AP: రాష్ట్ర స్థాయి మెగా మేళా

6 Jun, 2022 04:34 IST|Sakshi

గుంటూరులో సీఎం జగన్‌ చేతుల మీదుగా ప్రారంభం 

సాక్షి, అమరావతి: రైతుల కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్‌ యంత్ర సేవ’ పథకం కింద రాష్ట్ర స్థాయి మెగా మేళాను మంగళవారం గుంటూరులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం 5,262 రైతు గ్రూపుల బ్యాంక్‌ ఖాతాలకు రూ.175.61 కోట్ల సబ్సిడీని జమ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్బీకే, క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలకు 3,800 ట్రాక్టర్లు, 320 కంబైన్డ్‌ హార్వెస్టర్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

మెగా మేళాలో ట్రాక్టర్లతో పాటు అనుసంధాన పరికరాలైన బంపర్, 3 పాయింట్‌ లింకేజ్, హెచ్‌ బార్, అలాగే కంబైన్డ్‌ హార్వెస్టర్ల ఒక ట్రాక్, ఏడాది పాటు సర్వీసింగ్, ఆపరేటర్‌కు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. మరోవైపు ఈ ఏడాది రెండు వేల గ్రామాల్లో రైతు సేవా కేంద్రాలకు డ్రోన్స్‌ కూడా సరఫరా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఇదిలా ఉంటే.. ప్రభుత్వం రూ.2,106 కోట్లతో ఆర్బీకే స్థాయిలో ఒక్కోటి రూ.15 లక్షల విలువైన 10,750 వైఎస్సార్‌ యంత్ర సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది.

వరి ఎక్కువగా పండించే 20 జిల్లాల్లో ఒక్కోటి రూ.25 లక్షల విలువైన కంబైన్డ్‌ హార్వెస్టర్లతో కూడిన 1,615 క్లస్టర్‌ స్థాయి యంత్ర సేవా కేంద్రాలను అందుబాటులోకి తెస్తోంది. రైతు గ్రూపులే ఈ యంత్ర సేవా కేంద్రాలను నిర్వహించనున్నాయి. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు