ఆ కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం

20 Oct, 2020 16:14 IST|Sakshi

జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం ‌జగన్‌ స్పందన కార్యక్రమం

క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష

సాక్షి, అమరావతి : వరదల్లో చనిపోయిన వారి కుటుంబాలకు వెంటనే రూ.5 లక్షల పరిహారం అందించాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచించారు. పంట నష్టం అంచనాలను అక్టోబర్‌ 31లోగా పూర్తిచేయాలని ఆదేశించారు. వరద ముంపు ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులు వేగంగా జరిగేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. వర్షాలు, కోవిడ్‌, వార్డు సెక్రటేరిట్స్‌ తనిఖీలు, నాడు-నేడు తదితర అంశాలపై మంగళవారం ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్‌, తానేటి వనిత, సీఎస్‌ నీలం సాహ్ని, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
(చదవండి : రేపు ఇంద్రకీలాద్రికి సీఎం జగన్)

ఈ సందర్భంగా అధికారులకు సీఎం జగన్‌ పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. కలెక్టర్లు మానవతా ధృక్పదంతో పనిచేస్తూ.. కూలిన ఇళ్లు ఎక్కడ ఉన్నాయో గుర్తించి వెంటనే వారికి సహాయం అందించాలన్నారు. చనిపోయిన కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం అందేలా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అక్టోబర్‌ 31లోగా పంట నష్టానికి సంబంధించి అంచనాలు పూర్తి చేయాలని ఆదేశించారు. బడ్జెట్‌ ప్రతిపాదనలు కూడా 31లోగా  పూర్తి చేయాలని సూచించారు.  కరెంట్‌ పునరుద్ధరణను వేగంగా చేపట్టినందుకు కలెక్టర్లను సీఎం జగన్‌ అభినందించారు. ఈ నెల 27న రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు‌ వెల్లడించారు. సీఎం జగన్‌ ఇంకా ఎమన్నారంటే..

రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా
రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఒక సీజన్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని అదే సీజన్‌లో ఇస్తున్నాం.ఈ ఏడాది ఖరీఫ్‌ ఇన్‌పుట్‌ సబ్సిడీని వైయస్సార్‌ రైతు భరోసా రెండో  విడత చెల్లింపులతో పాటు ఇవ్వబోతున్నాం.జూన్, జూలై, ఆగస్టుతో పాటు, సెప్టెంబరు నెల ఇన్‌పుట్‌ సబ్సిడీని ఈనెల 27న ఇస్తున్నాం. ఖరీఫ్‌ పంటలకు సంబంధించి రూ.113 కోట్లు, ఉద్యాన పంటలకు సంబంధించి మరో రూ.32 కోట్లు. మొత్తం రూ.145 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీని రైతులకు చెల్లించబోతున్నాం. అక్టోబరు నెలకు సంబంధించిన ఇన్‌పుట్‌ సబ్సిడీపై నవంబరు 15లోగా నివేదిక ఇవ్వాలి. అటవీ భూముల పట్టాలు (ఆర్‌ఓఎఫ్‌ఆర్‌) ఇచ్చిన గిరిజనులకు కూడా వైయస్సార్‌ రైతు భరోసా కింద ఈనెల 27న రూ.11,500 చొప్పున ఇవ్వబోతున్నాం.
(చదవండి : సీఎం జగన్‌ను కలిసిన దివ్య తల్లిదండ్రులు)

కరోనా పాజిటివిటి రేటు బాగా తగ్గింది
రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 70 వేల పరీక్షలు చేస్తున్నాము, మరోవైపు పాజిటివిటీ రేటు కూడా గణనీయంగా తగ్గింది. నిన్న (19వ తేదీ) పాజిటివిటీ రేటు 4.76 శాతం మాత్రమే. ఇదే గత వారంలో 5.5 శాతంగా నమోదైంది. ప్రతి 10 లక్షల మందిలో 1,33,474 మందికి వైద్య పరీక్షలు చేస్తూ, దే«శంలోనే మొదటి స్థానంలో ఉన్నాం. రికవరీ రేటు 94.5 శాతం కూడా రాష్ట్రమే తొలి స్థానంలో ఉంది.

జాగ్రత్త పడాలి

కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దేశానికి సంబంధించిన సర్వే చూస్తే, కోవిడ్‌ వచ్చి తగ్గిన తర్వాత కూడా ఒక 10 శాతం కేసుల్లో మళ్లీ కొత్తగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. కిడ్నీ, బ్రెయిన్, చెవుడు వంటి పలు సమస్యలు వస్తున్నాయి. కోవిడ్‌ తగ్గిన తర్వాత కూడా కనీసం 6 వారాల నుంచి 8 వారాల పాటు రోగులు జాగ్రత్తగా ఉండాలన్న దానిపై ప్రజలకు అవగాహన కల్పించాలి.వారికి ఓరియెంటేషన్‌ నిర్వహించాలి.పోస్టు కోవిడ్‌ అనారోగ్య సమస్యలు ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చాము.
ఆ మేరకు ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశాలు జారీ చేశాము. 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి. ఆ నెంబరుకు ఫోన్‌ చేస్తే 30 నిమిషాల్లో బెడ్‌ కేటాయించాలి.దాదాపు 200కు పైగా ఉన్న కోవిడ్‌ ఆస్పత్రుల్లో ఆహార నాణ్యత, శానిటేషన్, వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు ఎలా ఉంది?. ఈ 4 అంశాలపై కోవిడ్‌ ఆస్పత్రుల్లో డ్రైవ్‌ కంటిన్యూ కావాలి.

హెల్ప్‌ డెస్క్‌లు– సేవలు:
ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్క్‌లు ఉండేలా చూడాలి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్‌ డెస్కులు ఉండాలి, వచ్చే 15 రోజుల్లో ఆ ఏర్పాట్లు జరిగి తీరాలి.ప్రతి హెల్ప్‌ డెస్క్‌ వెనక పోస్టర్‌ కూడా పూర్తి వివరాలతో ఉండాలి. ఆ డెస్కులో ఇద్దరు ఆరోగ్యమిత్రలు ఉండాలి. ఆ విధంగా రోజంతా ఆరోగ్యమిత్రలు సేవలందించాలి. ప్రతి ఆస్పత్రిలో హెల్ప్‌ డెస్కులను గమనించేలా సీసీ కెమెరాలు ఉండాలి, వాటిని జేసీలు పర్యవేక్షించాలి. ప్రతి ఆరోగ్య శ్రీ ఆస్పత్రి (ప్రభుత్వ, ప్రైవేటు)లో సీసీ కెమెరాలు ఉండి తీరాలి. ఆ హెల్ప్‌ డెస్కులలో కేవలం కూర్చోవడమే కాకుండా, ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌ఓపీ ఖరారు చేయండి. తను ఎందుకు కూర్చున్నాడు? తాను ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి? అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి. రోగుల నుంచి కానీ, ఆస్పత్రి నుంచి కానీ ఆరోగ్యమిత్రలు లంచం ఆశించకుండా చూడాలి. ఎవరైనా లంచం అడిగితే, ఎవరికి ఫిర్యాదు చేయాలో, ఆ నెంబర్‌ను పోస్టర్‌ ద్వారా ప్రదర్శించాలి. మనం ఒక రోగిగా ఆస్పత్రికి వెళ్తే, ఏ సహాయ, సహకారాలు కోరుకుంటామో, అవన్నీ ఆరోగ్యమిత్రలు చేయాలి.
– ఆ మేరకు ఎస్‌ఓపీ ఖరారు చేయాలి. ప్రతి ఆరోగ్యమిత్ర ప్రతి రోజూ జిల్లా వైద్యాధికారికి 4 అంశాలపూ నివేదిక ఇవ్వాలి. ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు, వైద్యుల అందుబాటు, మందుల అందుబాటు. వైద్య సేవలపై ఆరోగ్యమిత్రలు రోజూ నివేదిక ఇవ్వాలి. ఆ విధంగా ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో సేవలందేలా చూడడం కలెక్టర్లు, జేసీలు, ఆరోగ్య శాఖ కార్యదర్శి బాధ్యత.

స్పెషల్‌ డ్రైవ్‌:

  • కోవిడ్‌ నేపథ్యంలో వచ్చే 10 రోజులు డ్రైవ్‌ చేపట్టాలి.
  • కోవిడ్‌ వస్తే ఏం చేయాలన్న దానిపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి.
  • 104 నెంబర్‌. తప్పనిసరిగా మాస్కులు ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు తరుచూ శభ్రంగా కడుక్కోవడం.
  • ఈ నాలుగింటిపై స్కూళ్లు తెరిచిన తర్వాత పిల్లలకు ఓరియెంటేషన్‌ చేయాలి.
  • పిల్లలకు ఆ అవగాహన చాలా అవసరం.

రెండు రోజులకు ఒకసారి తరగతులు:

  • నవంబరు 2న స్కూళ్లు తెరుస్తారు
  • 1, 3, 5, 7 తరగతులు ఒక రోజు. 2,4, 6, 8 తరగతులు మరోరోజు నిర్వహిస్తారు.
  • ఒక వేళ విద్యార్థుల సంఖ్య 750కి పైగా ఉంటే మూడు రోజులకు ఒకసారి తరగతులు నిర్వహిస్తారు. 
  • అదే విధంగా స్కూళ్లు కేవలం మధ్యాహ్నం వరకు మాత్రమే పని చేస్తాయి. భోజనం పెట్టి విద్యార్థులను ఇంటికి పంపిస్తారు.
  • నవంబరు నెలలో ఇది అమలవుతుంది.
  • డిసెంబరులో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది.
  • ఒక వేళ తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపకపోతే, వారి కోసం ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలి.

సీజనల్‌ వ్యాధులు:

  • వర్షాలు, వరదలు తగ్గిన తర్వాత అంటు వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి శానిటేషన్, పరిశుభ్రమైన నీరుపై దృష్టి పెట్టాలి.
  • అవసరమైన అన్ని మందులు.. పాముకాటుకు విరుగుడు ఇంజెక్షన్, కుక్క కరిస్తే ఇచ్చే ఇంజెక్షన్లు కూడా ఉండాలి.
  • అన్ని మందులు డబ్ల్యూహెచ్‌ఓ ప్రమాణాలు కలిగి ఉండాలి.
  • 104 నెంబరు కేవలం కోవిడ్‌కు మాత్రమే కాకుండా, ఇతర వైద్య సేవలకు కూడా సేవలందించేలా ఉండాలి.
  • ముఖ్యంగా అంటువ్యాధుల విషయంలో కలెక్టర్లు పూర్తి అప్రమత్తంగా ఉండాలి.

జాతీయ ఉపాథి హామీ పనులు:

  • గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్లు, వైయస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి.
  • ప్రతి  జిల్లాకు రూ. 10 కోట్ల విలువైన పని దినాలు ఇస్తున్నాం. వారు సకాలంలో అన్నీ పూర్తి చేస్తే, అదనంగా మరో 5 కోట్ల పని దినాలు ఇస్తాము.

నాడు–నేడు

స్కూళ్లు:

  • స్కూళ్లలో చేపట్టిన పనులను కనీసం నవంబరు 15 నాటికి అయినా పూర్తి చేయాలి. 
  • పేరెంట్‌ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి.
  • ఇంకా 153 స్కూళ్లలో పనులు మొదలు కాలేదు. 472 టాయిలెట్లకు శ్లాబ్‌ పడాలి.
  • 91 నాబార్డు స్కూళ్లలో పనులు మొదలు కావాల్సి ఉంది.

అంగన్‌వాడీ కేంద్రాలు:

  • ఇంకా 7,375 అంగన్‌వాడీ కేంద్రాలకు స్థలాలు గుర్తించాల్సి ఉంది.
  • రాష్ట్రంలో 27,561 అంగన్‌వాడీ కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
  • వాటి కోసం 20,186 భవనాల కోసం స్థలాలు గుర్తించడం జరిగింది. 

వైఎస్సార్‌ ఆరోగ్య కేంద్రాలు

  • భవిష్యత్తులో అవి గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి.
  • వాటిలో ఆశా వర్కర్లు ఉంటారు. హెల్త్‌ అసిస్టెంట్లు కూడా ఉంటారు. వారి దగ్గర 55 రకాల ఔషథాలు ఉంటాయి.
  • 355 అర్బన్‌ ఆరోగ్య కేంద్రాల కోసం భూమి గుర్తించడం జరిగింది.
  • ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
  • జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
  • అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణం కూడా వేగంగా జరగాలి.

వైద్య కళాశాలలు:

  • కొత్తగా ఏర్పాటు చేస్తున్న వైద్య కళాశాలలకు (అదోని, పిడుగురాళ్ల) ఇంకా భూసేకరణ జరగాల్సి ఉంది.
  • అలాగే పాత వైద్య కళాశాలలకు సంబంధించి కాకినాడ, ఒంగోలు, అనంతపురంలో భూసేకరణ లేదా భూమి అప్పగింత సమస్యలు ఉన్నాయి.
  • వాటిని కలెక్టర్లు వెంటనే పరిష్కరించాలి.
  • ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒక టీచింగ్‌ ఆస్పత్రితో పాటు, నర్సింగ్‌ కళాశాల ఏర్పాటు ప్రభుత్వ లక్ష్యం.
  • వాటిలో వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. కాబట్టి వాటిపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. 

గ్రామ, వార్డు సచివాలయాల తనిఖీ:

ఒక ఉన్నత లక్ష్యంతో..:

  • కలెక్టర్లు, జేసీలు, తరుచూ సచివాలయాలను తనిఖీ చేయాలి.
  • ఈ విషయంలో కలెక్టర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం చూపొద్దు.
  • కలెక్టర్లు వెళితే జేసీలు వెళ్తారు. వారు వెళితే ఇతర అధికారులు కూడా తనిఖీ చేస్తారు.
  • ప్రాజెక్టు ఆఫీసర్, సబ్‌ కలెక్టర్, మున్సిపల్‌ కమిషనర్, జిల్లాలో ప్రతి ఐఏఎస్‌ అధికారి తప్పనిసరిగా సచివాలయాలు తనిఖీ చేయాలి.
  • గ్రామ స్థాయిలో ప్రతి ఒక్కరికి మంచి జరగాలి. ఎక్కడా అవినీతికి తావుండదు. ప్రతిదీ పారదర్శకంగా ఉండాలి.
  • అదే నా సంకల్పం. అందుకే అత్యంత ప్రాధాన్యం.
  • కాబట్టి ప్రతి అధికారి తప్పనిసరిగా తనిఖీలు చేయాలి.

సకాలంలో సేవలు

  • నిర్దేశిత గడువులో సేవలు (ఎస్‌ఎల్‌ఏ) ఇప్పుడు 96.6 శాతం అందుతున్నాయి. ఇది నూటికి నూరు శాతం కావాలి.
  • దరఖాస్తు తర్వాత 90 రోజుల్లో ఇంటి స్థలం ఇస్తామన్నాము,అది కచ్చితంగా జరిగి తీరాలి.
  • పెన్షన్‌ కానుక మంజూరు, ఆరోగ్యశ్రీ కార్డుల జారీ, బియ్యం కార్డుల జారీ, ఇళ్ల స్థలాల కేటాయింపు.
  • ఈ నాలుగింటికి ఎస్‌ఎల్‌ఏ ఉండగా, కొత్తగా 15 రెవెన్యూ సర్వీసులను కూడా చేర్చడం జరిగింది.

జగనన్న తోడు:

  • నవంబరు 6న పథకం ప్రారంభం,దరఖాస్తు దారులందరికీ బ్యాంకర్లతో మాట్లాడి రుణాలు మంజూరు చేయించాలి.
  • పథకం ప్రారంభం నాటికి దరఖాస్తు దారులందరికీ బ్యాంకులు రుణాలు మంజూరు చేసేలా చూడాలి.

వైఎస్సార్‌ బీమా

  • రేపు (21వ తేదీన) పథకం ప్రారంభం,రేపే బ్యాంకుల ఖాతాల్లో ఆ మేరకు ప్రీమియమ్‌ మొత్తం జమ చేస్తున్నాం.
  • వారం రోజుల్లో ఆ మొత్తం లబ్ధిదారుల ఖాతాలకు చేరుతుంది.
  • అయితే ప్రతి ఒక్కరికి ఈ పథకంలో బ్యాంక్‌ ఖాతా ఉండాలి. 

ఇంధన శాఖ:
నాణ్యమైన విద్యుత్‌ కోసమే..:

  • వ్యవసాయ కనెక్షన్లకు మీటర్లు ఏర్పాటు చేయడం వల్ల విద్యుత్‌ సరఫరాలో మరింత నాణ్యత ఉంటుందన్న విషయంపై రైతులకు అవగాహన కల్పించాలి.
  • మీటర్లు ఏర్పాటు చేసినప్పటికీ రైతులకు ఒక్క రూపాయి కూడా భారం పడబోదన్న విషయం స్పష్టం చేయాలి.
  • విద్యుత్‌ బిల్లుల మొత్తం రైతుల ఖాతాల్లో పడుతుంది. వారు ఆ మొత్తాన్ని డిస్కమ్‌లకు చెల్లిస్తారు. తద్వారా క్వాలిటీ పవర్‌ గురించి వారు ప్రశ్నించవచ్చు.

అది రైతుల హక్కు:

  • ‘రైతులకు ఉచిత విద్యుత్‌’ ఒక హక్కు. అందుకే మీటర్ల ఏర్పాటు. 
  • గత ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్‌కు సంబంధించి 14 నెలల కాలానికి సంబంధించి ఏకంగా రూ.8700 కోట్లు బకాయి పెట్టిపోయింది.
  • రైతులకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇవ్వడం కోసం 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు.
  • దాని వల్ల యూనిట్‌ విద్యుత్‌ కేవలం రూ.2.50కే వస్తుంది.
  • ఆ విధంగా రైతులకు వచ్చే 30 ఏళ్ల వరకు నాణ్యమైన విద్యుత్‌ను ఉచితంగా ఇవ్వొచ్చు.
  • వీటన్నింటిపై రైతులకు తగిన అవగాహన కల్పించడంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
  • ఇందుకోసం గ్రామ, వార్డు సచివాలయాల్లో పోస్టర్లు ప్రదర్శించాలి. 
  • ఈ పథకం సక్సెస్‌ కావొద్దని కొందరు భావిస్తున్నారు.
  • కాబట్టి మనం అంకిత భావంతో పని చేయాలి. 

 చివరగా, వివిధ పథకాల అమలు తేదీలను ప్రస్తావించిన సీఎం శ్రీ వైయస్‌ జగన్, అన్నింటిలోనూ కలెక్టర్లు, జేసీలది కీలకపాత్ర అని పేర్కొన్నారు. ఆ దిశలో వారు ప్రతి కార్యక్రమం, పథకంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కోరారు.

మరిన్ని వార్తలు