Andhra Pradesh: ఏపీలో రేపటి నుంచి కర్ఫ్యూ

4 May, 2021 03:16 IST|Sakshi

ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు 144 సెక్షన్‌తో సడలింపు

ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు

12 తరువాత షాపులన్నీ మూసివేయాలి.. అత్యవసరాలకు మాత్రమే మినహాయింపు

రెండు వారాల పాటు ఆంక్షలు

కోవిడ్‌ నియంత్రణపై సమీక్షలో సీఎం జగన్‌ కీలక నిర్ణయాలు

ఆక్సిజన్‌ స్టోరేజీకి తగినన్ని ట్యాంకర్లు సేకరించాలని అధికారులకు ఆదేశం

సాక్షి, అమరావతి: కోవిడ్‌ వ్యాప్తి నియంత్రణలో భాగంగా రేపట్నుంచి రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలు ఇబ్బంది పడకుండా నిత్యావసరాలు  కొనుగోలు చేసేందుకు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్‌ అమలు చేస్తూ సడలింపు కల్పిస్తారు. ఆ సమయంలో ఐదుగురికి మించి గుమికూడరాదు. మధ్యాహ్నం 12 తరువాత షాపులన్నీ తప్పనిసరిగా మూసివేయాలి. అత్యవసరాలకు మాత్రం మినహాయింపు ఉంటుంది. రెండు వారాల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి.

కోవిడ్‌ నియంత్రణ, నివారణ, వ్యాక్సినేషన్‌పై సోమవారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఈమేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో బుధవారం నుంచి కర్ఫ్యూ, ఆంక్షలు అమలు చేయాలని, ప్రజలు గుమికూడకుండా 144 సెక్షన్‌ అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. అన్ని కోణాల్లో చర్చించిన అనంతరం ప్రజల దైనందిన జీవితానికి ఇబ్బంది కలగకుండా అవసరాలు తీర్చడంతోపాటు వ్యాపారులు, ఇతర వర్గాలకు ఇబ్బంది లేకుండా సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు, పరీక్షలు, వైద్య సేవలకు సంబంధించిన వివరాలను ఈ సందర్భంగా అధికారులు తెలియచేశారు.

పక్కాగా పరీక్షలు..
కోవిడ్‌ పాజిటివ్‌గా గుర్తించిన వారి ప్రైమరీ కాంటాక్ట్‌లను గుర్తించి పరీక్షలు చేయాలని.. ఇది పక్కాగా జరగాలని సమీక్షలో సీఎం జగన్‌ ఆదేశించారు. ప్రభుత్వ ఎంప్యానెల్‌ (జాబితా)లో ఆస్పత్రుల్లో వైద్యులు, పారా మెడికల్‌ సిబ్బంది కొరత లేకుండా చూడాలని సూచించారు. 
కోవిడ్‌ నియంత్రణపై నిర్వహించిన సమీక్షలో సీఎం జగన్, మంత్రి ఆళ్ల నాని తదితరులు 

ఆక్సిజన్‌ సరఫరా..
అన్ని ఆస్పత్రులలో రోగులకు సరిపడా ఆక్సిజన్‌ను అందుబాటులో ఉంచేలా దిగుమతి చేసుకోవాలని, నిల్వ చేసేందుకు తగిన సంఖ్యలో ట్యాంకర్లు సేకరించాలని, ఏ ఆస్పత్రిలోనూ ఆక్సిజన్‌ కొరత లేకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

1.66 కోట్ల మందికి పరీక్షలు..
రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 1,66,02,873 పరీక్షలు నిర్వహించామని సమీక్షలో అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం 558 కోవిడ్‌ ఆస్పత్రుల్లో 44,599 బెడ్లు ఉండగా 37,760 మంది కోవిడ్‌ చికిత్స పొందుతున్నారని తెలిపారు. 3,597 మంది వెంటిలేటర్లపై చికిత్స పొందుతుండగా, 1,01,204 మంది హోం ఐసొలేషన్‌లో ఉన్నారని చెప్పారు.

కోవిడ్‌ కేర్‌ సెంటర్లు..
రాష్ట్రవ్యాప్తంగా 81 కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 41,780 బెడ్లు ఉండగా మే 2వతేదీ నాటికి 9,937 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో ఇంకా 31,843 బెడ్లు అందుబాటులో ఉన్నాయన్నారు. 104 కాల్‌ సెంటర్‌కు పెద్ద సంఖ్యలో ఫోన్లు వస్తున్నట్లు చెప్పారు.

కోటా పెంచాలని కేంద్రానికి వినతి..
జిల్లాలలో ఆక్సిజన్‌ వసతి ఉన్న ఆస్పత్రులు 146 ఉండగా ఆక్సిజన్‌ పైప్‌లైన్‌ ఉన్న బెడ్లు 26,446 ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. రోజుకు సగటున 420 నుంచి 500 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ వినియోగిస్తుండగా ఈనెల రెండో వారం చివరి నాటికి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రానికి 480 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేటాయించగా రవాణాకు అవసరమైన ట్యాంకర్లు లేక 448 మెట్రిక్‌ టన్నులు మాత్రమే  తీసుకోగలుగుతున్నట్లు (ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులు కలిపి) తెలిపారు. ఆక్సిజన్‌ రవాణాతో పాటు స్టోరేజీకి ట్యాంకర్ల అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్‌కు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కోటా పెంచాలని కేంద్రాన్ని కోరామని అధికారులు వెల్లడించారు. పెరంబదూరు (తమిళనాడు), బళ్లారి (కర్ణాటక) నుంచి 200 మెట్రిక్‌ టన్నుల చొప్పున ఆక్సిజన్‌ రవాణా చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. రవాణా కోసం వాహనాలు (ట్యాంకర్లు) ఇవ్వాలని కూడా కోరామన్నారు. 

8 లక్షల ఇంజెక్షన్లకు ఆర్డర్లు..
రాష్ట్రంలో కొత్తగా మైలాన్‌ ల్యాబ్‌ నుంచి 8 లక్షల రెమిడెస్‌విర్‌ ఇంజెక్షన్ల కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చామని అధికారులు తెలిపారు. ఎన్‌–95 మాస్కులు 5,67,844, పీపీఈలు 7,67,732, సర్జికల్‌ మాస్కులు 35,46,100, హోం ఐసొలేషన్‌ కిట్లు 2,04,960 నిల్వ ఉన్నాయని చెప్పారు. 

52 లక్షల మందికి తొలివిడత టీకాలు..
రాష్ట్రంలో 45 ఏళ్లకు పైబడిన వారిలో ఇప్పటివరకు 52 లక్షల మందికి తొలి విడత వాక్సిన్‌ ఇచ్చినట్లు అధికారులు వివరించారు. మొత్తం 1,33,07,889 మందికి వాక్సిన్‌ ఇవ్వాల్సి ఉందన్నారు.

– సమీక్షలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, కోవిడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ స్పెషల్‌ ఆఫీసర్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి (కోవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ కమిటీ ఛైర్మన్‌) ఎంటీ కృష్ణబాబు, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ కాటమనేని భాస్కర్, వైద్య ఆరోగ్య శాఖ (కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌) ముఖ్య కార్యదర్శి ఎం.రవిచంద్ర, ఆరోగ్యశ్రీ సీఈవో డాక్టర్‌ ఎ.మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు