విశాఖలోని పేదల చేతికి పదివేల కోట్ల ఆస్తి!

27 Apr, 2022 05:09 IST|Sakshi
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం పైడివాడలో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి జోగి రమేష్‌కు వివరిస్తున్న మంత్రి అమర్‌నా««థ్, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలు సిద్ధం

రేపు సీఎం జగన్‌ చేతుల మీదుగా పంపిణీ

వీటి విలువ రూ.10 వేల కోట్లకు పైమాటే

విశాఖ చరిత్రలో తొలిసారి భారీగా ఇళ్ల పట్టాలు మంజూరు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖపట్నం మునిసిపల్‌ కార్పొరేషన్‌ (జీవీఎంసీ)లోని పేద ప్రజల సొంతింటి స్వప్నం నిజం కాబోతోంది. ఎన్నో ఏళ్లుగా తాము ఎదురుచూస్తున్న ఇళ్ల పట్టాల మంజూరు కార్యక్రమానికి ఈ నెల 28న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. జీవీఎంసీ పరిధిలోని 1.23 లక్షల మందికి ఇళ్ల పట్టాలను అందించనున్నారు.  విశాఖపట్నం పరిధిలో భారీగా పెరిగిన భూమి ధరలను పరిగణనలోకి తీసుకుని ఈ ఇళ్ల పట్టాల విలువను లెక్కిస్తే.. ఆ ఆస్తి విలువ రూ. 10 వేల కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేశారు. గతంలో టీడీపీ హయాంలో అంటే 2014–19 మధ్యకాలంలో కేవలం 13,686 మందికి మాత్రమే పట్టాలను జారీచేశారు. అది కూడా కేవలం తమ పార్టీ వారికేనన్న విమర్శలున్నాయి. అయితే, ఇందుకు భిన్నంగా ప్రస్తుత ప్రభుత్వం అర్హత ఉన్న ప్రతీ ఒక్కరికీ పట్టాలను మహిళల పేరు మీద అందించనుంది. ఇందుకోసం అర్హుల జాబితాను ఒకటికి రెండు సార్లు పరిశీలించి మరీ లబ్ధిదారుల జాబితాను అధికారులు తయారుచేశారు. జీవీఎంసీ పరిధిలో ఇంత భారీగా గతంలో ఎన్నడూ ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. మొత్తంగా విశాఖ చరిత్రలో ఈ ఇంటి పట్టాల పంపిణీ గొప్పగా నిలిచిపోనుందన్న అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది.

కుట్రలపై విజయం..
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్లులేని పేదలకు ఇంటి పట్టాలతో పాటు ఇళ్లను కూడా మంజూరు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా పనులు చేపట్టారు. అయితే, జీవీఎంసీ పరిధిలో మాత్రం ఇంటి పట్టాల పంపిణీ జరగకుండా తప్పుడు పేర్లు, ఫిర్యాదులతో హైకోర్టులో ప్రతిపక్షాలు కేసులు వేశాయి. ఫలితంగా గతంలో ఇంటి పట్టాల పంపిణీ జరగలేదు. అయితే, కోర్టులో విచారణలో అసలు కేసులో పేర్కొన్న వ్యక్తులు కనీసం ఫిర్యాదు కూడా చేయలేదని, వారి పేరుతో తప్పుడు కేసును వేశారని పూర్తి ఆధారలతో స్పష్టమైంది. హైకోర్టులో కేసు వీగిపోవడంతో పట్టాల పంపిణీకి మార్గం సుగమం అయ్యింది. వాస్తవానికి విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో ఇంటి స్థలం కొనుగోలు చేయడం సాధారణ ప్రజలకు సాధ్యమయ్యే పనికాదు. అందువల్ల అనేక మంది అద్దె ఇళ్లల్లో, ఇరుకు గదుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. జీవీఎంసీ పరిధిలోని పేదలకు ఇచ్చేందుకుగానూ 4,661.42 ఎకరాల్లో 71 లేఅవుట్లలో 1.23 లక్షల మందికి ఇంటి పట్టాలను సీఎం చేతుల మీదుగా అందించనున్నారు. ఒక్కొక్కరికి ఒక్కో సెంట్‌ చొప్పున స్థలం అందనుంది. 

పూర్తిగా అభివృద్ధి చేసిన ప్లాట్లు
అంతర్గత డ్రైనేజీ, తాగునీటి సదుపాయం, 30 అడుగుల రోడ్లు, ఇతర సదుపాయాలతో మొత్తం 71 లేఅవుట్లలో పూర్తిగా అభివృద్ధి చేశారు. ఈ లేఅవుట్లు ఒక్కో చోట ఒక్కో ధర ఉంది. ఉదాహరణకు ఆనందపురం మండలంలో తంగుడుబిల్లి వంటి చోట్ల సెంటు ధర ఏకంగా రూ. 10 లక్షలు పలుకుతోంది. ఇక పద్మనాభం మండలం రెడ్డిపల్లి లేఅవుట్‌లో సెంటు ధర రూ. 8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉంది. సగటు ధర లెక్కిస్తే సెంటు రూ. 5.70 లక్షలు ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. మొత్తం 1.23 లక్షల మందికి లెక్కిస్తే సుమారు ఈ మొత్తం రూ. 8,270 కోట్లు అవుతుంది. ఇక ఇందులో లక్ష మందికి ఇళ్లను మంజూరు చేయగా.. ఒక్కో ఇంటి నిర్మాణం కోసం రూ. 1.80 లక్షలు ప్రభుత్వం అందించనుంది. ఈ మొత్తం మరో రూ. 1,800 కోట్లు అవుతుంది. అంటే మొత్తం రూ.10,070 కోట్ల ఆస్తిని జీవీఎంసీలోని పేద ప్రజలకు సీఎం అందించనున్నారని అధికారులు చెబుతున్నారు.  

మరిన్ని వార్తలు