జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించనున్న సీఎం జగన్‌

27 Apr, 2021 20:08 IST|Sakshi

అమరావతి: ‘ఉన్నత విద్యకు ఆలంబనగా, ఉన్నత చదువులే పిల్లలకు ఇవ్వగలిగే ఆస్తి’ అంటూ తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నేరవేర్చడం కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యార్ధుల కోసం తెచ్చిన జగనన్న వసతి దీవెన పథకాన్ని ఏప్రిల్‌ 28(బుధవారం)న ప్రారంభించనున్నారు. కంప్యూటర్‌ బటన్‌ నొక్కి దాదాపు 11 లక్షలకుపైగా విద్యార్ధుల తల్లుల ఖాతాలో ఈ పథకం ద్వారా నగదు జమ చేయనున్నారు. ఈ పథకంతో తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను సీఎం జగన్‌ నిలబెట్టుకొనున్నారు.

విద్యార్ధుల బంగారు భవిష్యత్తే లక్ష్యంగా గత వారం జగనన్న విద్యాదీవెన పథకంతో ఫీజు రీఇంబర్స్‌మెంట్‌కు సంబంధించి మొదటి త్రైమాసికానికిగాను 671.45 కోట్ల రూపాయలను విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం అందించింది. కాగా జగనన్న వసతి దీవెన పథకంతో విద్యార్థుల వసతి, భోజన, రవాణా ఖర్చులకు గాను మరో రూ. 1,147.41 కోట్లు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా జమచేయనుంది.

ఈ పథకంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన, రవాణా ఖర్చులను జగన్‌ ప్రభుత్వం అందించనుంది. కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి వారి తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం నేరుగా నగదు జమచేయనుంది. జగనన్న వసతి దీవెన పథకం కింద ప్రభుత్వం ఇప్పటికే రూ. 1,220.99 కోట్లు చెల్లించింది. మొదటివిడతగా రూ. 1,147.41 కోట్లు బుధవారం రోజు నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. దీంతో ఇప్పటివరకు జగనన్న వసతి దీవెన పథకం కింద రూ. 2,368.40 కోట్లు చెల్లించినట్లు అవుతుంది. ఇప్పటివరకూ జగన్‌ ప్రభుత్వం విద్యారంగంపై వివిధ పథకాల కింద సుమారు రూ. 25,812.60 కోట్లు ఖర్చు చేయగా, 1,60,75,373 మంది లబ్ధి పొందారు. 

చదవండి: జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్‌ సమీక్ష

మరిన్ని వార్తలు