వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్న సీఎం జగన్‌

9 Dec, 2020 08:45 IST|Sakshi

హంద్రీనీవా నీటితో రాప్తాడు నియోజకవర్గం సస్యశ్యామలం 

సొంతూళ్లకు చేరుకుంటున్న వలస జనం 

రక్తపుటేరులు పారిన ప్రాంతంలో పచ్చని పొలాలు 

కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లో జలకళ

నేడు దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్లకు భూమిపూజ 

వర్చువల్‌ పద్ధతిలో రాజధాని నుంచి ప్రారంభించనున్న సీఎం

వర్గపోరు.. రక్తపుటేరులు.. ఆధిపత్యం కోసం సాగించిన మారణహోమంలో ఎంతో మంది బలయ్యారు. ఎన్నో కుటుంబాలు వీధినపడ్డాయి. అంతా ఓ కుటుంబం కనుసన్నల్లోనే.. చెప్పినట్టు వినాలి.. కాదన్న వారి తలలు తెగిపడ్డాయి. ఇదంతా గతంలో రాప్తాడు నియోజక వర్గంలోని గ్రామాల పరిస్థితి. కానీ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో ఫ్యాక్షన్‌ కు చరమగీతం పాడారు. అభివృద్ధి దిశగా అడుగులు వేయించారు. కరువు సీమలో కృష్ణమ్మ పరవళ్లకు అహరహం కృషి చేశారు. తాజాగా వైఎస్సార్‌ తనయుడు, సీఎం జగన్‌మోహన్‌రెడ్డి రక్తపుటేరులు పారిన ప్రాంతాల్లో కృష్ణా జలాలను పారించి కొత్త వెలుగులకు శ్రీకారం చుట్టారు. సీఎం అడుగుజాడల్లో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ‘లక్ష ఎకరాలకు సాగునీరు’ యజ్ఞం చేపట్టారు. 

సాక్షి, కనగానపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాలు 2009 వరకు పెనుకొండ నియోజకవర్గంలో ఉండేవి. రాజకీయ పెత్తనం,  గ్రామాల్లో ఆధిపత్యం కోసం ఓ వర్గం ఈ మండలాల్లో ఫ్యాక్షన్‌ను పెంచి పోషించింది. పేదలు వ్యవసాయం చేసుకుంటే తమ పెత్తనానికి బ్రేక్‌ పడుతుందని కుట్ర చేసింది. గ్రామీణులు సాగువైపు వెళ్లకుండా ఆధిపత్య పోరుకు ఉసిగొలిపింది. తమ మాట కాదన్న వారిని వేటాడి అంతమొందిస్తూ వచ్చింది. ఫలితంగా కనగానపల్లి మండలంలో 8, రామగిరిలో ఐదు, చెన్నేకొత్తపల్లిలో ఆరు గ్రామాల్లో ఫ్యాక్షన్‌ తారస్థాయికి చేరింది. ఇందులో కనగానపల్లి మండలంలోని మద్దెలచెరువు, తగరకుంట, భానుకోట, రామగిరి మండలంలోని కుంటిమద్ది, గంతిమర్రి, నసనకోట, చెన్నేకొత్తపల్లి మండలంలోని మేడాపురం, కనుముక్కల, నాగసముద్రం గ్రామాలు అత్యంత సమస్యాత్మక గ్రామాలుగా మారిపోయాయి..

దౌర్జన్యం.. దుర్మార్గం 
ఒకప్పుడు పచ్చని పంట పొలాలతో కళకళలాడిన కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో కరుడుకట్టిన ఫ్యాక్షనిస్టు కనుసన్నల్లో నియంతృత్వ ధోరణి రాజ్యమేలింది. రక్తపుటేరులు ప్రవహించాయి. నక్సలైట్ల కదలికలు, పోలీసుల కూంబింగ్‌లు.. ఫ్యాక్షనిస్టుల దౌర్జన్యం.. దుర్మార్గాలతో జనం కంటి మీద కునుకు దూరమైంది. పచ్చని పంట పొలాలు బీళ్లుగా మారాయి. 1994 నుంచి 2004 వరకూ సుమారు 120 మంది ఫ్యాక్షన్‌కు బలైనట్లు పోలీసుల లెక్కలు చెబుతున్నా.. అనధికారికంగా ఈ సంఖ్య రెట్టింపేనని స్థానికులు అంటున్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫ్యాక్షన్‌ హత్యలు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.  చదవండి:  (వైఎస్‌ జగన్‌​ మాట ఇస్తే తప్పరు: తోపుదుర్తి)


ఏర్పాట్లను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, ఎంపీ మాధవ్‌

ఒక్కసారిగా మారిన పరిస్థితి 
రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత వ్యవసాయానికి పెద్ద పీట వేస్తోంది. ఇందులో భాగంగా హంద్రీ–నీవా కాలువ ద్వారా కృష్ణా జలాలతో చెరువులను నింపడమే కాక, పంటల సాగుకూ నీటిని వదలడంతో గ్రామాల్లో ప్రజలు వ్యవసాయంపై దృష్టి పెట్టారు. నాటి ఫ్యాక్షన్‌ రాజకీయంతో విసిగిపోయి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు తిరిగి స్వగ్రామాలకు చేరుకున్నారు. వర్గ కక్షలకు దూరంగా.. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. అందువల్లే 2019 తర్వాత ఫ్యాక్షన్‌ హత్యల ప్రస్తావనే లేకుండా పోయింది. 

‘హంద్రీ–నీవా’ నీటితో సస్యశ్యామలం 
రాప్తాడు నియోజకవర్గంలోని ఆత్మకూరు, కనగానపల్లి, రామగిరి, రాప్తాడు, చెన్నేకొత్తపల్లి మండలాల మీదుగా హంద్రీ–నీవా కాలువ గుండా కృష్ణా జలాలు ప్రవహిస్తున్నాయి. కాలువ సరిహద్దు గ్రామాలైన కనగానపల్లి, రామగిరి, చెన్నేకొత్తపల్లి మండలాల్లోని సుమారు 12 చెరువులు, 15 కుంటలను కృష్ణా జలాలతో నింపారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో కాలువ దిగువన వేల ఎకరాల్లో పంటల సాగుకు నీరు అందింది. కనగానపల్లి మండలంలోని తగరకుంట, తూంచర్ల, బద్దలాపురం, యలకుంట్ల, గుంతపల్లి గ్రామాల్లో సుమారు వెయ్యి ఎకరాల్లో వరి, 500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులోకి వచ్చాయి. రామగిరి మండలంలోని కుంటిమద్ది, పోలేపల్లి, గంతిమర్రి గ్రామాల్లోనూ రైతులు విస్తారంగా పంటలు సాగు చేపట్టారు. ఒక్క కుంటిమద్ది చెరువు కింద 500 ఎకరాల్లో వరిసాగులోకి రావడం గమనార్హం. మేడాపురం, కనుముక్కల, ఒంటికొండ తదితర గ్రామాల్లో  వ్యవసాయ పనులు ఊపందుకోవడంతో ఫ్యాక్షన్‌ అనే పదం వినిపించకుండా పోయింది.  


వేదికను సిద్ధం చేస్తున్న దృశ్యం
ఆశలకు జీవం..
చెన్నేకొత్తపల్లి: రాప్తాడు నియోజకవర్గంలోని లక్ష ఎకరాలకు సారునీరందించే లక్ష్యంతో నిర్మిస్తున్న దేవరకొండ, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేయనున్నారు. చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద ఏర్పాటు చేసిన పైలాన్, మూడు రిజర్వాయర్ల భూమి పూజ పనులను ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడిపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ప్రారంభించనున్నారు. అనంతరం నిర్వహించే భారీ బహిరంగ సభకు జిల్లా ఇన్‌చార్జి మంత్రి, పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, రోడ్లు, భవనాల శాఖ మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటు ఎంపీలు గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మూడు రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మంగళవారం నాటికే ఏర్పాట్లన్నీ పూర్తి చేయించారు. 

ఏర్పాట్ల పరిశీలన 
చెన్నేకొత్తపల్లి మండలం వెంకటంపల్లి గ్రామం వద్ద నిర్వహిస్తున్న మూడు రిజర్వాయర్ల భూమిపూజ పనులకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. సభాస్థలి, రిజర్వాయర్ల పైలాన్, వాహనాల పార్కింగ్, భోజన కౌంటర్లు, ఎల్‌ఈడీ స్క్రీన్స్‌ వంటి ఏర్పాట్లను మంగళవారం పూర్తి చేశారు. కలెక్టర్‌ గంధం చంద్రుడు, జేసీ నిశాంత్‌కుమార్, ఆర్డీఓ మధుసూదన్‌లు దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 

లక్ష ఎకరాలకు సాగునీరే లక్ష్యం 
రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యం. ‘ప్రజాసంకల్ప’ యాత్రలో నియోజకవర్గ సమస్యలను స్వయంగా చూసిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలోనే ప్రజలకిచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేర్చారు. రాప్తాడు నియోజకవర్గంలోని చెన్నేకొత్తపల్లి మండలంలో దేవరకొండ రిజర్వాయర్, ముట్టాల, తోపుదుర్తి రిజర్వాయర్ల నిర్మాణాల ద్వారా రైతాంగానికి సాగు, తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది.  – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు ఎమ్మెల్యే 

మరిన్ని వార్తలు