మూగ జీవాలకూ అండగా..

20 May, 2022 03:46 IST|Sakshi
డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలు, పశువుల అంబులెన్సులను జెండా ఊపి ప్రారంభిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్సార్‌ సంచార పశు వైద్య సేవలకు శ్రీకారం.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం వైఎస్‌ జగన్‌ 

తొలి విడతగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 అంబులెన్స్‌లు

టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962కు కాల్‌ చేస్తే చాలు అందుబాటులో సేవలు

రెండో విడతలో మరో 165 అంబులెన్స్‌ల ఏర్పాటుకు చర్యలు

సాక్షి, అమరావతి: మూగ జీవాల కోసం రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్‌ వైఎస్సార్‌ సంచార పశు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చింది. నియోజకవర్గానికి రెండు చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా రూ.278 కోట్లతో 340 పశువుల అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. తొలి విడతగా రూ.143 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన 175 అంబులెన్స్‌లను తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం జెండా ఊపి ప్రారంభించారు.108,104 అంబులెన్స్‌ల తరహాలోనే అత్యాధునిక సౌకర్యాలతో ఈ మొబైల్‌ అంబులేటరీ క్లినిక్స్‌ను తీర్చిదిద్దారు.

అంబులెన్స్‌లో ఏర్పాటు చేసిన సౌకర్యాలను వ్యవసాయ, పశు సంవర్థక శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పశు సంవర్థక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్ర కుమార్‌లు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. సౌకర్యాల పట్ల సీఎం సంతృప్తి వ్యక్తం చేస్తూ మూగ జీవాలకు మెరుగైన నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేయాలని సూచించారు. రెండో విడతలో రూ.135 కోట్లతో 165 అంబులెన్స్‌లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. ఈ కార్యక్రమంలో డెప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాలకృష్ణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సౌకర్యాలు ఇలా..
► ప్రతి అంబులెన్స్‌లో ట్రావిస్‌తో పాటు వెయ్యి కిలోల బరువున్న మూగ జీవాన్ని తరలించేందుకు వీలుగా హైడ్రాలిక్‌ లిఫ్ట్‌ సౌకర్యం.
► 20 రకాల పేడ సంబంధిత పరీక్షలు, 15 రకాల రక్త పరీక్షలు చేసేందుకు వీలుగా మైక్రో స్కోప్‌తో కూడిన లేబరేటరీ.
► ప్రాథమిక వైద్య సేవలతో పాటు సన్న జీవాలు, పెంపుడు జంతువులు, పక్షులకు సర్జరీలు చేసేందుకు వీలుగా సౌకర్యాలు. అందుబాటులో సీజన్‌ వారీగా అవసరమైన వ్యాక్సిన్లు, అన్ని రకాల మందులు.
► ప్రతి వాహనంలో పశు వైద్యుడు, వెటర్నరీ డిప్లమో చేసిన సహాయకుడు, డ్రైవర్‌ కమ్‌ అటెండర్‌. 
► టోల్‌ ఫ్రీ నంబర్‌ 1962కు ఫోన్‌ చేసి పశువు అనారోగ్య సమాచారం తెలియజేస్తే చాలు రైతు ముంగిటకు వెళ్లి వైద్య సేవలు అందిస్తారు. అవసరమైతే సమీప పశు వైద్యశాలకు తరలించి మెరుగైన వైద్యం చేయిస్తారు.  పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి ఉచితంగా అదే అంబులెన్స్‌లో రైతు ఇంటికి భద్రంగా చేరుస్తారు.  

మరిన్ని వార్తలు