతులకు తెలియచేస్తున్నాం. కనీస గిట్టుబాటు ధరలు లభించని పక్షంలో రైతుల నుంచి ప్రభుత్వమే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇలా కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడించడం ముఖ్యం. ఇందుకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెటింగ్‌ విభాగం ప్రాసెసింగ్‌ యూనిట్లకు ముడి పదార్థాలు అందించేలా ఉండాలి. ప్రాసెస్‌ చేసిన ఉత్పత్తులను మార్కెటింగ్‌ సంస్థలకు అప్పగించాలి. 

ఆధునిక విధానంలో ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌
రాష్ట్రంలో ఎక్కడెక్కడ పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నాం? అందుకు అనుగుణంగా ఎక్కడెక్కడ ప్రాసెసింగ్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయాలనే అంశంపై అధికారులు కార్యాచరణ రూపొందించాలి. రైతుల నుంచి కొనుగోలు చేసే వ్యవసాయ ఉత్పత్తులకు సరిపడే సామర్థ్యంతో ప్రాసెసింగ్‌ యూనిట్లను నెలకొల్పాలి. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్న అరటి, చీనీ తదితర ఉత్పత్తుల ప్రాసెసింగ్, వాల్యూ యాడ్‌తో ఉత్పత్తుల తయారీ అంశాలపై దృష్టి పెట్టాలి. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, ప్యాకేజింగ్‌ తదితర అంశాల్లో కొత్త సాంకేతిక విధానాలపై ఒక విభాగం కృషి చేయాలి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగంలో ఒక మెగా ప్లాంట్‌ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలి.

25 యూనిట్లకు రూ.2,900 కోట్లు...
రాష్ట్రంలో 25 ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్ల ఏర్పాటు కార్యాచరణపై సమావేశంలో అధికారులు సీఎంకు వివరించారు. పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా రైతులు అధికంగా పండిస్తున్న పంటల వివరాలను సేకరించి వీటి ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. మొక్కజొన్న, చిరుధాన్యాలు, కందులు, అరటి, టమాటా, మామిడి, చీనీ, ఉల్లి, మిర్చి, పసుపు తదితర పంటల దిగుబడిపై వివరాలు తెలియచేస్తూ ప్రాసెసింగ్‌ యూనిట్లకు దాదాపు రూ.2,900 కోట్లు ఖర్చు అవుతుందని తెలిపారు. 

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా