Andhra Pradesh: శాసన రాజధానికి రహదారి

1 Jul, 2021 03:08 IST|Sakshi
శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. చిత్రంలో మంత్రులు, అధికారులు

కృష్ణా కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు సీఎం జగన్‌ శంకుస్థాపన 

రూ.150 కోట్లతో 15.52 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం 

నాలుగు వరుసల రహదారితో ట్రాఫిక్‌ కష్టాలకు పరిష్కారం 

సాక్షి, అమరావతి: ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది కుడి కరకట్ట రోడ్డు విస్తరణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు. బ్యారేజీ వద్ద కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం నుంచి రాయపూడి వరకు కరకట్ట రోడ్డును 15.52 కిలోమీటర్ల మేర రూ.150 కోట్ల ఖర్చుతో విస్తరించనున్నారు. కొండవీటి వాగు వరద ఎత్తిపోతల పథకం వద్ద నిర్వహించిన శంకుస్థాపన కార్యక్రమంలో శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి జగన్‌ ఆవిష్కరించారు. అనంతరం విస్తరణ పనులకు సంబంధించిన ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. పూర్తి నాణ్యతతో సకాలంలో పనులు పూర్తి చేయాలని అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధులకు సూచించారు.  

కరకట్ట పటిష్టం.. 
అమరావతి స్మార్ట్‌ అండ్‌ సస్టెయినబుల్‌ సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ నిధులతో జలవనరుల శాఖ ఆధ్వర్యంలో కరకట్ట రోడ్డు విస్తరణ పనులు జరగనున్నాయి. 10 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలుగా ఈ రోడ్డును విస్తరిస్తున్నారు. రెండు లైన్లలో వాహనాలు వెళ్లేందుకు, మరో రెండు వరుసలు ఇరువైపులా నడకదారుల కోసం కేటాయించారు. ఈ రోడ్డులో కొండవీటి వాగు బ్రిడ్జిని పునఃనిర్మించనున్నారు. అమరావతి ఎన్‌–1, ఎన్‌–2, ఎన్‌–3 రహదారులతోపాటు సీడ్‌ యాక్సెస్‌ రోడ్డు, గొల్లపూడి – చినకాకాని –విజయవాడ బైపాస్‌ రోడ్లను కరకట్ట రోడ్డుకు అనుసంధానం చేస్తారు. దీనిద్వారా రాజధాని ప్రాంతానికి పూర్తిస్థాయి రహదారి సౌకర్యం కలుగుతుంది. సచివాలయం, పలు విద్యా సంస్థలతోపాటు ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, ఉద్దండరాయునిపాలెం, రాయపూడి, బోరుపాలెం, అబ్బరాజుపాలెం, హరిశ్చంద్రపురం, వైకుంఠపురం గ్రామాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. సచివాలయం, హైకోర్టుకు వెళ్లేందుకు ప్రయాణ సమయం బాగా తగ్గుతుంది. రోడ్డు విస్తరణతో కరకట్ట పటిష్టంగా మారి తరచూ వరదల ముంపు బారిన పడే ఉండవల్లి, పెనుమాక, వెంకటపాలెం, మందడం, ఉద్దండరాయునిపాలెం, లింగాయపాలెం, రాయపూడి గ్రామాలకు మేలు జరుగుతుంది. ఈ రోడ్డు వల్ల ప్రధానంగా విజయవాడ వైపు నుంచి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టుకు వెళ్లి వచ్చే అధికారులు, ఉద్యోగులు, ప్రజల ట్రాఫిక్‌ సమస్యలు తీరతాయి.

హాజరైన మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు
శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రులు మేకతోటి సుచరిత, అనిల్‌కుమార్‌ యాదవ్, బొత్స సత్యనారాయణ, చెరకువాడ శ్రీరంగనాథరాజు, నారాయణస్వామి, సీహెచ్‌ వేణుగోపాలకృష్ణ, ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, నందిగం సురేష్, గుంటూరు జిల్లా కలెక్టర్‌ వివేక్‌యాదవ్, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, కల్పలత, ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, మద్దాలి గిరి, అన్నాబత్తుల శివ, షేక్‌ ముస్తఫా, గుంటూరు మేయర్‌ మనోహర్, మున్సిపల్‌ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీలక్ష్మి, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు