సకల సౌకర్యాలతో జర్మన్‌ హ్యాంగర్‌ ఆస్పత్రి

5 Jun, 2021 03:42 IST|Sakshi
క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి తాడిపత్రిలోని కోవిడ్‌ ఆస్పత్రిని ప్రారంభిస్తున్న సీఎం జగన్‌

తాడిపత్రిలో 500 పడకల కోవిడ్‌ తాత్కాలిక ఆస్పత్రిని వర్చువల్‌ విధానం ద్వారా ప్రారంభించిన సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి, తాడిపత్రి రూరల్‌: కరోనా రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించడంలో భాగంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఆర్జాస్‌ స్టీల్‌ పరిశ్రమ వద్ద రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా జర్మన్‌ హ్యాంగర్స్‌ విధానంలో 500 ఆక్సిజన్‌ పడకల తాత్కాలిక కోవిడ్‌ ఆసుపత్రి ప్రారంభమైంది.  ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తన క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. కోవిడ్‌ కేసులు ఎక్కువగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ నిల్వలను సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు చూపిన చొరవ అభినందనీయం అన్నారు. ‘ఆర్జాస్‌ స్టీల్‌కు ఉన్న ఎయిర్‌ సెపరేషన్‌ ప్లాంట్‌ ద్వారా రోజూ దాదాపుగా వచ్చే 100 టన్నుల లిక్విడ్‌ ఆక్సిజన్‌ను ఉపయోగించుకుని జర్మన్‌ హ్యాంగర్‌లతో ఈ ఆస్పత్రిని ఏర్పాటు చేయడం నిజంగా గర్వించదగినది. అందరూ బాగా పని చేశారు. పేరుపేరునా అందరికీ అభినందనలు. చంద్రుడూ.. గుడ్‌ జాబ్‌..’ అంటూ కలెక్టర్‌ గంధం చంద్రుడిని అభినందించారు. అర్జాస్‌ స్టీల్స్‌ ఎండీ శ్రీధర్‌ కృష్ణమూర్తికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ఈ కష్టకాలంలో మీరు చేసిన సాయం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో క్యాంప్‌ కార్యాలయం నుంచి డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (నాని), పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తాడిపత్రి నుంచి రోడ్లు, భవనాల శాఖ మంత్రి శంకరనారాయణ, ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి, సిద్దారెడ్డి, తిప్పేస్వామి, ఎమ్మెల్సీ శమంతకమణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

రికార్డు సమయంలో ఏర్పాటు 
► కేవలం రెండు వారాల వ్యవధిలో 11.50 ఎకరాల విస్తీర్ణంలో, లక్ష చదరపు అడుగుల్లో ఈ ఆస్పత్రి ఏర్పాటైంది. ఇందులోని 500 పడకలకూ ఆక్సిజన్‌ సదుపాయం ఉంది. మేఘా గ్రూపు వారు సాంకేతిక సహకారం అందించారు. 
► అనంతపురం జిల్లాతో పాటు వైఎస్సార్, కర్నూలు జిల్లాలకు చెందిన రోగులకు కూడా ఇక్కడ బెడ్లు కేటాయిస్తారు. ప్రతి పెషెంట్‌ బెడ్‌ వద్ద ఆక్సిజన్, ప్రతి 30 బెడ్లకు ఓ నర్సింగ్‌ స్టేషన్‌ ఏర్పాటు చేశారు.  
► 200 మంది నర్సులు, 50 మందికి పైగా వైద్యులు.. మొత్తం 350 మందికి పైగా వైద్య సిబ్బంది ఇక్కడ సేవలందిస్తారు. 
► శనివారం (నేడు) నుంచి వైద్య సేవలు ప్రారంభమవుతాయి.   

Read latest Andhra-pradesh News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు