చరిత్ర ఎరుగని 'ఆసరా' ఇది

8 Oct, 2021 03:08 IST|Sakshi
వైఎస్సార్‌ ఆసరా రెండో విడత చెక్కుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చిత్రంలో పలువురు లబ్ధిదారులు

అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నా.. రెండు విడతల్లో రూ.12,758 కోట్లు అందించాం

వైఎస్సార్‌ ఆసరా రెండో విడత ప్రారంభ కార్యక్రమంలో సీఎం జగన్‌ 

నవరాత్రుల మొదటి రోజు ఈ కార్యక్రమం నా అదృష్టంగా భావిస్తున్నా

నాడు చంద్రబాబు మాట నమ్మి డ్వాక్రా అక్క చెల్లెమ్మలు రోడ్డున పడే పరిస్థితి 

ఓ వైపు రుణాలు మాఫీ కాక, మరో వైపు సున్నా వడ్డీ రద్దుతో చేతులెత్తేసిన గ్రూపులు 

వారి కష్టాలను, గ్రామీణ అర్థిక వ్యవస్థ దెబ్బతింటున్న పరిస్థితిని కళ్లారా చూశాను

నాలుగు విడతల్లో అప్పు మొత్తం మీ చేతికిస్తానని పాదయాత్రలో మాట ఇచ్చాను

ఎన్ని ఇక్కట్లు ఉన్నప్పటికీ మీ పరిస్థితి మార్చేందుకు సాయం చేస్తున్నాం 

తొలి విడత రూ.6,318 కోట్లు.. ఇప్పుడు రెండో విడత రూ.6,440 కోట్లు పంపిణీ

ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు

మహిళా పక్షపాత ప్రభుత్వంగా అడుగులు ముందుకు వేస్తున్నాం

ఒంగోలులో మంచి నీటి సరఫరా ప్రాజెక్ట్‌కు రూ.409 కోట్లు మంజూరు  

రాష్ట్రంలో 7,97,000 పొదుపు సంఘాల్లో ఉన్న 78,76,000 మంది అక్కచెల్లెమ్మలు 2019 ఏప్రిల్‌ నాటికి రూ.25,517 కోట్లు బ్యాంకులకు బాకీ పడ్డారు. ఈ మొత్తాన్ని 4 విడతల్లో ఉచితంగా వారి చేతికే అందిస్తామని చెప్పాం. ఆ మాటకు కట్టుబడి తొలి ఏడాది రూ.6,318 కోట్లు ఇచ్చాం. రెండో ఏడాది రూ.6,440 కోట్లు జమ చేస్తున్నాం. రెండు విడతల్లో రూ.12,758 కోట్లు లబ్ధి కలిగించాం. ఇలాంటి కార్యక్రమం దేశ చరిత్రలో ఎక్కడా జరిగి ఉండదు.      
– సీఎం జగన్‌

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ ఒంగోలు సబర్బన్‌: ‘గత ప్రభుత్వం చేసిన మోసానికి పొదుపు సంఘాలన్నీ కకావికలం అయ్యాయి. వడ్డీతో కలిపి అప్పులు తడిసిమోపెడయ్యాయి. లక్షలాది రూపాయల టర్నోవర్‌తో ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలు ‘సి’, ‘డి’ గ్రేడ్‌కు పడిపోయాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న అక్కచెల్లెమ్మలను ఒక అన్నగా, ఒక తమ్ముడిగా ఆదుకుంటానని చెప్పాను. ఎన్నికల నాటికి ఉన్న అప్పులను నాలుగు విడతల్లో ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాట నిలుపుకుంటూ ఇవాళ ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ, అవన్నీ అక్కచెల్లెమ్మల కష్టాల ముందు చిన్నవే అని భావించి రెండో విడత వైఎస్సార్‌ ఆసరా కింద సాయం పంపిణీని ప్రారంభిస్తున్నాం’ అని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

ఈ కార్యక్రమాన్ని గురువారం ఆయన ఒంగోలులోని పీవీఆర్‌ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ప్రారంభించారు. మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ ఆసరా రెండో విడత డబ్బును పొదుపు సంఘాల ఖాతాల్లో జమ చేసే ఈ కార్యక్రమం ఈ నెల 18వ తేదీ వరకు (13, 15వ తేదీల్లో పండగ మినహాయింపు) కొనసాగుతుందని చెప్పారు. నవరాత్రుల మొదటి రోజు ఈ కార్యక్రమం ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానన్నారు. మండలం ఒక యూనిట్‌గా చేపడుతున్న ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులందరూ పాలుపంచుకోవాలని కోరారు. ఉప ఎన్నిక కోడ్‌ ఉన్నందున వైఎస్సార్‌ జిల్లాలో మాత్రం నవంబర్‌ 6 నుంచి నవంబర్‌ 15వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకొని మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను పరిశీలిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

నాడు అప్పుల ఊబిలో 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు 
► స్వయం సహాయ సంఘాలకు రుణమాఫీ చేస్తామని, రుణాలు కట్టవద్దని, 2014 ఎన్నికల్లో అప్పట్లో చంద్రబాబు ఇచ్చిన మాటను నమ్మి ఆయన్ను గద్దెనెక్కించారు. ఆయన మాత్రం అక్కచెల్లెమ్మలను దగా చేశారు. 2014లో రూ.14,204 కోట్లుగా ఉన్న పొదుపు సంఘాల రుణాలు.. అసలు, వడ్డీలు, ఆ వడ్డీల మీద వడ్డీలు కలిసి 2019 ఎన్నికల నాటికి రూ.25,517 కోట్లకు చేరాయి.
► ఫలితంగా అక్కచెల్లెమ్మలు రోడ్డున పడే పరిస్థితి. 18.36 శాతం సంఘాలు బకాయిలు చెల్లించలేక (ఎన్‌పీఏ – నాన్‌ పెర్‌ఫార్మింగ్‌ అసెట్‌) మూతపడ్డాయి. చాలా సంఘాలు నిర్వీర్యం అయిపోయాయి. సున్నా వడ్డీ పథకాన్ని కూడా 2016 అక్టోబర్‌ నుంచి పూర్తిగా రద్దు చేశారు. దీంతో పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు సుమారు రూ.3,036 కోట్లు బ్యాంకులకు అపరాధ వడ్డీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడింది. 
► చంద్రబాబు కారణంగా దాదాపు 80 లక్షల మంది అక్కచెల్లెమ్మలు నష్టపోయారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినే ప్రమాదం నెలకొంది. ఈ పరిస్థితుల మధ్య నా పాదయాత్రలో ఆ రోజు నేను ఇచ్చిన మాటనే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టాం. ఆ మాట మేరకు వారిని అప్పుల ఊబి నుంచి బయట పడేసేందుకు వైఎస్సార్‌ ఆసరా పథకానికి శ్రీకారం చూట్టాం.
 
నేడు తిరిగి ‘ఎ’ గ్రేడ్‌లోకి సంఘాలు 
► వైఎస్సార్‌ ఆసరా పథకంలో భాగంగా 7.97 లక్షల డ్వాక్రా పొదుపు సంఘాల్లోని 78.76 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు గత ఏడాది మొదటి విడత రూ.6,318 కోట్లు, ఇప్పుడు రెండో విడత మరో రూ 6,440 కోట్లు నేరుగా అందిస్తున్నాం. రెండు విడతల్లో మొత్తంగా దాదాపు రూ.12,758 కోట్లు వారి చేతుల్లో పెట్టినట్లవుతోంది.
► సున్నా వడ్డీ పథకం కింద సకాలంలో రుణాలు చెల్లించిన 9.41 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని 98 లక్షల అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి రెండేళ్లలో రూ.2,362 కోట్లు జమ చేశాం. వీటితో పాటు ‘వైఎస్సార్‌ చేయూత’ అనే పథకం ద్వారా చేయి పట్టుకుని నడిపిస్తున్నాం. 
► తద్వారా ఇవాళ పొదుపు సంఘాలన్నీ తిరిగి నిలదొక్కుకున్నాయి. ఎన్నో సంఘాలు ‘ఎ’ గ్రేడ్‌లోకి చేరాయి. దీంతో ఎన్‌పీఏ గ్రూపుల శాతం 18.36 నుంచి 0.73 శాతానికి తగ్గిందని సగర్వంగా చెబుతున్నా. పర్యవసానంగా బ్యాంకులకు రికవరీ రేటు శాతం 99.5గా నమోదవుతోంది.  
రెండో విడత వైఎస్సార్‌ ఆసరా పథకం కింద డబ్బులు తమ ఖాతాల్లో పడడంతో విశాఖలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్న మహిళలు  

వైఎస్సార్‌ చేయూతతో మరింత భరోసా 
► 45–60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అక్కచెల్లెమ్మలకు వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా నాలుగేళ్లలో రూ.75 వేల సాయం అందిస్తూ అండగా నిలిచాం. 24.56 లక్షల మందికి రెండు విడతల్లో రూ.8,944 కోట్లు ఇచ్చాం. ఆర్థిక చేయూతతో పాటు సాంకేతిక, బ్యాంకింగ్, మార్కెటింగ్, శిక్షణ, తదితర సహకారం ఇస్తూ వాళ్లు వ్యాపారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.  
► ఇప్పటికే ప్రొక్టర్‌ అండ్‌ గ్యాంబుల్, ఐటీసీ, రిలయన్స్, హిందూస్థాన్‌ లీవర్, అమూల్‌æ, అలానా గ్రూప్, మహేంద్ర గ్రూపు, కేపీ గ్రూప్, టానగేర్‌ వంటి వ్యాపార దిగ్గజాలు, బహుళజాతి సంస్థలతోపాటు, బ్యాంకులతో కూడా ఒప్పందాలు చేసుకుని అక్కచెల్లెమ్మలు వ్యాపార వేత్తలుగా రాణించేందుకు ప్రతి అడుగులోనూ తోడుగా ఉన్నాం. 
► ఇప్పటి వరకు 3,05,754 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా షాపులు.. ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం వంటి వ్యాపారాలు చేపట్టి నెలకు రూ.7 వేల నుంచి రూ.10 వేలు అదనపు ఆదాయం పొందుతున్నారు. అమూల్‌తో ఒప్పందం వల్ల మార్కెట్‌లో పోటీ పెరిగి లీటరు పాలపై రూ.5 నుంచి రూ.15 వరకు అదనపు ఆదాయం లభిస్తోంది.  

పదవుల్లోనూ మహిళా పక్షపాతమే.. 
► దేశ చరిత్రలో తొలిసారిగా నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ కాంట్రాక్టుల్లో 50 శాతం మహిళలకు దక్కేలా ఏకంగా చట్టం చేశాం. హోం మంత్రిగా ఒక మహిళకు స్థానం కల్పించాం. ఉప ముఖ్యమంత్రిగా ఒక ఎస్టీ మహిళకు స్థానం దక్కింది. ఇద్దరు మైనార్టీ మహిళలను ఎమ్మెల్సీలుగా పంపించాం. ఒక బీసీ మహిళకు స్థానం కల్పించాం. చివరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా కూడా చరిత్రలో తొలిసారిగా ఒక మహిళను నియమించాం. 
► నామినేటెడ్‌ పదవులు, నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్మన్లు, డైరెక్టర్లలో మహిళలకు 52 శాతం పదవులు దక్కాయి. మునిసిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీ చైర్మన్‌లు, మేయర్లు.. వీటన్నింటిలో  60.47 శాతం పదవులు అక్క చెల్లెమ్మలకే ఇచ్చాం. 
► 13 జిల్లా పరిషత్‌ అధ్యక్ష స్థానాల్లో ఏడుగురు మహిళలే కనిపిస్తున్నారు. ప్రకాశం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ కూడా మహిళ అని.. నాకు తల్లిలాంటిదని సగర్వంగా తెలియజేస్తున్నా. మేయర్‌ కూడా నాకు అక్కలాంటిదే. వైస్‌ చైర్మన్‌ పదవుల్లో 26 మందికి గాను 15 మంది మహిళలే.  
► మద్యాన్ని నియంత్రించగలిగాం. దిశ చట్టం బిల్లు పాస్‌ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దిశ యాప్‌ 75 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లోని సెల్‌ఫోన్లలో ఉంది. ఆపద వేళ వెంటనే ఆదుకుంటుంది. దిశ పోలీసు స్టేషన్లు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, ప్రతి గ్రామ సచివాలయంలో మహిళ పోలీసు కనిపిస్తున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో చిట్టి తల్లులకు ప్రత్యేకంగా మరుగుదొడ్ల నిర్మాణం జరుగుతోంది. 7 నుంచి 12వ తరగతి వరకు చిట్టి తల్లుల కోసం స్వేచ్ఛ కార్యక్రమాన్ని మొన్ననే ప్రారంభించాం.  
► ఇలా అడుగడుగునా మహిళా పక్షపాతం చూపిస్తున్న ఈ ప్రభుత్వానికి దేవుని ఆశీస్సులు, మీ అందరి చల్లని దీవెనలు కలకాలం ఉండాలని కోరుకుంటూ వైఎస్సార్‌ ఆసరా రెండో విడత నగదు పంపిణీ ప్రారంభిస్తున్నా.  
► ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆదిమూలపు సురేష్, ఎంపీలు మాగుంట శ్రీనివాసులరెడ్డి, నందిగం సురేష్, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ తలశిల రఘురామ్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు.  

ఎన్నెన్నో పథకాలు.. ఎంతగానో లబ్ధి  
► 21వ శతాబ్దపు ఆధునిక భారతీయ మహిళ ఆంధ్రప్రదేశ్‌లోనే ఆవిర్భవించాలని నిండు మనస్సుతో చిత్తశుద్ధితో మనందరి ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తోంది. జగనన్న అమ్మఒడి ద్వారా 44.50 లక్షల మంది తల్లులకు, 85 లక్షల మంది పిల్లలకు మంచి జరిగేలా ఏటా రూ.6,500 కోట్లు చొప్పున ఇప్పటికే రూ.13,023 కోట్లు అందజేశాం.  
► వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక ద్వారా 61 లక్షల మందికి పెన్షన్‌ ఇస్తున్నాం. (గత ప్రభుత్వ హయాంలో ఇందులో సగం కంటే కొంచెం ఎక్కువ) అప్పట్లో రూ.వెయ్యి వస్తుంటే ఈరోజు రూ.2,250 ఇస్తున్నాం. అప్పట్లో నెలకు రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు. ఈ రోజు నెలకు రూ.1450 కోట్లు. ఇప్పుడిస్తున్న 61 లక్షల పెన్షన్లలో 36.70 లక్షల మంది అవ్వలకు, మహిళా వికలాంగులకు, వితంతువులకు ఇచ్చిన మొత్తం రూ.20,894 కోట్లు. 
► ‘అర్హులైన పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో 31 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. రెండు విడతల్లో ఇళ్లు కూడా కట్టిస్తున్నాం. గృహ నిర్మాణం ద్వారా ఇంటికి నలుగురు చొప్పున దాదాపు 1.25 కోట్ల మందికి అంటే రాష్ట్ర జనాభాలో నాలుగింట ఒక వంతు మందికి లబ్ధి కలుగుతోంది. నిర్మాణం పూర్తయ్యాక ప్రతి అక్క, ప్రతి చెల్లి చేతికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలు వరకు నేరుగా అందించినట్లవుతుంది. ఈ లెక్కన రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద వారి చేతుల్లో పెడుతున్నాం.  
► జగనన్న విద్యాదీవెన (ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకం) ద్వారా 18.81 లక్షల మంది తల్లులకు ఇప్పటికే రూ.5,573 కోట్లు ఇచ్చాం. 
► హాస్టల్‌ ఖర్చులకు ఇబ్బంది ఉండకూడదని జగనన్న వసతి దీవెన పథకం ద్వారా   15.58 లక్షల మంది అమ్మల ఖాతాల్లో రూ.2,270 కోట్లు నేరుగా జమ చేశాం.  
► వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద దాదాపు కోటి మంది అక్కచెల్లెమ్మలకు రూ.2,354 కోట్లు అందజేశాం. 
► గర్భిణులు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా పౌష్టికాహారం అందిస్తున్నాం.  30.16 లక్షల మందికి మేలు చేస్తూ రూ.2,881 కోట్లు ఖర్చు చేశాం.  
► రాష్ట్రంలో ఉన్న అంగన్‌వాడీ కేంద్రాలన్నింటినీ వైఎస్సార్‌ ప్రీప్రైమరీ స్కూళ్లుగా, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా మారుస్తూ అడుగులు ముందుకేశాం.  
► వైఎస్సార్‌ కాపు నేస్తం ద్వారా ఇప్పటి వరకు రూ.982 కోట్లు 3.28 లక్షల మంది అక్కచెల్లెమ్మల చేతుల్లో పెట్టాం. 

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలు 
ఆర్థికంగా నిలదొక్కుకునేలా మనందరి ప్రభుత్వం వారి చరిత్రను తిరగరాస్తే.. వారు మన రాష్ట్ర చరిత్రను తిరగ రాస్తున్నారు. పని చేస్తున్న ప్రభుత్వాన్ని నిండు మనసుతో దీవిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలతో మొదలైన ఆ దీవెన.. మునిసిపల్, కార్పొరేషన్, తిరుపతి ఉప ఎన్నిక, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు.. ఇలా ప్రతి ఎన్నికల్లో కనిపిస్తోంది. నా మీద, మనందరి ప్రభుత్వం మీద మీరు చూపిస్తోన్న ఆదరణ, ఆప్యాయత, ప్రేమానురాగాలకు తోడు మీ కష్టానికి మీకెంత చేసినా తక్కువే.   

యుద్ధ ప్రాతిపదికన వెలిగొండ పనులు  
కాసేపటి క్రితం వాసన్న (మంత్రి బాలినేని) అడిగిన రూ.409 కోట్ల నీటి ప్రాజెక్టు మంజూరు చేస్తున్నా. వెలిగొండ ప్రాజెక్టు మొదటి టన్నెల్‌ పనులు పూర్తయ్యాయి. రెండో టన్నెల్‌ పనులు వేగవంతం చేసి.. యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. 2022 ఆగస్టు నాటికి మొదటి టన్నెల్లో 3 వేల క్యూసెక్కుల నీళ్లు పారతాయి. రెండో టన్నెల్‌ కెపాసిటీ మరో 9 వేల క్యూసెక్కులు. ఈ ప్రాజెక్ట్‌ నాన్న కల. 2023 ఫిబ్రవరి నాటికి రెండో టన్నెల్‌ కూడా పూర్తవుతుంది. 

పుట్టింటోళ్లలా ఆదుకున్నారు
కష్టాలొచ్చినప్పుడు పుట్టింటోళ్లు ఎలా ఆదుకుంటారో మీరు (వైఎస్‌ జగన్‌) అలా మమ్మల్ని ఆదుకున్నారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో మీరు మా కష్టాలు చూశారు. అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం మేము బ్యాంకులకు బాకీ పడిన మొత్తాలను చెల్లిస్తున్నారు. గత ఏడాది రూ.24 వేలు, ఇప్పుడు రూ.24 వేలు వచ్చింది. చంద్రబాబు పాలనలో అప్పుల పాలయ్యాం. అప్పట్లో ప్రైవేటు ఫైనాన్స్‌ సంస్థల నుంచి అధిక వడ్డీలకు అప్పులు తీసుకోవాల్సిన పరిస్థితి. అంతకు ముందు వైఎస్సార్‌ పాలనలో పావలా వడ్డీ కింద రుణాలిచ్చారు. మీరు అధికారంలోకి వచ్చాకే మళ్లీ పావలా వడ్డీ రుణాలు అందుతున్నాయి. వైఎస్సార్‌ చేయూత, ఇతరత్రా పథకాల ద్వారా కూడా లబ్ధి పొందుతున్నాం. పిల్లలకు మంచి చదువు ఇచ్చి జీవితాలను సుఖమయం చేస్తున్నారు. ఎప్పుడూ మీరే సీఎంగా ఉండాలి.  
– స్వాతి, పాకల, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా

మీ పాలనలో మహిళల్లో సంతోషం
రుణాల మాఫీ అని చంద్రబాబు నిలువునా మోసం చేశారు. చివరకు వడ్డీల మీద వడ్డీలు పెరిగి నానా అవస్థలు పడ్డాం. మీరు తండ్రికి తగ్గ తనయుడిలా పాలన సాగిస్తున్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలను ఆదుకుంటున్నారు. వైఎస్సార్‌ ఆసరా, వైఎస్సార్‌ రైతు భరోసా పథకాల ద్వారా తొలి ఏడాదిలోనే మాకు రూ.97 వేలు అందాయి. వీటితో పొలం పనులు, డ్వాక్రా చూసుకుంటూనే రెండు గేదెలను కొనుక్కున్నాను. అమూల్‌ పాల కేంద్రంలో పాలు పోసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. లీటరు ధర రూ.50 నుంచి రూ.75 వరకు వస్తోంది. పిల్లల్ని బాగా చదివించుకుంటున్నాను. స్త్రీ నిధి లోను ద్వారా మరో రెండు గేదెలు కొనుక్కున్నాను. ఇప్పుడు మీ ద్వారా ఇల్లు కూడా కట్టుకుంటున్నాం. మీ పాలనలో మహిళలు చాలా సంతోషంగా ఉన్నారన్నా. 
– అశ్విని, అల్లూరు, కొత్తపట్నం మండలం, ప్రకాశం జిల్లా

ఆ లేఖ ఏదో బాబుకే రాయండి
సీఎం వైఎస్‌ జగన్‌కు ఈ జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారట. మీకు నిజంగా ప్రజలపై ప్రేమ ఉంటే ఆ లేఖ ఏదో మీ చంద్రబాబుకు రాయాల్సింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ప్రకాశం జిల్లాకు ఒక్క నిర్దిష్టమైన పని చేశారా? అని లేఖ రాయాల్సింది. ఆ ఐదేళ్లలో జిల్లా ప్రజలకు ఏమీ చేయలేదు కాబట్టి ప్రజలు చీదరించుకుంటున్నారని చంద్రబాబుకు లేఖ రాయాల్సింది. అలా రాసి ఉంటే ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారు.  చంద్రబాబు చేసిన మోసాన్ని డ్వాక్రా మహిళలు మరచిపోలేదు. పొత్తు పెట్టుకోకుండా పోటీ చేసే ధైర్యం లేదు. ఇక జనసేనానిఒంటరిగా పోటీ చేసి.. రెండు సీట్లు తెచ్చుకోమనండి చూద్దాం. పాదయాత్రలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ప్రజలు 151 అసెంబ్లీ సీట్లు ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు సీఎం జగన్‌ హామీలన్నీ అమలు చేసుకుంటూ వస్తున్నారు. ఒంగోలు నగరంలో నాలుగు రోజులకు ఒకసారి మంచినీళ్లు ఇవ్వాల్సి వస్తోంది. ప్రజల దాహార్తి తీర్చడానికి రూ.400 కోట్లు మంజూరు చేయాలని కోరుతున్నాం.
– బాలినేని శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి

అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు
రెండో విడత వైఎస్సార్‌ ఆసరా కార్యక్రమం ద్వారా ఒంగోలుతో పాటు రాష్ట్రమంతా దసరా పండుగ వారం ముందే వచ్చినట్లుంది. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ముఖ్యమంత్రి ముందుకు సాగుతున్నారు. మహిళా పక్షపాతిగా సీఎం వైఎస్‌ జగన్‌ ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అమ్మలోని మొదటి అక్షరం ‘అ’ ను, నాన్నలోని రెండో అక్షరం ‘న్న’ను తీసుకొని.. అన్నగా, జగనన్నగా, తోబుట్టువుగా, మా పిల్లలకు మేనమామగా.. అంటూ అక్కచెల్లెమ్మలు సీఎం జగన్‌ను తమ తమ కుటుంబ సభ్యునిగా భావిస్తున్నారు. ఈ దృష్ట్యా మన సీఎం.. అక్క, చెల్లెమ్మల జీవితాల్లో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా చైతన్యాన్ని తీసుకొస్తూ ఇంటి పెద్దగా బాధ్యతలు తీసుకున్నారు. టీడీపీ నేతలు ఎన్ని కుట్రలు చేసినా, కులాల మధ్య చిచ్చు పెట్టినా, మతాల మధ్య మనస్పర్థలు రేపినా రాష్ట్ర ప్రజలు మాత్రం జగనన్న పక్షానే ఉంటారన్నది గుర్తు పెట్టుకోవాలి.  
– ఆదిమూలపు సురేష్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి

నాయకుడంటే జగన్‌లా ఉండాలి
వైఎస్‌ జగన్‌ ఎన్నికలకు ముందు 3,648 కిలో మీటర్ల పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని రెండు పేజీలతో మేనిఫెస్టో రూపొందించారు. వాటిలో ఇప్పటికే 90 శాతం పైగా పూర్తి చేశారు. ఇతరత్రా ఎన్నో హామీలు నెరవేర్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా అయ్యే నాటికి అంటే 2014కు ముందు డ్వాక్రా మహిళల రుణాలు రూ.14,200 కోట్లు ఉన్నాయి. అధికారంలోకి వస్తే మాఫీ చేస్తానన్నాడు. ఆ మాట నిలుపుకోలేదు. 2019 ఏప్రిల్‌ 11న ఎన్నికలు జరిగే నాటికి ఆ రుణాలు కాస్తా అసలు, వడ్డీ, చక్ర వడ్డీలు కలుపుకొని రూ.25,517 కోట్లకు చేరాయి. నాలుగు విడతల్లో ఈ రుణాల మొత్తాన్ని మన సీఎం డ్వాక్రా మహిళలకు అందజేస్తున్నారు. చంద్రబాబు అటకెక్కించిన సున్నా వడ్డీ పథకాన్ని తిరిగి ప్రారంభించారు. రూ.2.361.5 కోట్ల బకాయిలు చెల్లించారు. నాయకుడంటే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌లా ఉండాలి.  
– పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భ గనుల శాఖ మంత్రి 

>
మరిన్ని వార్తలు