పులివెందులలో నేడు అపాచీ ఫుట్‌వేర్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన

24 Dec, 2020 03:31 IST|Sakshi
ఇడుపులపాయలో సీఎం జగన్‌కు చిత్రపటం అందిస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలు

28 ఎకరాల్లో ఇంటెలిజెంట్‌ సెజ్‌ యూనిట్‌ ఏర్పాటు

ఇడుపులపాయలో సీఎం జగన్‌కు చిత్రపటం అందిస్తున్న ప్రజాప్రతినిధులు, నేతలు

సాక్షి, అమరావతి/ సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్‌ జిల్లా పులివెందులలో ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ఇంటెలిజెంట్‌ సెజ్‌ (అపాచీ) ఏర్పాటు యూనిట్‌కు సీఎం జగన్‌ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకోసం పులివెందుల ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ పార్కులో 28 ఎకరాలను ఏపీఐఐసీ ఇంటెలిజెంట్‌ సెజ్‌కు కేటాయించింది. ఇది చిత్తూరు జిల్లా ఇనగలూరులో రూ.350 కోట్ల పెట్టుబడి అంచనాతో పది వేల మందికి ఉపాధి కల్పించేలా ఏర్పాటు చేయనున్న యూనిట్‌కు అనుబంధంగా పులివెందులలో కాంపోనెంట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది. సుమారు రూ.70 కోట్లతో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్‌ ద్వారా 2,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. గురువారం సీఎం జగన్‌ భూమి పూజ చేయడం ద్వారా నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. భారీ వర్షాల వల్ల పనులు ఆలస్యం కావడంతో పులివెందుల ఆటో పార్కు, వైఎస్సార్‌ ఈఎంసీ, వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ శంకుస్థాపన కార్యక్రమాలను సంక్రాంతి తర్వాతకు వాయిదా వేసినట్లు పరిశ్రమల శాఖ అధికారులు తెలిపారు. 
సీఎంకు స్వాగతం పలుకుతున్న మంత్రి సురేశ్‌ 

కాగా, సీఎం జగన్‌ 3 రోజుల పర్యటన కోసం బుధవారం వైఎస్సార్‌ జిల్లాకు చేరుకున్నారు. మధ్యాహ్నం సీఎం జగన్‌ కుటుంబ సభ్యులతో కలిసి తాడేపల్లి నుంచి విమానంలో బయలుదేరి 4.30కు కడప విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడ్నుంచి 4.45కు హెలికాప్టర్‌లో బయలుదేరి 5.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకున్నారు. సాయంత్రం 6.15కి అక్కడి నుంచి కారులో బయలుదేరి 6.20కి ఇడుపులపాయ వైఎస్సార్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. సీఎంకు ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రి ఆదిమూలపు సురేష్, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి తదితరులు స్వాగతం పలికారు.  

మరిన్ని వార్తలు